మోగిన సమ్మె సైరన్‌

రోడెక్కిన పంచాయతీ కార్మికులు సమ్మెలోకి పంచాయతీ కార్మికులు, ఉద్యోగులు మండల కేంద్రాల్లో ఆరంభమైన దీక్షలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మండల కార్యాలయాల ఎదుట ఆందోళనలు ప్రభుత్వం స్పందించకపోతే నిర్వహణ అస్తవ్యస్తం నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
– సమ్మెలోకి వెళ్లక తప్పడం లేదు

తమ సమస్యలు పరిష్కరించాలని గత నెల రోజులుగా ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. చివరకు తాము సమ్మెలోకి వెళ్లక తప్పడం లేదు. పంచాయతీ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం స్పందించడం లేదు. సమ్మె నోటీసు ఇచ్చినా పట్టనట్టు వ్యవహరిస్తుంది.
యాదయ్య, కారోబార్‌ దండుమైలారం
గ్రామ పం చాయతీల్లో కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదు. కార్మికులంతా తాత్కాలిక పద్ధతిలోనే కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కనీస వేతనం రూ.19,000 చెల్లించాలి. గ్రాట్యుటీ, బీమా సదుపాయాలు కల్పించాలి.
సీహెచ్‌ బుగ్గరాములు,, సీఐటీయూ మండల కార్యదర్శి
గ్రామ పంచాయతీ కార్మికులు, ఉద్యోగులు సమ్మె సైరన్‌ మోగించారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల క్రమబద్దీకరణ, మల్టీపర్పస్‌ వర్కర్స్‌ విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరంభమైంది. కార్మికులు తమ ప్రధాన డిమాండ్లతో సమ్మెకు వెళ్తున్నారు. వాటి అంగీకారం కోసం దశలవారీగా చేసిన ఆందోళనలకు, సమ్మె నోటీసులకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో చివరకు సమ్మెలోకి వెళ్లడానికే సిద్ధమయ్యారు. జిల్లాలో వ్యాప్తంగా మండల కేంద్రాలు కార్మికుల దీక్షలతో ఆరంభమయ్యాయి. కార్మికులంతా టెంట్ల కింద కూర్చుని తమ నిరసనను వ్యక్తం చేశారు. కాగా, స్థానిక గ్రామ పంచాయతీల ఎదుట నిరసన వ్యక్తం చేసిన కార్మికులు నేరుగా మండల, డివిజన్‌ కేంద్రాలకు తరలిచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చాకిరి చేస్తున్న.. ప్రభుత్వానికి కనికరం లేదా అంటూ నినదించారు. సీఐటీయూ, గ్రామ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె చేపట్టారు. జిల్లాలో సుమారు 2500 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరంతా సమ్మెలో ఇదే విధంగా పాల్గొంటే, గ్రామాల్లో పారిశుధ్యం మొదలుకొని తాగునీటి సరఫరా, మొక్కల సంరక్షణ, డ్రయినేజీల నిర్వహణ వంటి పనులు స్తంభించే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం పంచాయతీల్లో మల్టీపర్పస్‌ వర్కర్లకు రూ.8,500 వేతనాలిస్తుంటే, బిల్‌ కలెక్టర్లు, కారోబార్లు, పంప్‌ ఆపరేటర్లు, స్వీపర్లు తదితర ఉద్యోగులకు రూ.4.500 నుంచి రూ.10వేలకు లోబడే వేతనాలున్నాయి.
ఆరంభమైన హరితహారం
రాష్ట్ర ప్రభుత్వం హరితహారాన్ని ప్రారంభించింది. ప్రధానంగా మొక్కల సరరక్షణ బాధ్యతను పంచాయతీలే చూస్తున్నాయి. నిత్యం ట్రాక్టర్లతో నర్సరీల్లోని మొక్కలను నీటిని అందిస్తున్నారు. మరోవైపు వర్షాలు ఆరంభమవుతున్న తరుణంలో ఎప్పటికప్పుడు డ్రయినేజీ వ్యవస్థను మెరుగు పర్చాల్సిన అవసరముంటుంది. శుద్ది చేస్తూ బ్లీచింగ్‌ చల్లాలి. అంతే కాకుండా, ఇండ్ల మధ్యన పెరిగే పిచ్చిమొక్కలను తొలగించాల్సి ఉంటుంది. లేకుంటే దోమలు, ఈగలు వల్ల అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ఈ తరుణంలోనే కార్మికులు సమ్మెబాట పట్టారు. ప్రభుత్వం సమ్మె పట్ల నిర్లక్ష్యం వహిస్తే పెను ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలున్నాయి.
పంచాయతీ వర్కర్ల ప్రధాన డిమాండ్లు
సిబ్బందిని పర్మినెంట్‌ చేసి, ప్రత్యేక బడ్జెట్‌తో ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించాలి. కనీస వేతనం రూ.19,000 ఇవ్వాలి. స్వీపర్లకు రూ.15,600, ఎలక్ట్రీషియన్లు, కారోబార్లు, పంప్‌ ఆపరేటర్లు, డ్రైవర్లు, బిల్‌ కలెక్టర్లకు రూ.19,500 ఇవ్వాలని తమ డిమాండ్లలో పేర్కొన్నారు. జీవో నంబర్‌ 51 సవరించి, మల్టీపర్పస్‌ వర్కర్ల విధానం రద్దు చేయాలి. ప్రమాదబీమా రూ.10 లక్షలు వర్తింపజేయడంతో పాటు, సర్వీసున్న కార్మికులు, ఉద్యోగులు చనిపోతే కుటుంబంలో ఒకరికి ఉద్యోగమివ్వాలి. బీమాతో పాటు ఈఎస్‌ఐ, గ్రాడ్యుటీ సదుపాయం కల్పించాలి.