ప్రజాస్వామ్యానికి పాలకపక్షం – ప్రతిపక్షం రెండూ రెండు కండ్లులాంటివి. కండ్లు సమంగా ఉంటేనే చూపు సరిగా ఉంటుంది. ప్రతిపక్షం ధీటుగా ఉంటేనే పాలకపక్షం సక్రమంగా వ్యవహరించగలు గుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యం సజీవ ఆరోగ్య మనుగడకు బలమైన ప్రతిపక్షం తప్పనిసరి. స్వాతంత్య్రోద్యమ కాలం నుండి కమ్యూనిస్టులు ఈ పనిచేసారు. స్వాతంత్య్రానంతరం నెహ్రూ ప్రభుత్వానికి కమ్యూనిస్టులు అలా చెక్ పెట్టారు. ప్రతి అంశంలో చాలా పకడ్బందీగా, నిర్మాణాత్మకంగా వ్యవహరించడం వలనే నెహ్రూ ప్రభుత్వం కొంతలో కొంతైనా ప్రజానుకూలంగా వ్యవహరించడానికి అవకాశం ఏర్పడింది.
సైద్ధాంతిక విభేదాలతో సాగే పాలక- ప్రతిపక్షం సభ్యుల చర్చల సరళి అటు పార్లమెంటులోనూ, ఇటు పార్ల మెంటు బయటా ఎంతో ఉపయుక్తంగా ఉండేది. ప్రజల రాజకీయ చైతన్యాన్ని విజ్ఞానదాయకంగా పెంచేది. పత్రికలు మీడియా హుందాగా నడిచేవి. నేతల ఉపన్యాసాల్లో రాతల్లో ఆ భాషా సంస్కారం, రాజకీయ పరిణితి, సైద్ధాంతిక పరిపక్వత, చమత్కారం ప్రస్ఫుటించేవి. అంతిమంగా అవి ప్రజాస్వామ్యం ఉద్దీపనగావడానికి ఎంతగానో తోడ్పడేవి.
కానీ మనది భూస్వామ్య పెట్టుబడిదారీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రభుత్వం గనుక దాని పరిమితులు దానికి ఉంటాయి. అలాగే ఆ వర్గస్వభావమూ ఉంటుంది. ఆ దోపిడీ పీడన పాలనాంగాల్లో, చర్యల్లో అది వ్యక్తం అవుతూనే ఉంటుంది. వీర తెలంగాణా సాయుధ పోరాట కాలంలో నిజాం పోలీసులతో పాటు నెహ్రూ పటేల్ సైన్యం ఘాతుకాలకి వేలాదిమంది ప్రజానీకం బలికావడం తెలిసిందే. ఆ నిరుపేద ప్రజానీకం భయంకర నిర్భంధ చిత్రవధలకు గురవ్వడం. ప్రజానాయకులు అజ్ఞాతవాసాలకు వెళ్లడం. ప్రజల్ని క్రూరంగా పీడించిన దొరలూ దేశ్‌ముఖ్‌లే తిరిగి కాంగ్రెస్ నేతలుగా చెలామణిగావడం అందరూ ఎరిగిందే.
ఈ నేపథ్యంలో ప్రపంచంలో తొట్టతొలిసారిగా ఎన్నికల ద్వారా ఎన్నికైన కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ఘనత ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్‌దే. 1957లో సంభవించింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం ఉందని భారత ప్రజలకు చూపింది కమ్యూనిస్టులే. దున్నేవానికే భూమి చెందాలని భూ సంస్కరణలు ప్రవేశపెట్టడం. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలపెంపు (సమాన పనికి సమానవేతనం) ఉపాధి కల్పనకై కొత్తగా ప్రయివేటు పెట్టుబడుల ఆకర్షణ, ప్రయివేటు పాఠశాలలో సైతం ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకం మొదలైన చర్యలకు, ఆ ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు ఇవి ప్రత్యామ్నాయ విధానాలు. ఎక్కడ ఇవి ప్రజల్లో పాతుకు పోతాయేమోననే భయంతో 1959లో కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇ.ఎం.ఎస్. ప్రభుత్వాన్ని అక్రమంగా రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించింది.
ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించడం అంటే రాష్ట్రాల హక్కులను అంటే ఆ రాష్ట్ర ప్రజల ప్రజాస్వామిక హక్కులను సామూహికంగా కాలరాయడమే. అలా ఇప్పటివరకు దాదాపు 125 సార్లు కేంద్రం, వివిధ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించింది అంటే ఆ విధంగా ప్రతిపక్షాల నోళ్లు నొక్కేయడంగానే భావించాలి.
ఈ పరిస్థితుల్లో ఇప్పటి 18వ లోక్‌సభ ఎన్నికల పరిశీలించినట్లయితే బీజేపీ – ఎన్డీయే కూటమి గెలిచి ఓడినట్టుగా ఫీలవుతుంటే, కాంగ్రెస్ – ఇండియా కూటమి ఓడి గెలిచినట్టుగా సంబరపడిపోతున్నది. ప్రజానీకం కూడా ఈ మార్పును అర్థం చేసుకోగలుగుతున్నది. తమకు ఎదురేలేదనుకున్న బీజేపీ అందునా ప్రధాని మోడీ దుర్మార్గాలకు, దురాగతాలకు కచ్చితంగా ముకుతాడు వేసి అడ్డగించగలమని ఉత్సాహపడ్తున్నది. ‘ఈ ఎన్నికల్లో విపక్షాలు కొట్టిన చావుదెబ్బకు మోడీ సర్కార్ కనీసం నడవలేని స్థితికి చేరుకున్నదని’ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటున్నారు. భారత ఓటర్లు ప్రతిపక్షాలకు ఇచ్చిన ఆత్మస్థైర్యంగా దీనిని మనం చెప్పుకోవచ్చు.
లోక్‌సభ మెజారిటీ మార్కు 272 కాగా బీజేపీకి 240 మాత్రమే వచ్చాయి. అందుకే తెలుగుదేశం (16 మంది ఎంపీలు) నితీష్ కుమార్ జనతాదళ్ (12 మంది ఎంపీలు)పై ఆధారపడవలసి వచ్చింది. కాంగ్రెస్‌కు 99 వచ్చినా ఇండియా కూటమికి 232 లభించాయి.
ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం దాదాపు వందకోట్ల మంది భారత ఓటర్లలో 65 కోట్లమంది మాత్రమే ఓటు వేసారు. అంటే ప్రతి ముగ్గురులో ఇద్దరు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నారు. అందులో 37శాతం మంది అంటే 23 కోట్ల మంది మాత్రమే బీజేపీకి ఓటువేసారు. ఇది మాత్రమే బీజేపీ ప్రాతినిద్యం. మిగిలిన ప్రజాపక్షాన్ని ప్రతిపక్షంగా భావిస్తే ప్రతిపక్ష పాత్ర ఎంత విశాలమైనదో, ఎంత లోతైనదో, ఎంత పెద్ద బాధ్యతతో కూడుకున్నదో అవగతమవుతుంది. మరి దానికి తగిన విధంగా కాంగ్రెస్ వ్యవహరించగలదా? ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీ ఆ సమర్థతను చూపగలరా…? అనేది వేచిచూడాలి.
రాజ్యాంగ విలువలు లౌకిక విలువలు కాపాడడంతో పాటు ప్రజల్లో శాస్త్రీయతను, హేతువాద దృక్పథాన్ని పెంచవలసిన బాధ్యత ఎంతో ఉన్నది. హిందూత్వభావనకు వ్యతిరేకంగా సాప్ట్ హిందూత్వ అంటే కుదరదు. సైద్ధాం తికంగా నెహ్రూ శాస్త్రీయ దృక్పథానికి ఇది వ్యతిరేకం. ఓటు బ్యాంకు రాజకీయాలకు కక్కుర్తి పడటమే అవుతుంది. వ్రతం చెడ్డా ఫలితం దక్కదని రుజువవుతున్నది కూడా. మొత్తం విద్యావ్యవస్థనే కాషాయికరణ గావించడంలో గత బీజేపీ గణనీయ పాత్రను నిర్వహించింది. అలాగే రైతుల నల్లచట్టాలు మెడపై కత్తిలా వేలాడుతూనే ఉన్నాయి. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌ల చట్టాల సవరణ ప్రమాదం కొనసాగుతూనే ఉన్నది. వీటన్నిటిపై సుస్పష్ట వైఖరి అవశ్యం. దీనికి తోడు అవినీతి తారాస్థాయికి చేరింది. రూ. వందల వేలకోట్లు గల కుబేరులే ప్రజాప్రతి నిధులవుతున్నారు.
పీడిత ప్రజల ప్రియతమనేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్టు పార్టీ పక్షనేతగా రాజ్యసభలో ప్రసంగించేటప్పుడు ప్రతి అంశం పూర్వాపరాలు తెలుసుకుని సాధికారంగా మాట్లాడేవారని ప్రతీతి. అంకెలు, సంఖ్యలతో సహా సభకు వచ్చేవారు. అధికారులు, పాత్రికేయులతో పాటు, ఆయా రంగాల నిపుణులు సైతం శ్రద్ధగా నోట్ చేసుకుని అమలు పరిచేందుకు ప్రయత్నించేవారు. తప్పులను పొరపాట్లను సరిదిద్దుకునేవారు. ప్రజలకు ఆ విధంగా న్యాయం జరిగేది. ఒక వ్యక్తినుండి వ్యవస్థకు, ఓ వ్యవస్థ నుండి ప్రజా సమూహానికి అలా అభిప్రాయాలు ఆచరణ చేరి మార్పుకు దోహదపడేవి. ఓ ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష పాత్ర అంటే ఇదికదా…! అని ముక్కున వేలేసుకుని అంతర్జాతీయ స్థాయిలో సైతం గమనించేవారు.
చరిత్ర ఒక్కొక్కరికి ఒక్కోసారి ఒక్కోలా అవకాశం ఇస్తుంది. దాన్ని సమర్థ వంతంగా వినియోగించుకుంటే చరిత్రకారులుగా నిలబడతారు. లేకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. తేల్చుకోవాల్సింది మనమే.
కె.శాంతారావు
9959745723