గుడి ముసుగులో రోడ్డు పై నిర్మాణం..!

నవతెలంగాణ-నాచారం
నాచారం డివిజన్‌ పరిధిలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆలయం ముసుగులో రోడ్డుపై అక్రమ నిర్మాణం కొనసాగిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పోలేరమ్మ ఆలయం వెనక నాలాను ఆక్రమించి బజారులో బహుళ అంతస్తు నిర్మాణం చేస్తున్నారు. చెట్టు అడ్డం ఆలయం పేరుతో అక్రమ నిర్మాణం చేస్తున్నా పట్టించుకునే వారు లేరని పలువురు ఆరోపిస్తున్నారు. దాంతో రెండో అంతస్తు నిర్మాణానికి అంతా రంగం సిద్ధం చేశారు. భవిష్యత్తులో నాలాపై బ్రిడ్జ్‌ విస్తరింప చేయాలంటే ఈ నిర్మాణం అడ్డంకిగా మారుతుందని స్థానికులు వాపోతున్నారు. ఆలయం పేరుతో నాలాలను, రోడ్లను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఇదే అదునుగా భావించిన ఆలయ నిర్వహకులు అదను చూసి అంతస్థుల నిర్మాణం చేపడుతున్నారని పలువురు చెబుతున్నారు. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు దష్టి పెట్టి బ్రిడ్జికి అడ్డంగా రోడ్డుపై చేపడుతున్న అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి భవిష్యత్తులో నాలా విస్తీర్ణ సమస్యకు పరిష్కారం చూపాలని, లేకపోతే ఇరుకు రోడ్డు ఇబ్బందులు తప్పవని ప్రజలు వాపోతున్నారు. ఆలయం ముసుగులో అక్రమ నిర్మాణం చేపడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకొని ప్రజల సౌకర్యార్థం నిర్మాణాన్ని తొలగించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.