ఫలించిన రెండు దశాబ్దాల పోరాటం

– ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సీడ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ అన్వేష్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పసుపు బోర్డు ఏర్పాటు కోసం రెండు దశాబ్దాల రైతుల పోరాటం ఫలించిందని ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి, తెలంగాణ సీడ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ సుంకేట అన్వేష్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ చాలా కాలంగా ఉందని గుర్తు చేశారు. బుధవారం హైదరబాద్‌లోని గాంధీభవన్‌లో వారు విలేకర్లతో మాట్లాడారు. 2022లో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ చెప్పిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా పసుపు బోర్డు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పసుపు బోర్డు రాష్ట్రానికి ఇవ్వాలని కోరామని తెలిపారు. మార్కెటింగ్‌ వ్యవస్థ, గోడౌన్‌, కోల్డ్‌ స్టోరేజ్‌, పసుపునకు మద్దతు ధర కల్పించాలని కోరారు. చక్కెర కర్మాగారం కూడా పున:ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. పసుపు బోర్డుతో సాగు విస్తీర్ణం పెరుగు తుందని చెప్పారు. పసుపు బోర్డు చైర్మెన్‌గా నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వ్యక్తిని నియమించడం మంచి పరిణామమని తెలిపారు. పసుపు బోర్డుకు ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, దానికి ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా పసుపుబోర్డు ఏర్పాటు కోసం కేంద్రానికి లేఖ రాసినట్టు చెప్పారు.