రాగిజావ మీద పడి విద్యార్థికి, వంట మనిషికి గాయాలు

To the student who fell on the copper, The cook was injured– సర్వేల్‌ గురుకుల పాఠశాలలో ఘటన
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
అల్పాహారం కోసం వండిన రాగిజావను విద్యార్థులకు వడ్డించేందుకు తెస్తుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడటంతో 8వ తరగతి విద్యార్థి శివరాత్రి సామేలు, వంట మనిషి ఇందిరకు గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం లోని సర్వేల్‌ గురుకుల పాఠశాలలో జరిగింది. వివరాల్లోకెళ్తే.. సర్వేల్‌ గురుకుల పాఠశాలలో పెట్టిన మెనూ ప్రకారం నాలుగో వారంలో రాగి మాల్టో పెట్టాలి. వండిన రాగి జావను వంటగది నుంచి బయటకు తీసుకురావాలని డిప్యూటీ వార్డెన్‌ చెప్పారు. వంట గిన్నెను తీసుకొచ్చే క్రమంలో జారి పడటంతో విద్యార్థి శివరాత్రి సామేలు, వంట మనిషి ఇందిరకు గాయాలయ్యాయి. మరో ఇద్దరికి కూడా గాయాలైనట్టు సమాచారం.వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ప్రిన్సిపల్‌ నిర్లక్ష్యం వహించారు. బాధితుల కుటుంబీకులే సామేలును హైదరాబాద్‌కు, వంట మనిషి ఇందిరను నల్లగొండకు తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. విద్యార్థి సామేలుకు తీవ్ర గాయాలవ్వడంతో నిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పినట్టు తెలిసింది.