మైనార్టీ గురుకులంలో విద్యార్థి ఆత్మహత్య

A student commits suicide in a minority gurukulam– గురుకులాల్లో చదువులు అస్తవ్యస్తం
– పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తాం : డీఎస్పీ మహేష్‌ గౌడ్‌
– విద్యార్థి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి : ఎస్‌ఎఫ్‌ఐ ప్రిన్సిపల్‌ను సస్పెండ్‌ చేయాలి
నవ తెలంగాణ- మహబూబ్‌ నగర్‌
మైనారిటీ కళాశాల గురుకులంలో రామ్‌ రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని మైనారిటీ కళాశాల గురుకులంలో సోమవారం జరిగింది. డీఎస్పీ మహేష్‌ గౌడ్‌, సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మద్దూర్‌ మండలం భూనేడు గ్రామానికి చెందిన రామ్‌ రెడ్డి (17) మైనార్టీ గురుకుల కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కాగా, ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తోటి విద్యార్ధులు సిబ్బందికి సమాచారం అందివ్వగా.. సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ మహేష్‌ గౌడ్‌, సీఐ, పోలీసు సిబ్బంది హాస్టల్‌ను పరిశీలించి కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఆదే గ్రామానికి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు.
విద్యార్థి ఆత్మహత్యకు ప్రిన్సిపలే కారణం : ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కాలేజీ హాస్టల్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో హాస్టల్‌లో విద్యార్ధులను సందర్శించిన నాయకులు వారితో ముచ్చడించారు. విద్యార్థులు అనేక సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. రాత్రి సమయంలో హౌస్‌ ఇన్‌చార్జి హాస్టల్‌లో ఉన్న విద్యార్థుల పూర్తి వివరాలు నమోదు చేసుకోరని తెలిపారు. విద్యార్థులు పైన అంతస్తులో పడుకుంటే ఇన్‌చార్జి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నిద్రపోతారన్నారు. ప్రిన్సిపల్‌ పని విధానం సరిగ్గా లేదని, భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదని విద్యార్ధులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ప్రశాంత్‌ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్‌ సమీపంలోని మైనారిటీ గురుకుల జూనియర్‌ కళాశాలకు వెళ్లిన లో ఇంటర్‌ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి రామ్‌ రెడ్డి మృతిపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. హౌస్‌ ఇన్‌చార్జి, ప్రిన్సిపల్‌ను సస్పెండ్‌ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు భరత్‌, నాయకులు నందు, ఈశ్వర్‌, రాము, భాను తదితరులు పాల్గొన్నారు.