– అనుమానాలున్నాయని తల్లిదండ్రుల ఆందోళన
– సూసైడ్ నోట్ లభ్యమైందన్న ఏసీపీ
నవతెలంగాణ-హన్మకొండ
హనుమకొండ జిల్లా భీమారంలోని శివాని జూనియర్ కాలేజిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని సాహిత్య ఉదయం కాలేజీ బిల్డింగ్ పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కాలేజీ యాజమాన్యం, కేయూ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామానికి చెందిన వలుగుల సాహిత్య (16) ఎంపీసీ మొదటి సంవత్సరం చదివింది. ప్రస్తుతం పరీక్షలు నడుస్తున్నాయి. అయితే, గత నాలుగు పరీక్షలు సరిగా రాయలేదని స్నేహితుల వద్ద చెప్పి బాధపడింది. గురువారం రాత్రి 11 గంటల వరకు స్టడీ అవర్‌లో చదువుకుంది. శుక్రవారం తెల్లవారుజామున కళాశాల హాస్టల్ బిల్డింగ్ పై అంతస్తుకు వెళ్లి కిందకు దూకింది. కాలేజీ సిబ్బంది వెంటనే ఆమెను మ్యాక్స్ కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే సాహిత్య మృతిచెందినట్టు డాక్టర్లు చెప్పడంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
అయితే, తమ కూతురు మరణం అనుమానాస్పదంగా ఉందని, తెల్లవారుజామున బిల్డింగ్ పైనుంచి పడితే ఉదయం 10 గంటల వరకు తమకు సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని హుటాహుటిన ఎంజీఎంకు తరలించే అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. యాజమాన్యం తమ అనుమానాలు నివృత్తి చేయాలని వారు విద్యార్థి సంఘాల నేతలతో కలిసి కాలేజీ ఎదుట ఆందోళన చేశారు. ఘటనపై హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విషయం తెలియగానే కేయూ సీఐ చేరాలు కళాశాలకు వెళ్లారన్నారు. సాహిత్య గదిని పరిశీలించగా సూసైడ్ నోట్ దొరికిందని చెప్పారు. గత నాలుగు పరీక్షలు సరిగా రాయలేకపోయానని, నాన్న ఆశయం నెరవేర్చలేకపోతున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ ఉన్నట్టు తెలిపారు. విద్యార్థిని మృతిపై పూర్తి దర్యాప్తు చేస్తామని, కాలేజీ యాజమాన్యంతో పాటు విద్యార్థిని తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరారు. కాలేజీలోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు.