కల్లుగీత వృత్తి ఆధునీకీకరణకు నిపుణులతో అధ్యయన కమిటీ వేయాలి

చౌగాని సీతారాములు, కల్లగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
నవతెలంగాణ – హాలియా 
పెరుగుతున్న టెక్నాలజీకి అనుకూలంగా కల్లుగీత వృత్తిని ఆధునికరించి అభివృద్ధి చేసి వేలాదిమంది కల్లుగీత కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం  కల్లుగీత కార్మిక సంఘం అనుముల మండల కమిటీ సమావేశం లో  ఆయన మాట్లాడుతూ  కల్లుగీత వృత్తి పట్ల అవగాహన లేని గత ప్రభుత్వాలు మధ్యాన్ని ఆదాయ వనరులు గా చూస్తూ గీత వృత్తిని బ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. కష్టపడి వృత్తి చేసుకుని బ్రతికే వారిపై అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతుంటే పాలకుల రాతలు మారుతున్నాయి కానీ గీతా కార్మికుల తలరాతలు మారడం లేదని విచారం వ్యక్తం చేశారు. గీత అన్నలను రోడ్డున పడేసిన ఘనత గత ప్రభుత్వాలకు చెందుతుందన్నారు గీత వృత్తి, రక్షణ వృత్తి, సంక్షేమం, ఉపాధి, సామాజిక భద్రత కోసం అనేక సంవత్సరాలుగా కల్లుగీత కార్మిక సంఘం అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. అనేక హక్కులు సాధించిన ఘనత సంఘానికి ఉందని కానీ వాటిని అమలు చేయించుకోవడానికి కూడా పోరాటాలు చేయాల్సిరావడం బాధాకరమన్నారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు కల్లును శీతల పానీయంగా అభివృద్ధి చేయాలని ఫెడరేషన్కు నిధులు కేటాయించి కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆదరణ పథకం ప్రవేశపెట్టి గీత కార్మికులందరికీ ఉచితంగా ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని పేద గీత కార్మికులకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘం ఉపాధ్యక్షులు కాసాని సత్తయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వేములకొండ పుల్లయ్య,  సంఘం మండల కార్యదర్శి నర్సింగ్ సైదులు, చెదురుపల్లి రాములు, కాట్నం పరమేష్, వినుకొండ శ్రీను, పెద్ది కృపాకర్, వడ్డేగోని యాదయ్య కల్లుగీత కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.