అన్ని వర్గాలనూ మెప్పించే సూపర్‌ హీరో

త్వరలోనే తెలుగులో రాబోతున్న సూపర్‌ హీరో చిత్రానికి ‘ఏ మాస్టర్‌ పీస్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు.
‘శుక్ర’, ‘మాట రాని మౌనమిది’ చిత్రాల దర్శకుడు సుకు పూర్వాజ్‌ డైరెక్షన్‌లో సినిమా బండి బ్యానర్‌ పై శ్రీకాంత్‌ కండ్రాగుల నిర్మిస్తున్న రెండవ చిత్రమిది. లేటెస్ట్‌గా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. టైటిల్‌కు తగ్గట్టుగానే ఓ మాస్టర్‌ పీస్‌ లాంటి సూపర్‌ హీరో సినిమా రాబోతోందని, అలాగే ఇప్పటి వరకూ హాలీవుడ్‌లో వచ్చిన సూపర్‌ హీరోస్‌ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉందీ ఈ సినిమా ఉండ బోతుందని పోస్టర్‌ చెప్పకనే చెప్పింది. అరవింద్‌ కష్ణ సూపర్‌ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ టైటిల్‌లోని ఏ అక్షరం నిప్పులు చిమ్ముతూ వలయాకారంలో ఉంది. ఆ వలయంలోని శక్తి హీరోకూ ఉందనే
అర్థం వచ్చేలా అతని కుడిచేతికి సైతం అదే కనిపిస్తోంది. అతని వెనక శివలింగంతో పాటు.. నెలవంక నుంచి పౌర్ణమి వరకూ చంద్రుడి పరిణామ క్రమం కూడా ఉంది. పోస్టర్‌లో ఎక్కువ ఆసక్తి కలిగిస్తోన్న అంశం కూడా ఇదే. అంతేకాదు హాలీవుడ్‌ రేంజ్‌ కంటెంట్‌తో పెద్దలతో పాటు పిల్లలకు కూడా నచ్చేలా ఈ సూపర్‌ హీరో పాత్రను డిజైన్‌ చేశారని వేరే చెప్పక్కర్లేదు.
‘శుక్ర’, ‘మాట రాని మౌనమిది’ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న సుకు పూర్వాజ్‌ ఈ సినిమాని తనదైన శైలిలో నిర్మాత సపోర్ట్‌తో రాజీపడకుండా తెరకెక్కిస్తున్నారు.