మిగులు రాష్ట్రాన్ని.. అప్పుల రాష్ట్రంగా మార్చారు

మిగులు రాష్ట్రాన్ని.. అప్పుల రాష్ట్రంగా మార్చారు– ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం
– బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటే.. : మల్లికార్జున ఖర్గే
నవతెలంగాణ-ఆమనగల్‌/బిచ్కుంద
సీఎం కేసీఆర్‌ అవినీతి, అక్రమాలతో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌ పట్టణంలో కల్వకుర్తి అసెంబ్లీ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డికి మద్దతుగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రాజెక్టుల ముసుగులో రూ.5.70 వేల కోట్ల అప్పులు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందని, దాంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి నెత్తిపై రూ.1.50 లక్షల అప్పు ఉందని తెలిపారు. నిరుపేద కుటుంబాల రైతులకు 70 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములు పంచిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత పాలనతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి పేద, మధ్యతరగతి కుటుంబాలు వీధిన పడ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం మూడు ఒక్కటేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. భూ, ఇసుక, మైనింగ్‌ మాఫియాలతో చేతులు కలిపి అక్రమంగా లక్షల కోట్లు సంపాదిస్తూ అప్పుడప్పుడు ఒక కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చి ప్రజలను మభ్య పెడ్తున్నారని ఆరోపించారు. ఇలాంటి నాయకులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కోరారు. ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండే కల్వకుర్తి శాసన సభ్యునిగా కసిరెడ్డి నారాయణరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
దళితబంధుకు ఎందుకు అనుమతి తీసుకోరు..? :రేవంత్‌ రెడ్డి
రైతుబంధుకు ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్న కేసీఆర్‌ దళిత బంధు పథకం కొనసాగింపునకు ఎందుకు అనుమతి తీసుకోలేదని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. దళితున్ని సీఎం చేస్తామని చెప్పిన కేసీఆర్‌.. పదేండ్లుగా వారిని మోసం చేస్తూనే ఉన్నారన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో రేవంత్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి పాలన కుటుంబ పాలనను అంతం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు.