పవన్ కళ్యాణ్ తొలిసారిగా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. దసరా శుభ సందర్భంగా నిర్మాతలు ఓ స్పెషల్ అప్‌డేట్‌ని ప్రకటిం చారు. త్వరలోనే ఈ సినిమా నుంచి మొదటి గీతం విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులు ఆనందపడే మరో విషయం ఏంటంటే తెలుగులో ఈ పాటను స్వయంగా పవన్ పాడారు. ఈ గీతాన్ని ఇతర భాషలలో ఇతర గాయకులు పాడారు. దసరా సందర్భాన్ని పురస్కరించుకుని నిర్మాతలు విడుదల చేసిన ఆసక్తికరమైన పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్థులపై శక్తి త్రిశూలాన్ని ప్రయోగించినట్లుగా మూడు బాణాలను గురిపెట్టారు. ఈనెల 14 నుంచి మళ్లీ చిత్రీకరణ మొదలవుతుందని, నవంబర్ 10 నాటికి మొత్తం చిత్రీకరణ పూర్తి అవుతుందని నిర్మాతలు తెలిపారు. సామ్రాజ్యవాదులు, అణచివేతదారులకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం ఒక యోధుని అలుపెరగని పోరాటమే ఈ సినిమా అని నిర్మాతలు వెల్లడించారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని అంచనాలను దృష్టిలో ఉంచుకుని యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ భారీ యాక్షన్ ఎపిక్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.