
నవతెలంగాణ – నిజాంసాగర్
మండలంలో నిర్వహిస్తున్న బడి బయట పిల్లల సర్వేను మంగళవారం మండల విద్యాధికారి వై తిరుపతిరెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశానుసారం ప్రతి సంవత్సరం నిర్వహించే బడి బయట పిల్లల గుర్తింపులో భాగంగా మండలంలో ఈనెల 11 నుండి బడి బయట పిల్లల సర్వే జరుగుతుందన్నారు. ఇప్పటివరకు మండలంలోని రెండు కాంప్లెక్స్ పరిధిలో 21 మంది బడి బయట విద్యార్థులను గుర్తించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఉచిత నిర్బంధ విద్య అమల్లో ఉన్నందున బడి ఈడు కలిగిన పిల్లలను ఎవరు కూడా పనులలో నియమించుకోకూడదని అలా చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని ఆయన అన్నారు. మంగళవారం మంగుళూరు పరిధిలో ఉన్నటువంటి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలను గుర్తించడం జరిగిందన్నారు. అలాగే 15 నుండి 19 సంవత్సరాల వయసు కలిగిన వారు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పరిధిలో నడపబడుతున్న పదవ తరగతి ఇంటర్మీడియట్ విద్యలో చేరడానికి అవకాశం ఉందని ఆయన అన్నారు. 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ గాని ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట్ కాంప్లెక్స్ సి ఆర్ పి బి. శ్రీధర్ కుమార్ మంగళూరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.