సంతోషమై పాలించిన మధురమైన పాట

A sweet song of happinessతనకు కష్టాల్లో తోడుగా నిలిచిన హీరో తన మనసును గెలుచుకున్న వేళ కథానాయిక తన మనసును అతనికి సమర్పిస్తున్న సందర్భాన్ని పాటగా అక్షరీకరించాడు గీతరచయిత శివగణేశ్‌. ప్రేమకున్న లాలిత్యం, మాధుర్యం ఎంత గొప్పవో, ఎంత విలువైనవో ఈ పాట వివరిస్తుంది. ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుగా, నీడగా, జోడుగా సాగుదామని సంకల్పించుకుంటారు. నిండు జీవితానికి శ్రీకారం చుట్టాలనే వారిరువురి ఆశ అక్షరహారతై ఈ పాట రూపంలో కనిపిస్తుంటుంది. విక్రమన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘చెప్పవే చిరుగాలి’ (2004) సినిమాలోని ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.
శివగణేశ్‌ శబ్దసౌందర్యం తెలిసిన కవి. లాలిత్యపు భావాలనాడి పట్టుకున్న మేటికవి. అతి చిన్న వయసులోనే అనారోగ్యంతో కన్నుమూశాడు. అయినా తన పాటలతో చిరంజీవియైనాడు. జీన్స్‌, ఒకేఒక్కడు మొదలగు సినిమాల్లో ఆయన రాసిన అనువాదగీతాలు అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. మొదట్లో అనువాదగీతాలకు ఆయన పెట్టింది పేరు. ఆ తర్వాత స్వతంత్రగీతాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు.
తన ఆలోచనలకు తగినట్టుగా ఉండే అందమైన అమ్మాయి అణకువగా ఉండే అమ్మాయి హీరో కంటపడింది. తొలిచూపులోనే ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. ఆమె ఆలోచనలకు, ఇష్టాలకు తగినట్టుగానే నడుచుకుంటూ, ఆమె దగ్గర మంచి పేరు సంపాదించుకుంటాడు. అమ్మాయికి, అమ్మాయి వాళ్ళ కుటుంబానికి ఎంతో సహాయం చేస్తూ ఆమె మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకుంటాడు హీరో. ఆమె అతన్ని అభిమానిస్తుంది.. రానూ రానూ ఆ అభిమానం కాస్త ప్రేమగా మారుతుంది. ఇద్దరూ ప్రేమానుభూతుల్లో తేలియాడుతూ పరవశిస్తుంటారు. ఆ పరవశానికి అక్షరరూపమే ఈ పాట..
నన్ను ప్రేమగా లాలించే సంగీతానివి నువ్వే కదా! నిన్ను తీయగా పాలించే సంతోషాన్ని నేనే కదా! అంటూ హీరో పాడుతుంటాడు. తన మనసులోని ప్రేమనంతా పాటగా అల్లి ఆమె మనసుముందు పెడతాడు. ఇక్కడ లాలించే సంగీతంలో మాధుర్యం ఉంది. పాలించే సంతోషంలో అలవి కాని అనుభూతి ఉంది. ఈ మాధుర్యానుభూతులు రెండూ ఏకమై వారిని పరవశంలో ముంచేస్తున్నాయి. నువ్వు చిరుగాలివా? లేక పూలవానవా? నాలో తెలియని ఆనందాన్ని నింపిన నువ్వెవరసలు? అంటూ ఆకాశానివా? లేక నేలవా? లేక నిప్పువా? పంచభూతాల్లో నువ్వెవరు? లేకా నీకోసం బతుకుతున్న నేనే నువ్వా? అంటూ తన్మయత్వంతో అడుగుతాడు. ప్రేమలో మునిగి ఉన్న హీరో ఆమెపై ఆరాధనాభావనతో ఉన్నాడన్న విషయం పల్లవిలోని పై పంక్తుల ద్వారా స్పష్టమవుతుంది.
నదిలాగా ఆమె కదలాడుతుంటే అతడు తీరంలా ఆమెతో సాగుతుంటాడట. ఎందుకంటే నది తీరం రెండూ విడిచి ఉండవు. అలా నదిలాగా, తీరంలాగా కలిసి కలకాలం ఉండాలన్నదే అతని తపన. అలా హీరో మాటలకు స్పందిస్తూ ఆమె – చీకటిరాత్రి నువ్వైతే నెలవంకను నేనవుతానంటుంది. రాత్రి, నెలవంక ఎక్కువసేపు ఉండవు. రేయి ఉన్నంతసేపే నెలవంక ఉంటుంది. అందునా – నెలవంక అంటే అర్ధచంద్రాకారం. అది మరీ ఎక్కువసేపు ఉండదు. రేయి లేకపోతే నెలవంక లేదు. అంటే.. అతడున్నంత సేపే ఆమె ఉంటుందన్న భావన కూడా ఇక్కడ స్ఫురిస్తుంది. నీతో పాటు నిలిచే కాలం కొన్ని క్షణాలైనా అది నాకు తృప్తినిస్తుంది. మరిచిపోలేని మధురానుభూతినిస్తుంది. అది నా జీవితానికి చాలు అని ఆ ప్రేయసి అంటుంది. మొగ్గలా ఎదురుగా వచ్చి వనమై నా ముందు నిలిచావు. వనంలా నన్ను ఆవహించావు. అల్పంలా కనిపించి అనల్పంలా నన్ను హత్తుకున్నావు. ఆకట్టుకున్నావు. కలలను నాకిచ్చి కలలకు ఆలవాలమైన నా కనులను దోచుకున్నావు. ఎదలోని లయలో కలిసిపోయే నా ప్రాణస్పందనవి, శ్రుతివి నువ్వే.. నా బ్రతుకువి నువ్వే అని హీరో బదులిస్తాడు. అంటే.. ఆమెని హృదయపుగీతంలా భావిస్తున్నాడు. తన జీవనగీతంలా పాడుకుంటున్నాడు.
ఈ భూమి మీద గాలి ఎప్పటికీ ఉంటుంది. గాలి చొరబడని ప్రదేశాన్ని వెతకడానికి కూడా మనం సాహసం చేయలేం. అలా గాలి ఈ భూమి అంతటా వ్యాపించి ఉంటుంది. గాలి భూమిపై లేదనుకోవడం అసాధ్యం. ఒకవేళ ఆ అసాధ్యమే సాధ్యమై భూమి మీద గాలి కరువైన వేళల్లో నా ప్రాణాన్నే నీ ఊపిరిగా మార్చేస్తాను అని ప్రేయసి అంటుంది. నీలాల ఆకాశం తెలవారకుండా ఉండదు. ప్రతిరోజు తెలవారుతుంది. ఉదయమవడం, రోజు గడవడం, మళ్ళీ చీకటవడం ఇది సహజసిద్ధంగా రోజూ జరిగేదే. ఒకవేళ ఇది తారుమారై ఆకాశం తెలవారకపోతే నా ప్రాణాన్ని దీపంగా చేసి నీకు వెలుగులా అందిస్తాను. ఏ చీకటి నీ దరికి రాకుండా నేను చూసుకుంటాను అని హీరో ఆమెతో అంటాడు. ఇద్దరు కూడా అననుకూల పరిస్థితులు ఎదురైనా, నింగీ నేలా తలకిందులైనా ఒకరికోసం ఒకరు, ఒకరికై ఒకరు అన్నట్లు గాఢమైన ప్రేమతో బతుకుదామనే తలంపుతో ఉన్నారని ఈ చరణంలోని పంక్తులు వింటే అర్థమవుతుంది.
ఎప్పటికీ, ఎన్నటికీ జరగని, ఎదురవ్వని సమస్యలే తలెత్తినా నేను నీ కోసం, నీవు నా కోసం అంటూ వారిరువురు ప్రాణానికి ప్రాణంగా కలిసి ఉన్నారు. శిలలాగా నేను కదలక పడి ఉన్నాను. అలలా వచ్చి నువ్వు నన్ను తాకగానే నాలోని అచేతనత్వం పోయి కదలిక వచ్చింది. అలజడినవుతున్నాను. అంటే – నా మనసులోకి ప్రేమలా చొరబడి తొలిసారిగా నా జీవితానికి ఆనందమంటే ఏమిటో తెలియజేశావని ప్రేయసి అంటుంది. దీపంలా ప్రియుడుంటే ఆ దీపానికి తానే వెలుగవుతుందట. అతనిలో సగమై నిండి ఉంటుందట. అతనిలో సగమైనా ఇద్దరూ పరిపూర్ణమైన ప్రేమానుభూతిని, జీవనమాధుర్యాన్ని చవిచూస్తున్నారు.
వేణు తొట్టెంపూడి, ఆషిమా భల్లా నటన ఈ పాటకు, సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎస్‌.ఏ. రాజ్‌ కుమార్‌ సంగీతం కూడా ఈ పాటకు విశిష్టతను చేకూర్చింది. తెలుగు సినిమాపాటల జాబితాలో ఈ పాట స్థానం పదిలం. పదికాలాలు ప్రేమికులు హాయిగా పరవశించి పాడుకునే పాట ఇది. సంగీత, సాహిత్య సమ్మేళనమై ఉల్లాసంగా సాగే అపురూపమైన ప్రేమగీతమిది..
పాట:-
నన్ను లాలించు సంగీతం నువ్వే కదా!/
నిన్ను పాలించు సంతోషం నేనే కదా!/
నువ్వు చిరుగాలివా లేక విరివానవా
మరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వా లేక నేనే నువ్వా/
నదిలాగా నీవు కదలాడుతుంటే నీతో పాటు సాగే తీరం నేనవ్వనా!/
నిశిరాత్రి నీవు నెలవంక నేను నీతో పాటు నిలిచే కాలం చాలందునా!/
మొగ్గై ఎదురొచ్చి వనముగ మారావు/
కలలే నాకిచ్చి కనులను దోచావు/
ఎదలయలోన లయమయ్యే శ్రుతివే నువ్వు నా బ్రతుకే నువ్వు/
భువిలోన గాలి కరువైన వేళ/
నా ప్రాణాన్ని నీ ఊపిరిగా మార్చేయనా!/
నీలాల నింగి తెలవారకుంటె నా జీవాన్ని నీకో దివ్వెగ అందించనా!/
శిలలా మౌనంగా కదలకపడి ఉన్నా/
అలలా నువు రాగా అలజడినవుతున్నా/
దీపం నువ్వైతే నీ వెలుగు నేనవ్వనా!/
నీలో సగమవ్వనా!
పడి లేచిన కెరటాల్లో

పల్లవి : పడి లేచిన కెరటాల్లో
పాఠాలను చదువుకో
ఆకురాల్చి చిగురు తొడిగినా
బతుకు తీపి తెలుసుకో

1. కాళ్లతోటి అక్షరాలు దిద్దినారు ఎందరో
కళ్లు లేకున్నా కాని కంప్యూటర్‌ నడిపిరి
ఆరు చుక్కల లిపితో అంధత్వం గెలిచినా
బ్రెయిలీని మనసులోనా తలుచుకొని సాగిపో |పడి||

2. హెలెన్‌ కిల్లర్‌ అంటేనే విజయాలకు గుర్తురా
చెవిటి మూగ అంధత్వం సిగ్గుతో తలవంచెరా
వీల్‌ చెయిర్లో బతుకుతున్న స్టీఫెన్‌ హాకింగు
విశ్వ రహస్యాలను విప్చి మనకు చెప్పలేదా |పడి||

3. రెండు కాళ్లు లేకున్నా ఒలంపిక్సాటల్లో
గెలిచినట్టి వనితరా టానిగ్రే థాంప్సన్‌
విద్యుత్తును కనిపెట్టి లోకానికి వెలుగు పంచిన
థామస్‌ ఎడిసన్‌ కూడా వికలాంగుడే తెలుసుకో

4. జనమే తన ఊపిరిగా ఎన్నెన్నో పాటలు రాసిన
విశాఖ సన్యాసిరావుకు అంధత్వం అడ్డులేదుగ
ఉన్న ఒక్క కాలుతోటి మయూరమై నాట్యమాడె
మన సుధాచంద్రన్‌ ఎప్పటికీ స్ఫూర్తిరా

5. వైకల్యం దాటేసిన అనుభవాలు ఎన్నెన్నో
బతుకునే గెలుచుకున్న బాటలు ఇంకెన్నో
అవయవాల్లో లోపమని ఆవేదన చెందబోకు
చీకటైన దారుల్లో చిరుదివ్వెలు వెలిగించు
రచనా కాలం : 6-8-2012 – 10-8-2012
(‘గెలుచుకో లోకాన్ని’ వికలాంగుల కోసం తయారు చేసిన ఆడియో క్యాసెట్టులో
ఈ పాటను పాడినవారు : రమణ – గుంటూరు)
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com