– ద్రవ్యనియంత్రణ చట్టం పేరుతో కేంద్రం ఆంక్షలు
– పన్నుల వాటాలపై అడ్డదారిలో కోత
– కేంద్రం అనుసరిస్తున్న వివక్షపై సుప్రీం తలుపు తట్టాం : కేరళ ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఫ్రొఫెసర్ థామస్ ఐజాక్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ద్రవ్యనియంత్రణ చట్టాన్ని అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం బీజేపీయేతర రాష్ట్రాలపై ఆర్థిక ఆంక్షలు విధిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అనుసరిస్తోందని కేరళ ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఫ్రొఫెసర్ థామస్ ఐజాక్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ”బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్ష” అనే అంశంపై జరిగిన వెబినార్‌లో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు. ద్రవ్య నియంత్రణ చట్టం ప్రకారం బడ్జెట్లో రెవెన్యూ లోటు జీరో శాతం, ద్రవ్యలోటు మూడు శాతానికి మించకూడదని నిబంధనలు చెబుతున్నా కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో రెవెన్యూలోటు రెండు శాతం, ద్రవ్యలోటు ఐదు శాతంగా ఉందని తెలిపారు. కేంద్రం స్వయంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ రాష్ట్రాలపై ఆర్థిక ఆంక్షలు విధిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థూల జాతీయోత్పత్తిలో మూడు శాతానికి మించి అప్పులు చేయరాదనే నిబంధనలను సాకుగా చూపెట్టి కేంద్రం అభివృద్ధిని అడ్డుకుంటోందని చెప్పారు. ఒకవైపు రుణాలు, ఇతర సంక్షేమ పథకాలపై ఆంక్షలు విధిస్తూనే మరోవైపు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను దొడ్డిదారిన తరలించుకు పోతోందని ఐజాక్ తెలిపారు.
14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు 32 శాతం నుంచి 41 శాతం పెరిగిన పన్నుల వాటాను మరింత తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆయన తప్పుపట్టారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మోడీ రాష్ట్రాల పన్నుల వాటాను 50 శాతానికి పెంచాలని ఆందోళన చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ సూచనలను ఆర్థిక సంఘం పట్టించుకోక పోవడంతో సెస్, సర్ చార్జీల పేరుతో కేంద్రం నేరుగా పన్నులను వసూలు చేస్తున్నదని విమర్శించారు. 2014లో స్థూల జాతీయోత్పత్తిలో 8 శాతం ఉన్న ఈ తరహ పన్నుల వాటా 2023లో 20 శాతానికి పెరిగిందని చెప్పారు.
అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల విషయంలో మాత్రం కేంద్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో ప్రతీయేటా కేంద్ర ప్రభుత్వ ఖర్చులను తగ్గిస్తోందనీ, ఆ ప్రభావం సంక్షేమ రంగాలపై పడుతోందని చెప్పారు.
ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా బీజేపీయేతర రాష్ట్రాల పట్ల కేంద్రం చూపిస్తున్న వివక్ష వల్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్ట పోతున్నాయని చెప్పారు. కేరళ ప్రభుత్వం విషయంలో మోడీ సర్కార్ ఆర్థిక ఆంక్షలతో పాటు పన్నుల వాటాను కూడా తగ్గింస్తోందని వాపోయారు. మోడీ సర్కార్ అనుసరిస్తున్న తీరుకు నిరసనగా తమ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తడితే… చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని న్యాయస్థానం సూచించిందన్నారు. ఇటీవల కేంద్రంతో చర్చలు జరిపినా దాని వైఖరిలో మార్పు రాకపోవడంతో తిరిగి కోర్టును ఆశ్రయించామని చెప్పారు. సుప్రీం కోర్టు నిర్ణయం కోసం తాము ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఎస్‌వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్.వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించిన వెబినార్‌లో కొండూరి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.