ఒక అధ్యాపకుని – సామాజిక చింతన

ఒక అధ్యాపకుని - సామాజిక చింతన”పురుషులందు పుణ్య పురుషులు వేరయా” అన్నట్లు అధ్యాపకుల్లో అనేక రకాలుగా ఉంటారు. కొందరు విద్యార్థులకు బుద్ధిగా పాఠాలు చెప్పి, మానసిక ఆనందాన్ని అనుభవిస్తూ, వృత్తి నిబద్ధతను నిర్వర్తిస్తుంటారు. పిల్లలు చదువుల్లో రాణిస్తుంటే చూసి మురిసి పోతుంటారు. వారి ఎదుగుదలనే తమ ఎదుగుదలగా భావిస్తుంటారు. కొందరు విద్యను గాలికి వదిలి విద్యేతర ధర్మాలైన చిట్టీలు నిర్వహిస్తూ, ఇన్సూరెన్స్‌, ప్లాట్ల వ్యాపారం చేస్తూ పైసల వెంట పరుగెత్తుతుంటారు. మరికొందరు వృత్తి నిబద్ధతతో పాటు అసమ సమాజాన్ని మార్చే చైతన్యంలో భాగమవుతారు. ఈ ధోరణికి చెందినవారే వీరగోని పెంటయ్య. వీరి వ్యాసాల పుస్తకం ‘రాజుల బూజులు – చదువుల సారం’ ఇటీవలనే విడుదలయింది.

అధ్యాపకులు హైస్కూల్‌ విద్యార్థులను విహార యాత్రలకు తీసుకు పోతుంటారు. దాని లక్ష్యం విజ్ఞానంతో పాటు బాహ్య ప్రపంచంతో పరిచయాన్ని పెంచుకోవడం. రచనా నైపుణ్యం లేని అధ్యాపకులు విహారయాత్రను చూసి ఆనందించి వదిలిపెడతారు. కాని వీరగోని పెంటయ్య తాను చూసిన ప్రదేశాలను, తన అనుభవంలోనికి వచ్చిన, సంఘటనలను స్మృతిపథం నుండి ఆవిరి కాకుండా ఒడిసి పట్టుకొని అక్షరబద్ధం చేసినారు.
ఈ వ్యాసాల్లో స్థానీయత నుండి ప్రపంచ నాగరికతల వరకు తన దృష్టిపథంలోకి వచ్చిన చాలా విషయాలను రికార్డు చేసినాడు. అట్లా వాటికి తన అనుభవాలకు, అనుభూతులకు శాశ్వతత్వాన్ని కలిగించినాడు.
రాజస్థాన్‌ రాష్ట్రంలో ‘మేవాడ్‌’ అంటే పచ్చని ప్రాంతమని, ‘మార్వాడ్‌’ అంటే కరువు కాటకాల ప్రాంతం, ఎడారి ప్రాంతం అని అర్థం.
రాజస్థాన్‌ ప్రజలకు ప్రకృతి ఏమీ ఇవ్వలేదు. అందుకే అక్కడినుండి వలసపోయి దేశ విదేశాల్లో వ్యాపార సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు మార్వాడీలు. అక్కడి సామాన్య ప్రజల పక్క రాష్ట్రమైన హర్యాన తదితర ప్రాంతాలకు వలసలు పోతుంటారు.
వలస పోకుండ అక్కడ మిగిలినవారు యాత్రికుల మీద ఆధారపడి జీవిస్తారు. యాత్రికులను ఒంటెల మీద ఎక్కించి తిప్పుతారు. ఒంటెలు, గొర్రెల ఉన్ని, పశువుల చర్మం, చిరుతపులి లాంటి జంతువు చర్మం, ఏనుగు దంతాలతో అందమైన చేతి వృత్తుల వస్తువులు చేస్తుంటారు. అవి యాత్రికులు కొంటేనే వారికి జీవనోపాధి.
హార్మోనియం, డోలక్‌ తోని ‘అద్భుతమైన’ పాటలు పాడుతారు. అందమైన అమ్మాయిలు ఆ పాటలకు డ్యాన్స్‌ చేస్తుంటారు. ఇదంతా నాలుగు రాళ్ళు సంపాదించడానికే. ‘ఇక్కడ మేము చేసే పనులు ఏమీ దొరకవు’ (28) అంటుంటారు.
రాజస్థాన్‌లో ఎటు చూసినా మక్రానా క్వారీలు తవ్వి తీసిన మట్టి గుట్టలు కనబడతాయి. సింగరేణి ఓపెన్‌ కాస్టుల మాదిరిగా.
అక్కడ రాజుల కోటలను ఆధునిక టూరిస్టు హోటల్స్‌గా మార్చి ఒక్కరోజు అరవై వేల నుండి లక్షా అరవైవేలదాకా అద్దె వసూలు చేస్తున్నారు. సంపన్నులు దానిలో ఒకరోజు గడపడం సామాజిక హోదాకు చిహ్నంగా భావిస్తుంటారు. ఉదయపూర్‌ రాజులు, రాణులు వేసవిలో సేదతీరడానికి జలమహల్‌ కట్టించుకొని సేదతీరినట్లు ఈ రచన తెలుపుతుంది.
రాజులు బహు భార్యత్వం పాటించేవారు. రాజు ముసలివాడై చనిపోతే, ఆయన భార్యలందరూ ముసలి, వయసు తేడా లేకుండ సహగమనం చేయడానికి పల్లకీలో ఊరేగింపుగా వెళుతున్నట్లు పాలరాతి పలకల మీద చెక్కిన శిల్పాలు కోటల ముఖద్వారం దగ్గర దర్శనమిస్తాయి.
చరిత్రను అన్వయించే క్రమంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలను ముందుకు తెస్తాడు రచయిత. జైపూర్‌ రాజు మాన్‌సింగ్‌ హిందువు. ఈయన అక్బర్‌ పక్షాన రాణా ప్రతాప్‌ మీదికి యుద్ధానికి వచ్చినాడు. రాణా ప్రతాప్‌కు మద్ధతుగా అఫ్ఘాన్‌కు చెందిన రాజు హకీం సూర్‌ఖాన్‌ తన సైన్యంతో పాల్గొన్నాడు. ”ఇది హిందూ ముస్లింల పోరాటం కాదు కదా?” (43) కేవలం అధికారం కోసం, సంపద కోసం జరిగిన యుద్ధాలను హిందూ ముస్లీంల యుద్ధాలుగా ఒక సంవాదాన్ని సృష్టించి అధికారానికి వచ్చిన ఒక పార్టీ అవగాహనను పూర్వపక్షం చేసినాడు రచయిత.
ప్రపంచంలో సంపద లేని దేశాలు సంపద ఉన్న దేశాలను కాలనీలుగా ఏర్పాటు చేసుకున్నట్లే, తమ భూభాగంలో వనరులులేని మహమ్మద్‌ ఘోరి, మహమ్మద్‌ గజనీ మన దేశం మీద దండయాత్ర చేయడానికి కారణం వాళ్ళ దేశాల్లో సంపద లేకపోవడమే అని రచయిత తన పరిశీలనగా మన ముందు పెడతాడు. ఆర్యులు కూడా పచ్చిక బయళ్ళ కోసమే మన దేశానికి వచ్చినట్లు చరిత్రకారుల అభిప్రాయం.
సోమనాథ్‌ దేవాలయంపైన ఘోరి సైన్యాలు దాడి చేస్తున్నప్పుడు శూద్రులు అక్కడ ఉండి నిలువరించలేక పోయినారని, శూద్రులకు ఆలయ ప్రవేశం లేకపోవడమే అందుకు కారణం అని వివరిస్తాడు రచయిత.
”ఆధునిక పూర్వ దశలో దేవాలయాల కూల్చివేత” అన్న వ్యాసంలో రిచర్డ్‌ యం. ఈటన్‌ హిందూ, ముస్లిం రాజులు దేవాలయాలను సంపద దోచుకోవడానికి కూల్చివేసినారని సోపపత్తికంగా నిరూపించినాడు (ఖీతీశీఅ్‌శ్రీఱఅవ 8/22/2018)
మధ్యప్రదేశ్‌ లోని భీంబెట్కా గుహలోని రాతి మీద గీసిన చిత్రాలను పరిశీలించి ఆనాటి ప్రజలకు ‘దేవుడు అనేవాడు ఒకడున్నాడన్న స్పృహ లేదు’ (52) అని నిర్ధారణకు వస్తాడు.
బౌద్ధమత వ్యాప్తికి శాశ్వత నిర్మాణాలైన ఆరామాలు నిర్మించినారని (56) తెలుపుతాడు.
‘బాల విజ్ఞాన సర్వస్వం’ చదివిన తర్వాత పఠనాసక్తి పెరిగినట్లు రచయిత తెలిపినాడు.
పి.వి.నరసింహారావు (1986)లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా ఉన్నపుడు ఆపరేషన్‌ బ్లాక్‌ బోర్డు పథకం ప్రవేశపెట్టి, విద్యలో ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రోత్సహించినాడని వివరిస్తారు.
రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ప్రైవేటు విద్యాలయాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడానికి దోహదం చేసింది. విద్యాలయంలో మౌలిక వసతులు ఉన్నాయా? లేవా? అధ్యాపకులు ఉన్నారా? లేరా? అన్న విషయాలు పర్యవేక్షించి నియంత్రించకుండా కేవలం అడ్మిషన్‌ అయిన పిల్లలందరికి ఫీజు రీయింబర్స్‌మెంటు ఇవ్వడం వలన ప్రైవేటు విద్యాసంస్థలు తమ ఆస్తులు పెంచుకోవడానికి, రియల్‌ ఎస్టేట్‌ దందాలు చేయడానికి ఆ పథకం ఉపయోగపడిందని అధ్యయనాలు చెప్పుతున్నాయి. డిమాండును మించి ఇంజనీరింగ్‌ పట్టభద్రుల ఉత్పత్తి నిరుద్యోగానికి దారి తీసింది. 2000 నుండి విద్య పూర్తి వ్యాపారంగా మారిపోయింది.
పసిపిల్లలు దేశసంపదని, వారిని సరిగా ఎదగనివ్వాలంటాడు రచయిత. 0-5 సంవత్సరాల పిల్లలకు శిక్షణ పొందిన, పిల్లల మనస్తత్వం తెలిసిన అధ్యాపకులు కావాలంటాడు. వారి పోషణ, ఆటస్థలం, ఆట వస్తువులు అరకొరగా ఉండరాదు.
ఏదైన ఒక వ్యవస్థలో మార్పు తీసుకురావాలి అనుకున్నప్పుడు ప్రజల సమ్మతిని (జశీఅరవఅ్‌) పాలకులు కూడగడతారు. ప్రభుత్వ విద్యా సంస్థల పనితనం మీద అపనమ్మకం ఏర్పడితేనే, ప్రైవేట్‌ విద్యా సంస్థలు వర్ధిల్లుతాయి. దానికోసం ప్రభుత్వ మీడియా ముఖ్యంగా రేడియో, టీ.వీల్లో ప్రభుత్వం విద్యా సంస్థకు, ప్రైవేటు విద్యాసంస్థకు మధ్యలో గల అనుకూల, ప్రతికూల అంశాల మీద చర్చిస్తూ సారాంశంలో ప్రైవేట్‌ విద్యాసంస్థల వైపు మొగ్గే విధంగా చర్చలు ముగిస్తారు.
ప్రభుత్వ విద్యా సంస్థలకు ఆర్థిక వనరులు, మానవ వనరులు, మౌలిక వసతులు తగ్గిస్తూ వాటి సహజ మరణానికి దారులు వేస్తారు.
మధ్యతరగతి బుద్ధిజీవులు 80, 90 దశాబ్దాకాల వరకు విస్తృతంగా పుస్తక పఠనం చేసి దానిలోని అంశాల గురించిన చర్చ సాగించేవారు. ‘ఏమి కొత్త పుస్తకాలు కొన్నారు? ఏమి కొత్త పుస్తకాలు చదివినారు?’ అన్న చర్చ కుటుంబాల్లో జరిగేది. సామాజిక చింతనాపరులైన రచయితలు రాసిన నవల, కథ, కవిత్వం, వ్యాసం విరివిగా చదివేవారు. ఇప్పుడు సమూహ చింతన పోయి స్వార్థ చింతన పెరగడం వలన పుస్తక పఠనాసక్తి తగ్గింది. ఇది అనారోగ్య సమాజానికి చిహ్నం.
ఈ విధంగా వీరగోని పెంటయ్య తన సామాజిక పరిశీలనను ‘రాజుల బూజులు – చదువుల సారం’ వ్యాసాల సంపుటిలో వివరించినారు. సామాజిక బాధ్యత ఉన్న ప్రతి పౌరుడూ ఈ పుస్తకాన్ని చదివి, దీనిలోని అంశాలను పదుగురితో పంచుకోవలసిన అవసరం ఉంది. ఇంత మంచి వ్యాసాలు అందించిన రచయిత అభినందనీయులు.
– కందుకూరి అంజయ్య
9490222201