గ్రామస్తులతో సమాలోచనలు చేసిన మండల స్థాయి అధికారుల బృందం

A team of mandal level officials held discussions with the villagers– సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఆద్వర్యంలో పీఓ బి.రాహుల్ ప్రతిపాదనతో నియోజక వర్గంలో మరో వసతి గృహ పాఠశాల….
– కొండ రెడ్ల విద్యాభివృద్ధి కోసం నిర్దేశం….
– రెడ్డిగూడెం పంచాయితీలో స్థలం సేకరణ…
– మండలాధికారుల బృందం నివేదిక….
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వ పథకం అయినా,ప్రజా సంక్షేమం అయినా మరే ఇతర సమాజ హితం కోరేది ఏదైనా పేదరికానికి అర్హులైన, సంక్షేమంతో సమగ్రాభివృద్ధి చెందే వారికే ఉపయోగకరంగా ఉండాలి.ప్రభుత్వ లక్ష్యం కూడా అదే.ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేసే ముందు చూపు ఉన్న అధికారులు తోనే అది సాధ్యం. ప్రజా సంక్షేమమే లక్ష్యంతో పనిచేసే అధికారులు ఎక్కడైతే పని చేస్తారో ఆ ప్రాంతం అభివృద్ది చెందుతుంది అనడంతో సందేహామే లేదు. అదీ ఎవరైతే నిజమైన పేదలు ఉన్నారో వారి కోసం పనిచేసిన అధికారులు సైతం చరిత్రలో స్థానం దక్కించుకుంటారు.అలాంటివారిలో ఆర్.ఎస్ శంకరన్ ఒకరు.ఆ మహనీయుల అడుగుజాడల్లో నే ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్,ఐటీడీఏ పీఓ బి.రాహూల్ లు పయనించడం తో ఎవరైతే నిజమైన పేద లో వారికి న్యాయం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటే సమాజంలో ఏ వర్గం అయితే అట్టడుగున ఉందో వారి సమగ్రాభివృద్ధికి అహర్నిశలు పాటు పడుతూ వారి శ్రేయస్సు కోసం ముందు చూపుతో అడుగులు వేస్తున్న ఐటీడీఏ పీఓ రాహుల్ ప్రస్తుతం సమాజంలో అత్యంత బలహీనంగా ఉన్న కొండ రెడ్ల సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తూ వాటిని ఆచరణలో పెడుతున్నారు. అందులో భాగంగా ఈ నియోజక వర్గంలో పీవీ టీజీ( పర్టికులర్ లీ వలన్రేబుల్ ట్రైబల్ గ్రూప్) లుగా ఉన్న అత్యంత అడుగున ఉన్న “కొండ రెడ్ల” విద్యాభివృద్ధికి నడుంబిగించారు. అశ్వారావుపేట నియోజక వర్గంలో దమ్మపేట మండలం పూచి కుంట, అశ్వారావుపేట మండలం పాత రెడ్డిగూడెం పంచాయితీ లో రెడ్డిగూడెం,బండారు గుంపు,నడిమి రెడ్డిగూడెం,తిరుములకుంట,గాండ్లగూడెం,గోగులపుడి గ్రామాల్లో కొండ రెడ్లు కుటుంబాలు ఉన్నాయి.
ఏ సమాజం సమగ్ర అభివృద్ధి చెందినా చదువుతో నే అని ఆశించిన పీఓ రాహుల్ ఈ పిల్లలు కోసం ప్రత్యేకంగా ప్రాధమిక గురుకుల ఆశ్రమ పాఠశాలను స్థాపించాలని నిర్ణయించారు. ఇందులో 70 శాతం కొండ రెడ్ల పిల్లలకు,30 శాతం ఇతర గిరిజన సమూహాలు పిల్లలకు రిజర్వేషన్ కల్పించి నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించి ఆ సామాజిక వర్గాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనలకు కార్యరూపం దాల్చుతుంది. అందుకోసం నియోజక వర్గం లోని అశ్వారావుపేట మండలం పాతరెడ్డిగూడెం లో కొండ రెడ్లు పిల్లలు కోసమే ప్రత్యేక గురుకుల ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయడానికి సాధ్యాసాధ్యాలు అంచనా వేయడానికి మండల స్థాయీ అధికారులు ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం డీఈఈ బాపనయ్య,ఏఈ బీఎస్వీ ప్రసాద్,ఎం.డీ.ఓ ప్రవీణ్ కుమార్,ఎంపీఈవో సోయం ప్రసాద్ రావు,ఎం.ఈ.ఓ పి.ప్రసాద్ రావు,కార్యదర్శి సబిత ల బృందం పాతరెడ్డిగూడెం గ్రామం సందర్శించారు.అక్కడి గ్రామ పెద్దలు తో సమాలోచనలు చేసారు.పాఠశాల ఏర్పాటుకు గ్రామస్తులు స్థలం సైతం సేకరించడానికి సుముఖత వ్యక్తం చేసారు. ఇదే విషయాన్ని నివేదిక రూపంలో అధికారులు బృందం పీఓ రాహుల్ కు అందజేసారు. దీంతో నియోజక వర్గం లో కొండ రెడ్ల కోసమే మరో నూతన గురుకుల ఆశ్రమ పాఠశాల ఏర్పాటు కానుంది. ఇప్పటికే మండలంలో గిరిజన సంక్షేమశాఖ,బీసీ సంక్షేమశాఖ,మైనార్టీ సంక్షేమ శాఖ,సాంఘీక సంక్షేమ శాఖ ఆద్వర్యంలో మొత్తం 14 వసతి గృహ,గురుకుల,ఆశ్రమ పాఠశాలల్లో 2171 మంది పేద విద్యార్ధులు విద్యను అభ్యసిస్తున్నారు. కొండ రెడ్ల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోయే మరో నూతన పాఠశాల నియోజక వర్గంలో మరో కలికితురాయి కాబోతుంది అనడంలో సందేహం లేదు.