కన్నీటి వీడ్కోలు

కన్నీటి వీడ్కోలు– రాజీవ్‌రతన్‌ అంత్యక్రియలు పూర్తి
– హాజరై శ్రద్ధాంజలి ఘటించిన సీఎం
– సీఎస్‌, డీజీపీ, పలువురు ఐపీఎస్‌ అధికారులు, ప్రముఖుల రాక
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌(డీజీ) రాజీవ్‌రతన్‌ అంత్యక్రియలు బుధవారం అధికార లాంఛనాలతో మాదాపూర్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి. మంగళవారం రాజీవ్‌రతన్‌ గుండెపోటుతో హఠాన్మరణానికి గురైన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం వరకు ఏఐజీ ఆస్పత్రిలో ఉన్న ఆయన భౌతిక కాయాన్ని ఉంచి తర్వాత అంత్యక్రియల కోసం ఆయన నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ వారి వంశ ఆచారం ప్రకారం కుటుంబసభ్యులు కర్మకాండ పూర్తి చేశాక ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో రాజీవ్‌రతన్‌ భౌతిక కాయాన్ని మాదాపూర్‌లోని మహాప్రస్థానానికి తరలించారు. భౌతిక కాయం వెంట పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు, విజిలెన్స్‌ విభాగానికి చెందిన ఆఫీసర్లతో పాటు ప్రముఖులు వాహనాలలో అనుసరించారు. మహాప్రస్థానంలో అంత్యక్రియలకు రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారీ, రాష్ట్ర డీజీపీ రవిగుప్తా హాజరై భౌతిక కాయానికి చివరి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం, సాయుధ బలగాలు భౌతిక కాయానికి సెల్యూట్‌ చేసి గౌరవ సూచకంగా మూడు సార్లు గాల్లో కాల్పులు జరిపారు. రాజీవ్‌రతన్‌ కుమారుడు తన తండ్రి చితికి నిప్పంటించారు. ఈ సందర్భం గా భార్య, కుటుంబ సభ్యులను ఓదార్చటం అక్కడున్న బంధువులకు కష్టసాధ్యమైంది.