ఉద్యమ నేత, ఎమ్మెల్సీ సాబ్జీకి కన్నీటి వీడ్కోలు

– నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రజాసంఘాల నేతలు
– భారీగా తరలొచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, సామాన్య ప్రజానీకం
ఏలూరు: ఏపీ ఉద్యమనేత, ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ (57) అంత్యక్రియలు ఏలూరులో ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆదివారం జరిగాయి. ఉద్యమ బిడ్డకు కడసారి వీడ్కోలు చెబుతూ జనం కన్నీటిపర్యంత మయ్యారు. ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సాబ్జీ భౌతికకాయానికి నివాళులుర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ నెల 15న పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద రోడ్డు ప్రమాదంలో సాబ్జీ మృతి చెందిన విషయం విదితమే. అదేరోజు భీమవరం ప్రభుత్వాస్పత్రి లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం భౌతికకాయా న్ని ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచారు. ఆయన కుమార్తె ఆస్రిఫా అమెరికా నుంచి రావడంతో సాబ్జీ భౌతికకాయాన్ని ఉదయం తొమ్మిది గంటలకు ఆ ఆస్పత్రి నుంచి ఏలూరులోని యూటీఎఫ్‌ కార్యాలయానికి తరలించారు. అక్కడ సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, ఎంఎల్‌సిలు కెఎస్‌.లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు, ఏలూరు నగరపాలక సంస్థ కో-ఆప్షన్‌ సభ్యులు ఎస్‌ఎంఆర్‌.పెదబాబు, యూటీఎఫ్‌ ఏపీ రాష్ట్ర, అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌, నాయకులు బాబురెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజల సందర్శనార్థం ఇండోర్‌ స్టేడియంకు తరలించారు. అక్కడ సాబ్జీని కడసారి చూసేందుకు ఉద్యోగ, ఉపాధ్యా యులు బారులు తీరారు. భార్య, కుమారుడు ఆజాద్‌, కుమార్తె ఆస్రిఫ్‌ విలపిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. సీపీఐ(ఎం) ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఆర్‌.రవికుమార్‌, అధ్యక్షుడు అలీ సమన్వయపర్చారు. ఇండోర్‌ స్టేడియంలో ప్రజల సందర్శన తర్వాత సాబ్జీ భౌతికకాయాన్ని సత్రంపాడులో ని ఆయన స్వగృహం వద్దకు తీసుకెళ్లారు. సంప్రదాయ పద్ధతిలో కార్యక్రమాలు ముగిసిన అనంతరం భౌతికకా యానికి పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం సిపిఎం, యుటిఎఫ్‌, సిఐటియు, ఐద్వా, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ జెండాలతో అలంకరించిన అంతిమయాత్ర వాహనంలోకి సాబ్జీ భౌతికకాయాన్ని ఎక్కించి పడమర వీధిలోని ముస్లిం శ్మశాన వాటికకు తరలించారు. అంతిమయాత్రలో పెద్ద ఎత్తున జనం మోటార్‌ సైకిళ్లపై ర్యాలీగా తరలివచ్చారు. ‘సాబ్జీ ఆశయాలను సాధిద్దాం’ అంటూ, పూలు చల్లుతూ అంతిమ యాత్ర పొడుగునా నినాదాలు దద్దరిల్లాయి. అక్కడ పోలీసులు గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం అంత్యక్రియల ప్రక్రియ పూర్తి చేశారు.