సుధాకర్ రావు కు కన్నీటి వీడ్కోలు

– డాక్టర్ సాబ్ ఇక సెలవ్..

పలువురు ప్రజాప్రతినిధుల సంతాపం
– అంతిమయాత్ర కు భారీగా తరలివచ్చిన అభిమానులు
–  శోకసంద్రమైన వడ్డెకొత్తపల్లి 
నవతెలంగాణ – పెద్దవంగర
నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం జననేత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు (74) అంత్యక్రియలు గురువారం మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండలం, వడ్డెకొత్తపల్లి గ్రామంలో ముగిసాయి. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో బుధవారం కన్నుమూశారు. సుధాకర్ రావు పార్థివ దేహాన్ని ముందుగా ప్రజల సందర్శనార్థం తన స్వగ్రామమైన వడ్డెకొత్తపల్లి లోని ఆయన నివాసంలో ఉంచారు. ప్రభుత్వ చీఫ్ విప్ జాటోత్ రామచంద్రు నాయక్, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మహబూబాబాద్ ఎంపీ మలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, మాజీ ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు, ప్రముఖులు సుధాకర్ రావు పార్దివదేహం వద్ద నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. సాయంత్రం 4 గంటలకు సుధాకర్ రావు అంతిమయాత్ర మొదలైంది. గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా అంతిమయాత్ర కొనసాగింది. ఆయన వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలు కన్నీటి వీడ్కోలు పలుకుతూ జననేత కు ఘనంగా నివాళులు అర్పించారు. కుమారుడు నెమరుగొమ్ముల వెంకటఅనంత రావు (సంజయ్) అంత్యక్రియలు నిర్వహించారు. కాగా అభిమాన నాయకుడు అకాల మరణం చెందడం పట్ల ప్రజలు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో వడ్డెకొత్తపల్లి శోకసంద్రంలో మునిగిపోయింది.
వైద్యుడిగా ప్రజల్లో చెరగని ముద్ర: ఎండోక్రినాలజిస్ట్, డయాబెటిక్ స్పెషలిస్ట్ గా ఆయన రాష్ట్ర ప్రజలకు అందించిన సేవలు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వృత్తి వైద్య రంగం అయినప్పటికీ తన తండ్రి మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చి 1999-2004 చెన్నూరు (పాలకుర్తి) ఎమ్మెల్యే గా ఓ వెలుగు వెలిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నెమరుగొమ్ముల యతిరాజారావు, ఎమ్మెల్యే విమలా దేవి దంపతులకు మొదటి సంతానంగా సుధాకర్ రావు 3 ఎప్రిల్ 1950 లో జన్మించారు. 2010 తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గెలుపు కోసం కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ భాద్యతలు అప్పగించారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు. కాగా ఆయన భార్య విజయలక్ష్మి, కూతురు కార్తీక, నలుగురు సోదరులు ప్రదీప్ రావు, నవీన్ రావు (మృతి చెందారు),  ప్రవీణ్ రావు, సురేందర్ రావు తో పాటు సోదరి రేణుక ఉన్నారు.
పాడే మోసిన ఎర్రబెల్లి..అంతిమయాత్రలో పాల్గొన్న చీఫ్ విప్ రామచంద్రు నాయక్: మాజీ ఎర్రబెల్లి దయాకర్ రావు కు సుధాకర్ రావు బంధువు కావడం తో మొదటి నుండి ఆయన కుటుంబానికి ఎర్రబెల్లి సన్నిహితంగా ఉండేవారు. ఆయన మృతి చెందినప్పుటి నుండి సుధాకర్ రావు సోదరుడు ప్రవీణ్ రావు తో కలిసి అంతిమయాత్ర ముగిసేవరకు అన్ని తానై ముందుండి నడిపించారు. సుధాకర్ రావు అంతిమయాత్రలో పాల్గొని ఎర్రబెల్లి పాడె మోశారు. ఆయన మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఆ బాధను తట్టుకునే శక్తినివ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జాటోత్ రామచంద్రు నాయక్ అంతిమయాత్ర లో పాల్గొని సుధాకర్ రావు కు నివాళులర్పించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జాటోత్ రామచంద్రు నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రం ఓ ప్రముఖ వైద్యుడి సేవలు కోల్పోయిందని విచారం వ్యక్తంచేశారు. ఆయన పేదల వైద్యుడని, వైద్యరంగంలో ఆయన సేవలు చిరస్మరణీయం అన్నారు.
ప్రజల మనిషి డాక్టర్ సాబ్: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి : ప్రజల మనిషిగా డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. ఆయన పార్థివదేహాన్ని సందర్శించి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. వృత్తి వైద్య రంగం అయినప్పటికీ ప్రవృత్తి రాజకీయాల్లో విశిష్ట సేవలందించారని కొనియాడారు. సుధాకర్ రావు ఆకస్మిక మరణం అత్యంత బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, శ్రీరాం భద్రయ్య, ధర్మారావు, రాజేశ్వర్ రావు, మాజీ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి, మాజీ ఎంపీ లు బోడకుంట్ల వెంకటేశ్వర్లు, బోయినపల్లి వినోద్, మాజీ జెడ్పీ చైర్మన్ సాంబరి సమ్మా రావు, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వద్దిరాజు రాంచందర్ రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఐలయ్య, జెడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి సుధీర్, ముత్తినేని సోమేశ్వర్ రావు, జాటోట్ నెహ్రు నాయక్, పెదగాని సోమయ్య, ముత్తినేని శ్రీనివాస్, కొడకండ్ల మాజీ ఏఎంసీ చైర్మన్, సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు, పాలకుర్తి యాదగిరి రావు, రంగు మురళి గౌడ్, పొడిశెట్టి సైదులు గౌడ్, గాంధీ నాయక్, కేతిరెడ్డి సోమనర్సింహా రెడ్డి, పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, వడ్డెకొత్తపల్లి ఎంపీటీసీ సభ్యురాలు సాయిని ఝాన్సీ రవి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రంగు రాములు గౌడ్, మొర్రిగాడుదుల శ్రీనివాస్, తంగళ్ళపల్లి మల్లికార్జున చారి, కుమారస్వామి, సుభాష్, ఉషయ్య, సుధాకర్, రెడ్డబోయిన గంగాధర్ యాదవ్, మాజీ ప్రజాప్రతినిధులు, వైద్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.