అమరులకు అశ్రు నివాళి

అమరులకు అశ్రు నివాళి– చరిత్రను మలుపు తిప్పిన మలి దశ తెలంగాణ ఉద్యమం :బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
– తెలంగాణ భవన్‌లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
”తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమర వీరులందరికీ వందనాలు. 2001లో ప్రారంభమైన స్వరాష్ట్ర మలి దశ ఉద్యమం చరిత్రను మలుపు తిప్పింది” అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఎగరవేసి అమరులను స్మరించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రపథాన నిలిచిందని గుర్తు చేశారు. ”అరవై ఏండ్ల విధ్వంస గాయాలను…పదేండ్ల వికాసంతో మాన్పేసుకున్న ఘనకీర్తి మన తెలంగాణది. పాలన చేతకాదంటూ నొసటితో వెక్కిరించిన వాళ్లే…మనసు నిండా ప్రశంసించిన దశాబ్దమిది. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందనేలా…అనితర సాధ్యంగా సాగింది ఈ దశాబ్ద ప్రయాణం.. నాడు కరవు, రాళ్లురప్పల, కల్లోలిత తెలంగాణ. నేడు పచ్చని, సుభిక్షమైన కోటి రతనాల వీణ నా తెలంగాణ. అదే స్ఫూర్తి, అదే సంకల్పం ఇక ముందూ ఉండాలి” అని ఆకాక్షించారు. తెలంగాణ ఆవిర్భాÛవ వేడుకలను ఒక్కరోజుకే రేవంత్‌ సర్కార్‌ పరిమితం చేసిందని విమర్శించారు. జై తెలంగాణ అనలేని సీఎం ఈ ప్రాంత ప్రజలగురించి బీఆర్‌ఎస్‌లాగా ఎలా ఆలోచిస్తారని ప్రశ్నించారు. 25 ఏండ్లుగా తమతో కలిసి నడిచిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, యువకులందరికీ కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విషయాన్ని ఆయన ఎక్స్‌ (ట్టిట్టర్‌) ద్వారా పంచుకున్నారు.