ఆలోచనలను వికసింపజేసిన ‘తెలుగు బాల సాహిత్య సమ్మేళనం’

     నదులలాగానే కొన్ని పనులు చిన్నగా… పాయగా ప్రారంభమై మహా నదులుగా విస్తరించి జీవనాడులుగా నిలుస్తాయి. ఇది ఒక నదులకే కాదు, నదుల లాంటి అనేక జీవనిధులకు వర్తిస్తుంది. అటువంటిదే నిన్నమొన్న హైదరాబాద్‌లో తెలుగు బాల సాహిత్యం విషయంలో జరిగింది. భవిష్యత్తులో జరిగే అనేక ఆవిష్కరణలకు ఈ సదస్సు దారులు వేయడమే కాక జాతీయ స్థాయిలో తెలుగు బాల సాహితీవేత్తలను ఒకచోట చేర్చి నేటి తెలుగు బాల సాహిత్య తీరుతెన్నులు, బాలల సాహిత్య మంచి చెడులు, ఆలోచనలు, ఆవిర్భావాల వంటి అనేక అంశాలపైన చర్చకు అవకాశం యివ్వడమే కాదు కొత్త ఆలోచనలకు, ఆధునిక బాల సాహిత్య తీరుతెన్నులకు, ఆలోచనలకు అద్దం పట్టింది.
మే 24,25 తేదీల్లో హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌ వేదికగా శాంతా బయోటెక్నిక్స్‌ అధినేత పద్మభూషణ్‌ డా.కె.ఐ.వరప్రసాదరెడ్డి సౌజన్యంతో వారి తల్లి శ్రీమతి కోడూరి శాంతమ్మ స్మృత్యర్థం రెండు రోజులు అత్యంత వైభంగా జరిగిన ఈ సదస్సు బుధవారం ప్రారం భమైంది. సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభకు విశిష్ట అతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి. రమణాచారి హాజరుకాగా, పద్మభూషణ్‌ వరప్రసాదరెడ్డి సదస్సును ప్రారంభించారు. శాసనమండలి సభ్యులు, కవి, గాయకులు దేశపతి శ్రీనివాస్‌ గౌరవ అతిథిగా పరిషత్తు ప్రచురించిన ‘బాల కథా కదంబం’ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత డా.భూపాల్‌, సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత కన్నెగంటి అనసూయ అతి థులుగా పాల్గొన్నారు. తొలుత పరిషత్తు కార్యదర్శి డా.జె. చెన్నయ్య స్వాగతం పలికి సదస్సు నేపథ్యాన్ని వివరించగా, కేంద్ర సాహిత్య అకాడమి బాల సాహిత్య పురస్కార గ్రహీత, పరిషత్తు సభ్యులు డా.పత్తిపాక మోహన్‌ సభకు సమన్వయకర్తగా వ్యవహరించారు.
రెండు రోజుల సదస్సులో వివిధ అంశాలపై నిష్ణాతులు ప్రసంగించారు. మొదటి సదస్సు ‘బాల సాహిత్యం మౌలిక అంశాలు’ గురించి జరిగింది. దీనికి సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత డా. దాసరి వెంకట రమణ అధ్యక్షత వహించారు. మొలక సంపాదకులు తిరునగరి వేదాంతసూరి ఆత్మీయ అతిథిగా పాల్గొని, చెప్పడం కంటే ఆచరణలో చూపాలని అన్నారు. తొలుత బాల్యం గురించి, బాల సాహిత్యం గురించి ముంజులూరి కృష్ణకుమారి మాట్లా డుతూ భాష వస్తువు శైలి ఏ విధంగా ఉండాలి? పదబంధాలు తీసుకునే వస్తువు ఎలా ఉండాలి? భాష ఎలా ఉపయోగిస్తే పిల్లవాడికి నచ్చు తుంది? పిల్లలకి ఇష్టపడే భాష, కష్టపడే భాష సైన్స్‌ కథా వస్తువుకి భాష ఎలా ఉండాలి, వారి మనసుకి ఆకట్టుకునేలా కథలు ఎలా రాయాలి? నేపథ్యం వర్ణన ఎలా సులభ తరం చేయాలి? కొత్త కథావస్తువు పిల్లలకి ఇవ్వగలమా, లేదా వంటి అంశాలతో పాటు సైన్స్‌ కథలు ఎందుకు రావడం లేదనే అనేక ప్రశ్నలను చర్చకు తెచ్చారు. డా.ఎం.హరికిషన్‌ నైతిక విలువలు మానవ సంబంధాలు కథా వస్తువులు ఉండేలా చూడాలని, చక్కని కథా వస్తువుని, చిక్కని కథని అందిం చాలని, బాల సాహిత్యంలో సమాజాన్ని సంస్కరించే ఏ విషయమైనా సరే నీతి కథలు అవుతుందని అన్నారు. బాల సాహిత్యం వైజ్ఞానికత, హేతువు గురించి అందులో విశేషంగా పని చేసిన శాంతారావు మాట్లాడుతూ పిల్లల ప్రేమికులుగా మనం చెప్తున్న విజ్ఞానం విద్యార్థులకు ఎంతవరకు చేరుతుంది అనేది మనం తెలుసుకోవాలని, రాముడు కావ్య పురుషుడు, కృష్ణుడు పురాణ పురుషుడు బుద్ధుడు, చరిత్ర పురుషుడు అని చెప్తూ వివేచన కలిగిన ఉపాధ్యా యులు ఇందులో అంతరార్థం గ్రహించి చరిత్రలో ఉన్న కార్య కారణ సంబంధాలు తెలుసు కుంటూ విద్యార్థులకు తెలియ జేయాలన్నారు. సదస్సుకు సమన్వయకర్తగా కూకట్ల తిరు పతి వ్యవహరించారు.
మధ్యాహ్నం జరిగిన ‘బాల సాహిత్యం నాడు-నేడు’ చర్చా గోష్టి మూడు తరాల బాల సాహితీవేత్తల ఆలోచన పూలను కురిపించింది. డా. అమరవాది నీరజ అధ్యక్షతన జరిగిన ఈ చర్చా కార్యక్రమానికి డా.అమ్మిన శ్రీనివాస రావు సమన్వయకర్తగా ఉన్నారు. సీనియర్‌ రచయితలు పాల్గొని అనేక అంశాలను చర్చకు పెట్టడమే కాక ఆలోచనాత్మక దిశగా సాగింది. ‘బాలల కోసం వివిధ నైపుణ్యాలు’ అంశంపై వి.శాంతి ప్రబోధ అధ్యక్షతన వక్తలు జి.వి.ఎన్‌.రాజు ఉపన్యాస కళ గురించి మాట్లాడుతూ ఉపన్యాసం ఉప్పెన లాంటిదని ప్రసంగం ప్రవాహం లాంటిదని చెబుతూ పాఠశాలల్లో విద్యార్థులను ఉపన్యాస కళలో నిష్ణాతులను చేయడానికి అనేక మెళకువలను సూచించారు. చొక్కాపు వెంకటరమణ కథలు చెప్పే కళ గురించి చక్కగా వివరించారు. ఈ సదస్సుకు పులి జమున సమన్వయ వ్యవహరించారు. ‘బాలల కథా రచన మెళకు వలు’ సదస్సుకు డా.వి.ఆర్‌ శర్మ అధ్యక్షత వహించారు. కథా రచన విషయంలో కుండ బద్దలు కొట్టినట్టు అనుక విషయాల నిగ్గు తేలుస్తూనే, చక్కని మెలకువలతో కథా రచన చేయడం గురించి మాట్లాడారు. కథా రచనకు భాష శైలి ప్రధాన మని కథలు కొత్తదనం తీసుకువచ్చేలా ఆవశ్యకత గుర్తించాలని తెలియజేశారు. బాల వికాసకారులు సి.ఎ. ప్రసాద్‌ బాలసాహిత్యంలోని వస్తువు, శిల్పాల గురించి విశేషంగా ప్రసంగించడమే కాక, అనేకాంశాలను చర్చకు పెట్టారు. ఈ సదస్సుకు బాల సాహితీవేత్త పైడిమర్రి రామకృష్ణ సమన్వయకర్తగా వ్యవహరించారు.
రెండవ రోజు ‘లలిత కళా పరిచయం’ పై జరిగింది. బాల సాహిత్య సదస్సుల్లో ఇటువంటి అంశంపై బాలలు, ఉపాధ్యాయుల గురించి జరగడం ఇదే మొదటిసారి కావచ్చు. సదస్సుకు సినీకవి డా.వడ్డేపల్లి కృష్ణ అధ్యక్షత వహించి, లలిత సంగీతం గురించి, సంప్రదాయ జానపద శృంగార గీతిక జావళిల గురించి మాట్లాడారు. సంగీత దర్శకులు, ఆకాశవాణి విశ్రాంత కార్యనిర్వహణ అధికారి కలగ కృష్ణ మోహన్‌ సంగీత మూలాలను పరిచయం చేస్తూ, శాస్త్రీయ కర్ణాటక హిందుస్థాని సంగీతాలు అత్యంత ప్రాచుర్యం పొందాయని, ఏ భాషలో అయినా ప్రాంతంలో వారికైనా శ్రుతిలయ అవసరమ న్నారు. ఆరవ సదస్సులో పాఠశాలలు వికాస కేంద్రాలు ఉపాధ్యాయుల చర్చా గోష్టి జరిగింది. కార్యక్రమానికి స్తంభంకాడి గంగాధర్‌ సమన్వయకర్తగా వ్యవహరిం చారు. ముఖ్యంగా బాలల కోసం మాస, వార పత్రికలు రావాలని, బాల సాహిత్యం పాఠశాలలో ప్రతిరోజు పీరియడ్‌ ఉండాలని తెలుగు గ్రంధాలయాలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చూడాలని కోరారు. తదుపరి ఏడవ సదస్సులో బాల రచయితల ఇష్టాగోష్టి కార్యక్రమం జరిగింది. మంచి పుస్తకం సురేష్‌ అధ్యక్షతన జరిగిన సదస్సుకు బాలవికాసోధ్యమ ఉపాధ్యాయులు కిరణ్‌ కుమార్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు.
ముగింపులో ఆచార్య ఎల్లూరి శివారెడ్ది అధ్యక్షత వహించగా విశిష్ట అతిథిగా బాల చెలిమి, దక్కన్‌ల్యాండ్‌ సంపాదకులు మణికొండ వేదకుమార్‌ పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా పరిషత్తు ట్రస్టు సభ్యులు డా.సి. వసుంధర, పరిషత్తు కార్యవర్గ సభ్యులు డా.సురవరం కృష్ణ వర్ధన్‌రెడ్డి, తురగా ఫౌండేషన్‌ నుండి తురగా ఉషా రమణి, పరిషత్తు కార్యదర్శి డా.జె.చెన్నయ్యలు పాల్గొన్నారు. గరిపెల్లి అశోక్‌ సదస్సు లక్ష్యం నెరవేరిన విధాన్ని తన నివేధిక ద్వారా తెలిపారు. ఈ సదస్సులో బాల చెలిమి ప్రచురించిన ‘విద్యార్థుల పర్యావరణ కథలు’ పుస్తకాన్ని ఆచార్య ఎల్లూరి శివారెడ్ది ఆవిష్కరించారు.
ఈ సదస్సు నాలుగు ప్రత్యేక తీర్మానాలను ఆమో దించింది. వాటిలో పాఠశాలల్లో విద్యార్థులకు తెలుగు భాష, కళా సంస్కృతులపట్ల ఆవగాహన కొరకు చర్యలు తీసుకోవాలని, ఆయా ప్రాంతాల కవి రచయితలను ఆహ్వానించి పాఠశాల విద్యార్థులకు వారితో పరిచయాలు ఏర్పాటు చేయించాలని, పిల్లలకు సంగీతం, నృత్యం నేర్పి స్తున్నట్లే కవి పండితుల ద్వారా భాషా సాహిత్యాల అవగా హన కలిగించాలని, పాఠశాలలను కళా సాంస్కృతిక నిల యాలుగా మలిచే విషయంలో భాషోపాధ్యా యుల అంకి తభావం, కృషిదిశగా పనులు జరగాలని ఈ సదస్సు తీర్మానాలు చేసింది.
– డా. మురహరిరావు ఉమాగాంధి