‘నూరు చిన్న కథలు’ చెప్పిన తెలుగు పెద్ద

A Telugu elder who told '100 small stories'కొన్నిసార్లు కొన్ని ఉపమానాలు, పదాలు కొందరికి మాత్రమే ఒప్పుతాయి. నాకు అదృష్టాలు, జన్మలవంటివాటి పట్ల నమ్మకం లేదుకానీ కారణజన్ములు అన్న పదం బహుశ: ఆయనకు అచ్చంగా సరిపోతుంది. పాలమూరు మట్టి గంధానికి ఆయన అచ్చమైన చిరునామా. తెలంగాణ జీవభాష ఆయన మాటలో, పాటలో నిరంతరం ధ్వనిస్తుంది. ఆయనే ‘ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి’. ఈయన కవి, రచయిత, విమర్శకులు, మహావక్త, ప్రవచనకారులు, జానపద పరిశోధకులు, జాతీయవాద భావనా చైతన్యస్ఫూర్తి. అనేక తరాలను ప్రభావితం చేస్తున్న విద్వన్మూర్తి, స్ఫూర్తి, బాల సాహితీవేత్త కసిరెడ్డి వెంకటరెడ్డి. ఆగస్టు 3, 1946న పాలమూరు జిల్లా అమనగల్లు మండలం పోలేపల్లిలో పుట్టారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి కసిరెడ్డి ద్రౌపదమ్మ-శ్రీ మేఘారెడ్డి దంపతులు.
కల్వకుర్తి ఉన్నత పాఠశాల, పాలెం ప్రాచ్య కళాశాలల్లో చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ‘పొడుపు కథల’పై సాధికారిక పిహెచ్‌.డి చేసి డాక్టరేటు పట్టా పొందారు. ఉపాధ్యాయునిగా, కామారెడ్డి డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా, ఉస్మానియా తెలుగుశాఖ ఆచార్యులుగా, అధ్యక్షులుగా పనిచేశారు. గీతా జ్ఞానయోగ సమాచార్‌, శివానంద భారతి, ధర్మసారథి, రసవాహిని, మాతృ అర్చన మొదలైన పత్రికలకు సంపాదకత్వం వహించారు. వివేకానంద యువకేంద్ర, సరస్వతీ శిశు మందిరాల విద్వత్సమితిలో సేవలందించారు. ఫిలిం సెన్సార్‌ బోర్డు, కేంద్ర సాహిత్య అకాడమి, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌, ఇండియా వంటి జాతీయ సంస్థల సలహాదారుగా ఉన్నారు. దేశవిదేశాల్లో పదివేలకు పైగా ఆధ్యాత్మిక, సామాజిక ప్రసంగాలు చేశారు. గోలకొండ విజయం, భువన విజయం, కవన విజయం, వందేమాతరం దర్బార్‌ వంటి సాహిత్య రూపకాలను సమర్ధవంతంగా తన నేతృత్వంలో నిర్వహించారు.
రచయిత, కవిగా ఆచార్య కసిరెడ్డి నూటా నలబైకి పైగా రచనలు చేశారు. ‘తుమ్మల పద్య కవితా పురస్కారం, వానమామలై పురస్కారం, దాశరథి పురస్కారం, సిద్ధిపేటలో తడకమడ్ల కనాకాభిషేకం వంటి ఇరవై అయిదుకు పైగా ప్రభుత్వం, వివిధ సంస్థల పురస్కారాలతో పాటు ‘ఉపన్యాసకేసరి’, ‘జాతీయ సాహిత్య రథ సారథి’గా గౌరవింపబడి విశేష సత్కారాలు అందుకున్నారు. 1995లో తన సాహితీ జీవిత రజతోత్సవం నాడు ఒకే వేదిక మీద తన ‘ఇరవై అయిదు పుస్తకాలు’ ఆవిష్కరించుకోవడం నభూతో అని చెప్పొచ్చు. ‘చైతన్యశ్రీ, సుభాషిత గీత త్రిశతి, లేతమబ్బులు’ వీరి పద్యకావ్యాల్లో కొన్ని. ‘సింహగర్జన, ప్రభోదమాల, మున్నూరు ముక్తకాలు, సింధూరం, రెడ్డిమాట, గాంధీతాత, అలక, కస్తూరి కథలు, కల్పిత కథలు, అమాసపున్నాలు వీరి కవితా, కథా సంపుటాలు. రాగజ్వాల, సంస్కర్త, జాగృత సాహితీ, జాతీయ సాహితీ, భారతీయ మహిళ, ధర్మసారథి వంటివి వీరి విమర్శా గ్రంథాలు. ఇవేకాక కాపుబిడ్డ, దాశరథి శతకం వంటివాటికి చక్కని వ్యాఖ్యానం రాశారు కసిరెడ్డి. ఆర్యులెవరు?, దారితప్పిన పంజాబ్‌ వంటి అనువాదాలు కూడా చేశారు. ముఖ్యంగా వీరి పిహెచ్‌.డి సిద్ధాంత గ్రంథం ‘తెలుగు పొడుపు కథలు’ తెలుగు జానపద వాఙ్మయ పరిశోధనలో మేరుతునక. దాదాపు ఆరువందల పేజీలున్న ఈ గ్రంథం జానపద పరిశోధకులకు పరిశోధన ఎలా చేయాలన్న దారి చూపే దిక్సూచి అనడం అతిశయోక్తి కాదు. అన్ని రూపాలు, ప్రక్రియల్లో విశేషంగా రచనలు చేసిన కసిరెడ్డి పిల్లల కోసం ‘నూరు చిన్న కథలు’ రాసి ప్రచురించారు. ఇవి వివిధ పత్రికల్లో వచ్చాయి. కొన్ని కసిరెడ్డి కస్తూరి కలం పేరుతో రాశారు.
కసిరెడ్డి మహావక్త. తన వేలాది ప్రసంగాల్లో వందలాది కథలు సందర్భానుసారంగా చెబుతారు. ఈ నూరు కథలు కూడా అటువంటివే. వివిధ విషయాలను తన కథల్లో చెబుతారు. ‘పచ్చబొట్టు-సింహబలుడు’ కథలో మహా బలశాలి, కండలు పెంచిన సింహబలుడు పచ్చబొట్టు సూదిమొన గుచ్చడంతో ఎలా ఇబ్బంది పడతాడో చెబుతారు. ‘చెడు అంటేనే ఇష్టం’ కథ కొద్దిగా గమ్మత్తైన కథ. ఇది చెడ్డవారికి మంచిని బోధించాలి, లేదా వాళ్ళు పూర్తిగా చెడుకు బానిసైపోతారని తెలియజేసే కథ. ఈ నూరు కథల్లో దేవీ దేవతల విశేషాలతో పాటు, దేవీ దేవుళ్ళు, వీరులు, సమరయోథుల వృత్తాంతాలను కూడా సందర్భానుసారంగా చెప్పారు. ఆ కోవలోనే ‘పడవకట్టకుంటే ప్రాణం తీస్తారా’ కథ రాశారు. ఆంగ్లేయుల పాలన సమయం లోని ఈ కథలో ఆంగ్ల సైనికులు తమ గ్రామానికి రాకుండా తన ప్రాణాలను అడ్డువేసిన బాజీరావు గురించి, ఆయన త్యాగ చరితను గురించి పరిచయం చేయగా, మరోకథ ‘గొర్రెపిల్ల -సింహం’ కథలో ఎక్కడున్నా తమ శక్తులను మరవని వారిని గురించి చక్కగా చెప్పారు. గొర్రెల మందలో పెరిగినా సింహం పిల్ల తన శక్తుల్ని ఎలా పోగొట్టుకోకుండా ఉండగలిగిందో, అదే విధంగా భారతీయులు తమ శక్తియుక్తులను ఎక్కుపెట్టి దేశ దాస్యశృంఖలాలు తొలగించారని రచయిత రాశారిందులో. ‘బలవంతునితో స్నేహం’ మరో మంచి కథ. బలవంతునితో బలహీనుడు స్నేహం చేస్తే ఎటువంటి అనర్థాలు, ఇబ్బందులు కలుగుతాయో చక్కగా చెప్పారు కసిరెడ్డి. దాదాపు పదిహేనేండ్ల కాలంలో ఈ పుస్తకం పది ముద్రణలు పొందడం, దీని విశిష్టతతో పాటు, బాలబాలికలతో పాటు పెద్దల వద్దకు ఎలా చేరిందో తెలుపుతోంది. భగవద్గీతను కూడా యువతరం, పిల్లల కోసం గేయంగా కూర్చారు ఈ ఆచార్యులు. డెబ్బైఎనిమిదేండ్ల ఈ నిత్యచైతన్యశీలి కలం, గళం నిరంతరంగా సాగే ప్రవాహం. బాలల కోసం భవిష్యత్తును దిద్దుకునే కథలను అందించిన ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి అనేక మందిని ప్రభావితం చేసిన ఋషి. బాలవికాస దిక్సూచి గరిపెల్లి అశోక్‌ తొలి పుస్తకం ‘నాంది’కి నాంది, ఈ వ్యాసకర్త 1993లో తెచ్చిన తొలి పుస్తకం ‘కవితా పాంచజన్యం’ కు ఆది ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. జయహో! బాల సాహిత్యం!
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548న