-17 రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు
– పరిష్కారం చూపని అధికారులు
రెక్కాడితే కాని డొక్కాడని కార్మికులు వారు. అసలే చిన్న జీతాలు. ఆ జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి మున్సిపాలిటీది. దీనితో ఆ కార్మికులు అన్నమో రామచంద్రా అంటూ భిక్షాటనకు కూడా దిగాల్సి వస్తోంది. కార్మికులు ఆందోళనకు దిగిన సమయంలోనే అధికారులు, పాలకవర్గం తూతూ మంత్రంగా ఒకటి లేదా రెండు నెలల జీతాలు చెల్లించి తాత్కాలికంగా సమస్యను పరిష్కరిస్తున్నారే తప్ప దీనికి శాశ్వత పరిష్కారం చూపడం లేదు. ఇది కాగజ్‌నగర్ మున్సిపాలిటీ కాంట్రాక్టు పారిశుద్ద్య కార్మికుల దుస్థితి.
నవతెలంగాణ-కాగజ్‌నగర్
కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 175 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ప్రతి నెల రూ. 16,600 వేతనాలు చెల్లిస్తున్నారు. ఇవి నెలల తరబడి పెండింగ్‌లో ఉండడంతో ఆ కార్మిక కుటుంబాల పోషణ కష్టసాధ్యంగా మారుతోంది. కొన్ని సందర్భాలలో ఆరు నెలల వరకు కూడా వేతనాలు చెల్లించడం లేదు. పండగ వచ్చిందంటే చాలు కార్మికులు ఆందోళన చేస్తేనే వేతనాలు చెల్లిస్తున్నారు. పండుగల సమయంలో మా కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయంటూ కార్మికులు కార్యాలయం ముందు ధర్నా లేదా సమ్మెలు చేస్తున్నారు. దీంతో అధికారులు నామమాత్రంగా ఒకటి లేదా రెండు నెలల వేతనాలు చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు.
ప్రస్తుతం 17 రోజులుగా సమ్మె
ప్రస్తుతం కార్మికులు 17 రోజులుగా సమ్మె చేపడుతున్నారు. దీనితో పట్టణంలో పారిశుద్ద్య సమస్య తీవ్రమైంది. కేవలం 11 మంది కార్మికులు, ఏడుగురు ఎన్‌ఎంఆర్ కార్మికులు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిని కూడా సోమవారం నుండి పనిలోకి అనుమతించబోమని మిగిలిన కార్మికులు స్పష్టం చేస్తున్నారు. మంచినీటి సరఫరా విభాగంలో పని చేసే కార్మికులు, కార్యాలయంలో పని చేసే సిబ్బందిని కూడా అడ్డుకుంటామని సమ్మెలో పాల్గొంటున్న కార్మికులు తెలిపారు. ఇదే జరిగితే పట్టణవాసులకు మంచినీటి సరఫరా ఉండక సమస్య తీవ్రమయ్యే పరిస్థితి నెలకొంటుంది. ప్రస్తుతం కాంట్రాక్టు పారిశుద్ద్య కార్మికులకు నాలుగు నెలల వేతనాలు ఇవ్వాల్సి ఉండగా, ఎన్‌ఎంఆర్ కార్మికులకు ఆరు నెలల వేతనాలను చెల్లించాల్సి ఉంది.
2016 నుండి ఈఎస్‌ఐ, పీఎఫ్ పెండింగ్
కార్మికులకు చెల్లించే వేతనాలలో నుండి ప్రతి నెలా ఈఎస్‌ఐ, పీఎఫ్ పేరిట అధికారులు కోత విధిస్తున్నారు. కాని కోత విధించిన మొత్తాన్ని ఆయా ఖాతాలలో జమ చేయడం లేదు. ప్రతి కార్మికునికి నెల నెలా రూ.16,600 జీతం చెల్లించాలి. ఇందులో నుండి ఈఎస్‌ఐ, పీఎఫ్ పేరిట రూ. 2000 కోత విధిస్తున్నారు. కోత విధించిన మొత్తాన్ని అధికారులు వెంటనే ఈఎస్‌ఐ, పీఎఫ్ ఖాతాలలో జమ చేయాలి. దీనికి మున్సిపాలిటీ కూడా కొంత మొత్తం కలపాల్సి ఉంటుంది. కోత విధించిన మొత్తం నుండి 12 శాతాన్ని ఈఎస్‌ఐ, 1.75 శాతాన్ని మున్సిపాలిటీ పీఎఫ్‌కు జమ చేయాల్సి ఉంటుంది. మున్సిపల్ వాటా పక్కన పెడితే కార్మికుల నుండి కోత విధించిన మొత్తాన్నే అధికారులు జమ చేయకపోవడం కార్మికులను ఆందోళనకు గురి చేస్తోంది.