– మూడ్రోజుల పాటు కొనసాగిన నిరసన
– సమస్యల పరిష్కారానికి డైరెక్టర్ లిఖితపూర్వక హామీ కొనసాగుతున్న కమిటీల విచారణ
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
రిమ్స్ మెడికోలు మూడ్రోజులు చేపట్టిన ఆందోళనను విరమించారు. బుధవారం అర్ధరాత్రి రిమ్స్ కళాశాలలోకి డైరెక్టర్ ఫ్యాన్స్ అంటూ కొందరు చొరబడి దాడి చేయడంతో కలకలం రేపింది. మెడికోలు విధులను బహిష్కరించి రిమ్స్ ఎదుట ఆందోళన చేపట్టి డైరెక్టర్‌ను సస్పెండ్ చేయాలంటూ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కలెక్టర్ అక్కడికి వచ్చి మెడికోలతో మాట్లాడి విచారణకు కమిటీ ఏర్పాటు చేయడంతో ఆందోళన విరమించారు. శుక్ర, శనివారం సైతం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. డైరెక్టర్ స్పందించి సమస్యల పరిష్కారానికి మెడికోలతో చర్చలు జరిపి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం తమ డిమాండ్లను ఎంత సమయంలో పరిష్కరిస్తారో లిఖితపూర్వకంగా రాసి డైరెక్టర్ మెడికోలకు అందజేశారు.
ఆందోళన విరమిస్తున్నాం : జూడాల అధ్యక్షుడు
జూడాలతో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ చర్చలు జరిపి డిమాండ్ల పరిష్కారానికి టైం బాండ్ రాసివ్వడంతో నిరసన విరమిస్తున్నట్టు జూడాల అసొసియేషన్ రిమ్స్ అధ్యక్షుడు అరుణ్ తెలిపారు. మూడ్రోజుల కిందట రిమ్స్ కళాశాల ఆవరణలోకి కొందరు వ్యక్తులు వచ్చి దాడి చేయడంతో నిరసన కొనసాగిందని చెప్పారు.
ఈ దాడిపై మూడు కమిటీలు విచారణ చేపడుతున్నాయన్నారు. తమకు న్యాయం కావాలని శనివారం నుంచి అత్యవసర సేవలు కూడా బహిష్కారిస్తామని ప్రకటించడంతో డైరెక్టర్ తమను సంప్రదించి గిరిజన ప్రాంత ప్రజలకు వైద్యసేవలో ఇబ్బందులు కలగొద్దని చెప్పినట్టు వివరించారు. తమ సమస్యలు చెప్పాలని డైరెక్టర్ సూచించడంతో 15 డిమండ్లను రాతపూర్వకంగా ఇచ్చినట్టు చెప్పారు. వాటిని త్వరతగతిన పరిష్కరించేలా టైం బాండ్‌ను డైరెక్టర్ ఇచ్చారని, దీంతో తమ నిరసనను తాత్కాలింగా విరమిస్తున్నట్టు తెలిపారు. నిర్ణీత సమయంలోపు తమ సమస్యలను పరిష్కరించకపోతే మళ్లీ ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అలాగే విచారణ కమిటీలో తమకు విరుద్ధంగా రిపోర్టు వచ్చినా మళ్లీ ఆందోళనలు చేపడుతామని స్పష్టం చేశారు. దాడిలో గాయపడిన వారికి పూర్తి రక్షణ రిమ్స్‌తోపాటు బయట కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ క్రాంతి కుమార్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ రిమ్స్‌కు రానివ్వకూడదని హెచ్చరించారు.
మెడికోల డిమాండ్ల పరిష్కారానికి కృషి : డైరెక్టర్
మెడికోల డిమాండ్ల పరిష్కారానికి పూర్తి చర్యలు తీసుకుంటామని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. రక్షణ కల్పించాలని, సీసీ కెమెరాలు, అదనపు ఫ్లోర్ తదితర వాటి గురించి ప్రస్తావించారన్నారు. తన పరిధిలో ఉన్న వాటిని సోమవారం వరకు పూర్తి చేస్తామని హామీనిచ్చారు. ఉన్నత స్థాయిలో ఉన్న వాటిని అధికారులు, ప్రభుత్వం, డీఎంఈ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.a