భయంకరమైన దాడి

A terrible attack– గాజా ఆస్పత్రిపై బాంబుల వర్షం అమానుషం
– చనిపోయిన వారిలో చిన్నారులే అధికం : ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌
జెనీవా: గాజాలో ఆస్పత్రిపై జరిగిన దాడిలో అమాయక ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా.. మృతి చెందగా..వారిలో చిన్నారులే అధికంగా ఉన్నారని వైద్య వర్గాలు తెలిపాయి. ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ దాడిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ తీవ్రంగా ఖండించారు. దీనిని భయంకరమైన దాడిగా వర్ణించారు. అంతర్జాతీయ మానవతావాద చట్టాల కింద ఆస్పత్రులు, వైద్య సిబ్బందికి రక్షణ ఉందని గుర్తు చేశారు. దాడిని ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కూడా ఖండించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ తీవ్రంగా నిరసించారు. ఆస్ప త్రులు, పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ఉచితం కాదని ఆయన అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ దాడిని నిరసించింది. ఈ దాడి పట్ల రెడ్‌క్రాస్‌ అంతర్జాతీయ కమిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఐరాస భద్రతా మండలిని వెంటనే సమావేశపరచాలని యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌, రష్యా కోరాయి.
పరస్పర ఆరోపణలు
కాగా దాడికి మీరంటే మీరే కారణమంటూ ఇజ్రాయిల్‌, హమాస్‌ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఇజ్రాయిల్‌ క్షిపణి దాడి చేసిందని హమాస్‌ అంటుంటే హమాస్‌ ప్రయోగించిన క్షిపణి గురితప్పి ఆస్పత్రిపై పడిందని ఇజ్రాయిల్‌ తెలిపింది. ఇది ఇజ్రాయిల్‌ పనేనని హమాస్‌ నేతృత్వంలోని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఈ ఘటనను భయంకరమైన ఊచకోతగా అభివర్ణించింది. అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయిల్‌ తోసిపుచ్చింది. హమాస్‌తో కలిసి పనిచేసే పాలస్తీనా
మిలిటెంట్‌ సంస్థ ఇస్లామిక్‌ జిహాద్‌ ఈ ఘాతుకానికి పాల్పడిందని ప్రత్యారోపణ చేసింది. అయితే బాంబు దాడి చేయడం ద్వారా ఇజ్రాయిల్‌ క్రూరమైన మారణకాండకు పాల్పడిందని ఇస్లామిక్‌ జిహాద్‌ మండిపడింది.
ఆందోళనలు…నిరసన ప్రదర్శనలు
గాజా ఆస్పత్రిపై దాడి తర్వాత పాలస్తీనాలో ఆందోళనలు మిన్నంటాయి. రమల్లాలో ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి దేశాధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసి రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు బలగాలు భాష్పవాయు గోళాలను ప్రయోగించాయి. ఇరాన్‌లోని బ్రిటన్‌, ఫ్రాన్స్‌ రాయబార కార్యాలయాల వద్ద కూడా వందలాది మంది నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ఈజిప్ట్‌ సదస్సు రద్దు
యుద్ధాన్ని నివారించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పశ్చిమాసియాకు బయలుదేరిన తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి నేపథ్యంలో అమ్మాన్‌లో జరగాల్సిన ప్రాంతీయ సదస్సును ఈజిప్ట్‌ రద్దు చేసుకుంది. ఈ సదస్సులో జోర్డాన్‌ రాజు అబ్దుల్లా-2, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌, ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిస్సీతో బైడెన్‌ సమావేశం కావాల్సి ఉంది. ఇజ్రాయిల్‌, హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధం పశ్చిమాసియాను ప్రమాదం అంచుకు నెట్టిందని జోర్డాన్‌ విదేశాంగ మంత్రి అయమన్‌ సఫాదీ చెప్పారు. యుద్ధానికి స్వస్తి చెప్పి, పాలస్తీనా మానవతను గౌరవించి, అవసరమైన సాయం అందించేందుకు అందరూ అంగీకరించినప్పుడే జోర్డాన్‌ సదస్సును నిర్వహిస్తుందని తెలిపారు. ఈజిప్ట్‌ సదస్సు రద్దయిన నేపథ్యంలో బైడెన్‌ కేవలం ఇజ్రాయిల్‌లో మాత్రమే పర్యటిస్తారని శ్వేతసౌధం తెలిపింది.
A terrible attackతక్షణమే కాల్పుల విరమణ పాటించండి అరబ్‌ దేశాల డిమాండ్‌
ఐక్యరాజ్యసమితి : గాజా ఆస్పత్రిపై జరిగిన బాంబు దాడిలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై 22 అరబ్‌ దేశాలు స్పందించాయి. గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలని డిమాండ్‌ చేశాయి. ఈ ఊచకోత ఘటనపై అరబ్‌ దేశాలు ఆగ్రహంతో ఉన్నాయని ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనా రాయబారి రియాద్‌ మన్సూర్‌ తెలిపారు. గాజా నుండి పాలస్తీనా ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నాలకు స్వస్తి చెప్పాలని, ప్రజలకు వెంటనే మానవతా సాయం అందించాలని అరబ్‌ దేశాలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఊచకోత ఘటన నేపథ్యంలో ప్రజల ప్రాణాలు కాపాడడానికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అందుకే కాల్పుల విరమణ పాటించాలని కోరుతున్నామని అన్నారు. ఈ దాడికి ఇజ్రాయిలే కారణమని సిరియా, సౌదీ అరేబియా ఆరోపించాయి. ఇజ్రాయిల్‌ గాజా స్ట్రిప్‌లో యుద్ధ నేరాలకు, మారణహోమానికి పాల్పడుతోందని లిబియా విదేశాంగ శాఖ మండిపడింది. ఇరాక్‌ మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. లెబనాన్‌లో నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి. ఇజ్రాయిల్‌ ఉద్దేశపూర్వకంగా ఆస్పత్రిపై బాంబు దాడి జరిపిందని, ఇది అంతర్జాతీయ మానవతావాద చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌-ఫతా అల్‌-సిసీ విమర్శించారు.