కమ్యూనిస్టు ప్రమాణాలకు నిలువెత్తు నిదర్శనం

To communist standards Standing evidenceకామ్రేడ్‌ సీతారాం ఏచూరి. జగమెరిగిన కమ్యూనిస్టు నేత. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి. ఆయన అకాల మరణం పట్ల దేశం ప్రత్యేకించి వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులు తల్లడిల్లుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ వామపక్ష అభిమానులు, పార్టీ కార్యకర్తలు, వివిధరంగాలకు చెందిన మేధావులు ఏచూరితో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటున్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మీడియా కార్యదర్శి సంజరు బారు ‘జాతీయ వామపక్ష పతాకగా ఎదిగిన హైదరాబాద్‌ కుర్రోడు’ అన్నారు. ప్రఖ్యాత ఆర్థికవేత్త, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఏచూరితో పాటు ఆర్థికశాస్త్రంలో పిహెచ్‌డి విద్యార్ధిగా చేరిన ప్రొఫెసర్‌ అరుణ్‌ కుమార్‌ ఏచూరిని ఉద్యమ జీవితంలో ఎగుడు దిగుడులు చూసిన ధీశాలి అన్నారు. సీతారాంకు శ్రద్ధాంజలి ఘటించటానికి హైదరాబాద్‌లో సమావేశమైన జెఎన్‌యు పూర్వ విద్యార్ధుల్లో ఒకరు, కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ఫ్రొఫెసర్‌ శ్యామలాదేవి ‘ఏచూరి అన్న నా తొలి సెమిస్టర్‌ ఫీజు కట్టకపోతే నా పిహెచ్‌డి చదువు ముందుకు సాగేది కాదని’ కన్నీళ్లు పెట్టుకున్నారు. రాహుల్‌ గాంధీ తన నివాళిలో ‘ఇండియా బ్లాక్‌ సష్టికర్త. భారత దేశ భావనకు రక్షకుడు’ అన్నారు. ఇవన్నీ గమనిస్తే ఏచూరి వ్యక్తిత్వంలోని బహుముఖ కోణాలు కళ్ల ముందు ఆవిష్కతమవుతాయి.
నా చివరి సంభాషణ
మధ్యభారతం కార్యక్షేత్రంగా పనిచేస్తున్న వివిధ వామపక్ష శ్రేణుల్లో కొందరు సిపిఎం ప్రజా సంఘాల్లో పని చేయటానికి సిద్ధంగా ఉన్నారన్న వార్త నాకు చేరింది. ఎన్నికలకు ముందే సుప్రీం కోర్టులో ఓ కేసు నిమిత్తం ఢిల్లీ వెళ్లాను. ఆ సందర్భంగా ఈ విషయమై కామ్రేడ్‌ సీతారాంతో చర్చించటానికి, సాధ్యాసాధ్యాలు పరిశీలించటానికీ సమయం అడిగాను. వివిధ రాష్ట్రాల్లో ఇండియా భాగస్వాముల మధ్య సీట్ల సర్దుబాటు సంప్రదింపుల్లో పాత్ర పోషిస్తూ తీరికలేని పనిలో ఉన్నా నాకు సమయం కేటాయించి ప్రతిపాదనపై చర్చించారు. ఎన్నికల తర్వాత మరో దఫా వివరంగా కూర్చుందాం అన్నారు. తదనుగుణంగానే నేను కామ్రేడ్‌ సీతారాంను చివరిసారి కలిసి మాట్లాడినది జులై 25వ తేదీన. అప్పటికే పార్టీ మహాసభల షెడ్యూల్‌ ప్రకటించటం, కుటుంబ అవసరాల రీత్యా లండన్‌ పర్యటన ఉండటంతో కలువలేకపోయాం.
ఆగస్టు 13వ తేదీన ‘ఎలా ఉన్నారు కామ్రేడ్‌’ అని మెసేజ్‌ పెట్టాను. ‘ఏదో అలా ఉన్నాను రా’ అని సమాధానం. ‘అదేమిటి’ అని నా తిరుగు ప్రశ్న. ‘నా ఆరోగ్యం గురించి నీకు తెలీదా?’ అని ఆయన తిరుగు సమాధానం. విన్నాక నాకెందుకో ఢిల్లీ వెళ్లి కలవాలనిపించింది. అదే విషయం అడిగాను. ‘రమ్మంటారా’ అని. ‘ఏం… ఇక్కడున్న వాళ్లు నన్ను సరిగ్గా చూసుకోవటం లేదని అనుమానమా?’ అన్నారు నవ్వుతూ. ఆ నవ్వుతో పాటు తెరలు తెరలుగా దగ్గు. అప్పుడు చెప్పారు… కాటరాక్ట్‌ ఆపరేషన్‌ అయ్యిందని. చూడటానికి వస్తాను అంటే డిశ్చార్జి అయ్యాక కలుద్దాం అన్నారు.
వయసులో చిన్నా పెద్దా లేకుండా ఆయనతో అందరికీ అంత చనువు తీసుకోగలిగినంత స్వేచ్ఛనిస్తారు కామ్రేడ్‌ సీతారాం. రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశాక ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా నన్ను ఎంపిక చేసుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుండి నాకు ఈ సమాచారం వచ్చినప్పుడు ఓవైపు ఎంత ఆనందం కలిగిందో అంతే భయం కూడా. ఎందుకంటే అప్పటికే ఆయన భారత రాజకీయాల్లో శిఖరాయమానమైన నాయకుడు. మారిన పరిస్థితుల్లో బిజెపి (ఫాసిస్టు ఆరెస్సెస్‌) వ్యతిరేక కూటమికి దన్నుగా నిలవాలన్న పార్టీ అవగాహనను అమలు పరిచే క్రమంలో సూర్జిత్‌ చొరవతో కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ఏచూరి యుపిఎ-లెఫ్ట్‌ సమన్వయ బందంలో వామపక్ష ప్రతినిధి అయితే ప్రణబ్‌ ముఖర్జీ యుపిఎ ప్రతినిధి. చిదంబరం, జయరాం రమేష్‌తో కలిసి కనీస ఉమ్మడి కార్యక్రమానికి వ్యూహకల్పన చేసిన దిట్ట. అటువంటి గొప్ప వ్యక్తి దగ్గర పని చేయటం అంటే అంతే ఒత్తిడి ఉంటుంది. ‘నేను హిందీలో కానీ, ఇంగ్లీషులో కానీ అంత ప్రవీణుడిని కాను. మీరు ప్రాతినిధ్యం వహించే బెంగాల్‌ నుండి వచ్చే విజ్ఞప్తులు హాండిల్‌ చేసేంత సామర్ధ్యం లేదు. మీరిచ్చే బాధ్యతకు సరిపోనేమోనండీ’ అంటూ అనుమానం వ్యక్తం చేశాను. ఎన్నికల సమయంలో నెయిదర్‌ గుడ్‌ నార్‌ గవర్నెన్స్‌ అనే శీర్షికన రాసిన వ్యాసం పీపుల్స్‌ డెమొక్రసీలో అచ్చయ్యింది. అప్పట్లో చంద్రబాబునాయుడు నినాదం గుడ్‌ గవర్నెన్స్‌ గురించి లండన్‌ కేంద్రంగా ఉన్న ఓ పరిశోధనా సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ వ్యాసం రాశాను. ‘ఆ వ్యాసం చూశాను. ఆ మాత్రం ఇంగ్లీషు వస్తే సరిపోతుంది. నాకు కావల్సింది భాషా ప్రవీణులు కాదు. పార్టీ పట్ల నిబద్ధత, ఏ పనైనా అప్పగించగించవచ్చన్న భరోసా కావాలి’ అన్నది ఆయన సమాధానం. చివరకు ప్రజాశక్తి బాధ్యతల నుండి తప్పుకొని ఎకెజీ భవన్‌ చేరాను. నాటి నుండి నేటి వరకూ కామ్రేడ్‌ సీతారాం నామీద ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటూ పని చేస్తున్నాను.
పని – ప్రాధాన్యతల సమన్వయంలో దిట్ట
ఆయనకున్న బహుముఖ వ్యాసంగం, వ్యాపకాల్లో నా టేబుల్‌ మీద చాలా పనులు పెండింగ్‌ ఉండిపోయేవి. ఒకరోజు ఇలా అయితే కుదరదు కామ్రేడ్‌ అన్నాను. అదేమిటి అన్నారు. నా దగ్గర పేరుకుపోతున్న జాబితాను చూపించి ఇన్ని పనులు పెండింగ్‌ పెడితే ఇక నేను మీకు అందించే సహకారం ఏముంటుంది అని నిలదీశాను. నవ్వుతూ ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ టైం మేనేజ్‌మెంట్‌ అని ఓ చిన్న ఎంబీయే క్లాసు తీసుకున్నారు. అప్పుడు అర్థం అయ్యింది నాకు. ప్రతి ఒక్కరికీ పలురకాల పనులు ఏక కాలంలో ముందుకొస్తాయి. ఏ పనిని ఎప్పుడు ఎంచుకోవాలి, ఎప్పుడు పూర్తి చేయాలి అన్నది వివరించేదే ప్రిన్సిపల్స్‌ ఆప్‌ టైం మేనేజ్మెంట్‌ పాఠం. ఈ పాఠం ప్రకారం తన ప్రాధాన్యతలను నిర్ణయించుకోవడానికి మొత్తం పనులను నాలుగు తరగతులుగా విభజించేవారు. అందులో అత్యవసరం, ముఖ్యం అన్న కేటగిరీలోకి వచ్చిన పనులను పూర్తి చేసుకుంటూ వెళ్లేవారు. ఈ మాత్రం ప్రాధాన్యత కలిగిన పనులు అయినా మీ దష్టికి తేవాలి అంటే మీరేమో బిజీ బిజీగా ఉంటారు అని నిష్టూరమాడాను. దానికి సమాధానంగా సముద్రం అలలు ఆగితేనే తీరంలో నడవాలి అనుకుంటే కుదరదు అని వెన్ను తట్టారు. నాటి నుండి నేటి వరకూ నేను ఎప్పుడు ఏ విషయం ఆయన దష్టికి తీసుకురావాలని అనుకుంటే అప్పుడే చొరవ తీసుకునేవాడిని. పదిహేనేళ్లుగా మా మధ్య అనేక విషయాలు గురించిన సమాచారం, పరిణామాలు, పార్టీ స్పందిస్తే బాగుంటుందన్న అంశాలు, పార్లమెంట్‌లో లేనెత్తితే దేశం దష్టికి వస్తుందనుకున్న అంశాలూ… ఒకటేమిటి… ఎన్నో ఆయన దష్టికి తెచ్చేవాడిని. అర్థరాత్రి ఏదో చదువుకుంటుంటే ఓ ఆలోచన వస్తే అది ఆయన దష్టికి తీసుకెళ్లదగినది అని నేను భావిస్తే వెంటనే వాట్సప్‌ మెస్సేజ్‌ పెట్టేవాడిని. అంతరాత్రి కూడా మెసేజ్‌ చూసి స్పందించేంత ఓపిక కామ్రేడ్‌ ఏచూరిది.
2006 ఆనుకుంటాను. పారిస్‌లో యునెస్కో సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలోనే టాంజిబుల్‌ కల్చర్‌, ఇన్‌టాంజిబుల్‌ కల్చర్‌ అన్న చర్చ జరిగింది. మౌఖిక వాంగ్మయం అంతా ఇన్‌టాంజిబుల్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ అని తీర్మానించింది. ఆ సందర్భంగా జరిగిన చర్చల్లో క్యూబా గురించిన ఓ తీర్మానం ఆమోదానికి వచ్చింది. అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికాకూ, క్యూబాకూ ఉన్న సైద్ధాంతిక వైరం తెలిసిందే. ఆ తీర్మానంలో క్యూబా పక్షాన నిలవటానికి భారత రాయబారి సంశయిస్తున్నారు. దాంతో కామ్రేడ్‌ సీతారాం ఏచూరి చొరవ తీసుకుని ‘నన్ను భారత ప్రభుత్వ ప్రతినిధిగా పంపారు. నేను క్యూబ్యాకు అనుకూలంగా ఓటు చేయమని తీర్మానిస్తున్నాను.’ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దాంతో అక్కడున్న రాయబారి అప్పటి విదేశాంగశాఖ మంత్రి నట్వర్‌సింగ్‌కు ఫోన్‌ చేశారు. ఏచూరి ప్రతిపాదనకు ఆయన సానుకూలంగా స్పందించడంతో విదేశాంగ శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
కొత్త అధ్యయనాలు – కొత్తకోణాలతో ప్రభుత్వంపై చెర్నకోల
2007 లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఓ కుదుపు కుదిపిన సబ్‌ ప్రైమ్‌ సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ నావను ఒడ్డుకు చేర్చే ప్రయత్నంలో ఉద్దీపన పథకాలు ప్రకటించింది. ఈ సందర్భంగా కామ్రేడ్‌ ఏచూరి అటు పార్టీ వారపత్రిక పీపుల్స్‌ డెమొక్రసీలోనూ, హిందూస్థాన్‌ టైమ్స్‌లోనూ ఎంతో సంక్లిష్టమైన ఆర్థిక సంక్షోభాన్ని సరళంగా వివరిస్తూ ఎన్నో వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాల్లో విలువైన గణాంకాలున్నాయి. ఆ కాలంలో కామ్రేడ్‌ సీతారాం ఉపయోగించిన గణాంకాల్లో ఎక్కువ భాగం సేకరించి పెట్టాను. వీటిల్లో కొన్నింటిని పార్లమెంట్‌ చర్చల్లో సైతం ఉపయోగించారు. ఓ సందర్భంలో పార్లమెంట్‌లో ఉన్న అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం ‘ఏచూరీ, మీరు చెప్తున్న లెక్కలకు ఆధారాలేమిటి?’ అని ప్రశ్నించారు. దాంతో పార్లమెంట్‌ లాబీలోకి వచ్చి నాకు కాల్‌ చేశారు. ‘ఈ లెక్కలు ఎక్కడ నుండి తీశావురా?’ అని. సబ్‌ ప్రైమ్‌ సంక్షోభాన్ని ముందస్తుగానే ఊహించిన ఆర్థికవేత్తల్లో నోరియల్‌ రూబిని ఒకరు. ఆయన పెట్టుబడిదారీ విధానపు బలహీనతలను ఎత్తి చూపిస్తూ పుంఖాను పుంఖాలుగా తన సొంత వెబ్‌ సైట్‌లో రాసేవారు. అందులో కొన్నిటిని అప్పట్లో అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కూడా ఉపయోగించింది. ఈ వివరాలు కామ్రేడ్‌కు ఇచ్చాను. అదే వివరాలు చిదంబరం దష్టికి తీసుకెళ్లారు. రూబిని ఫాలో అవుతున్నారంటే నిన్ను తట్టుకోవటం కష్టమేనని చిదంబరం చలోక్తి విసిరారు. ముంబయిపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో చిదంబరం హోంశాఖకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రణబ్‌ ముఖర్జీ ఆర్థికశాఖ బాధ్యతలు తీసుకున్నారు. 2007 నుండీ 2011 వరకూ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లలో పన్ను మినహాయింపుల ద్వారా కేంద్రం కోల్పోయిన ఆదాయం గురించిన చర్చను ప్రారంభించిన ఘనత కామ్రేడ్‌ ఏచూరిది. దాని తర్వాతనే అన్ని పత్రికలూ ఈ విషయంపై విశ్లేషణలు చేశాయి. ఇలా అత్యంత ప్రతిభావంతులైన విలేకరుల కంటే కూడా ముందుగానే విషయాలను పసిగట్టగలిగిన అసమాన ప్రతిభావంతుడు కామ్రేడ్‌ సీతారాం.
మేధో సంకీర్ణాల్లోనూ మేటి
అపారమైన అధ్యయనం ఆయన పెట్టుబడి. ఎన్ని పుస్తకాలు చదివావు అన్నది కాదు ఆయనకు గీటురాయి. ఎన్ని పుస్తకాల్లోని జ్ఞానాన్ని వర్తమాన అవసరాలకు ఉపయోగించుకోగలిగాం అన్నది గీటురాయి. సుమిత్ర చిస్తి కామ్రేడ్‌ సీతారాంకు అత్తయ్య. సీమా చిస్తీ తల్లి. జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలోనే ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్‌, ఆమె కషిని జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేసిన స్మారకోపన్యాసాలు కూడా నూతన మేధో సంకీర్ణాల నిర్మాణానికి వేదికలుగా మల్చుకున్నారు కామ్రేడ్‌ ఏచూరి. ఓ స్మారకోపన్యాసానికి సమాచార హక్కు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన అరుణారారుని ఆహ్వానిస్తే, మరో సమావేశానికి కర్ణాటకకు చెందిన ప్రముఖ సాహిత్యకారుడు యు.ఆర్‌. అనంతమూర్తిని ఆహ్వానించారు. మరి కొన్ని స్మారకోపన్యాసాలకు శాస్త్రవేత్తలను ఆహ్వానించారు. యు.ఆర్‌.అనంతమూర్తి బీజరూపంలో ప్రస్తావించిన బహుళ అస్తిత్వాలు అన్న సూత్రీకరణను తొలిసారిగా లెఫ్ట్‌హాండ్‌ డ్రైవ్‌ శీర్షికలో రాసిన వ్యాసంలో విస్తారంగా చర్చించారు. 2017 ఆగస్టులో రాజ్యసభ ఎంపీగా బాధ్యతల నుండి వైదొలగే సందర్భంలో చేసిన వీడ్కోలు ఉపన్యాసం ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఆ ఉపన్యాసంలో తాను కుల, మత, ప్రాంత, భాషా అస్తిత్వాలను అధిగమించిన భారతీయుడిని అని చెప్పుకున్నారు. ఈ ఉపన్యాసం లెఫ్ట్‌ హ్యాండ్‌ డ్రైవ్‌ శీర్షికన రాసిన వ్యాసానికి తార్కిక ముగింపే. సుమిత్ర చిస్తి స్మారకోపన్యాసాల్లో ఒక ఉపన్యాసంలో ప్రపంచ వ్యాప్తంగా భౌతిక శాస్త్రంలో జరుగుతున్న పరిశోధనలను ప్రస్తావిస్తారు. ఆ ప్రస్తావనల సారాన్ని అందుకుని అప్పట్లో అణు ఇంధన ఒప్పందాల గురించి జరుగుతున్న చర్చల్లో తనదైన శైలిలో ఉపయోగించి అందరినీ ఆశ్చర్యపర్చేవాడు. ఎంతో మంది మేధావుల నుండి, పరిశోధకుల నుండీ ఆలోచనలు, సూత్రీకరణలు స్వీకరించి తాను నాయకత్వం వహిస్తున్న పార్టీ అవగాహనతో వడపోసి తగిన సమయంలో తగిన విధంగా ఉపయోగించటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇటువంటి మేధో సంకీర్ణాలే నేడు ఇండియా బ్లాక్‌కు కావల్సిన సైద్ధాంతిక పునాదిని, ఆరెస్సెస్‌ ఫాసిస్టు దాడిని ఎదుర్కొనడానికి అవసరమైన వ్యూహాత్మక సాధనాలను అందిస్తోంది.
ముల్కీ వాణి – బాణి
రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరిన కాలం అది. ఉత్తర తెలంగాణలో మొదలైన ఉద్యమం రాష్ట్రమంతటా కార్చిచ్చులా వ్యాపించింది. చివరకు ఓ దశలో ప్రత్యేక తెలంగాణ వాదులు సుందరయ్య విజ్ఞాన కేంద్రంపై కూడా దాడికి సిద్ధపడుతున్నారన్న వార్తలు కామ్రేడ్‌ సీతారాంకు ఆందోళన కలిగించాయి. అర్థరాత్రి పూట టీవీల్లో వస్తున్న స్క్రోలింగ్‌ చూసి కామ్రేడ్‌ సీతారాం కు ఫోన్‌ చేశాను. తక్షణమే అప్పటి తాత్కాలిక ముఖ్యమంత్రి రోశయ్యకు, తెరాస ఎంపీగా ఉన్న బి వినోద్‌కుమార్‌కు ఫోను చేశారు. దాంతో అదనపు బలగాలు బాగ్‌లింగంపల్లి చేరాయి. కాసేపటికి హైదరాబాదు నగరంలో ఉన్న పార్టీ శ్రేణులు కూడా చేరుకోవటంతో ఆందోళనకారులు తమ ఉద్వేగాలను అణుచుకుని నిరసన నినాదాలు చేస్తూ సాగిపోయారు. తెలంగాణ బిల్లు గురించి పార్లమెంటులో జరిగిన చర్చల్లో పాల్గొంటూ వెనకడిన ప్రాంతాల అభివద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించకలేకపోతే ముందుముందు ఇటువంటి ప్రాంతీయ ఉద్యమాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్టీ విధానపరంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కట్టుబడి ఉందని చెప్తున్నప్పుడు పార్లమెంట్‌లో గందరగోళం నెలకొంది. తెరాససభ్యులు కేకలు వేస్తుంటే వాళ్లను నోరు మూయించటం కోసం నా దగ్గర ముల్కీ సర్టిఫికెట్‌ ఉంది. మీ దగ్గర కానీ మీ నాయకుడి దగ్గరకానీ ఉన్నదా అని సవాలు విసిరారు. దాంతో సభ సద్దుమణిగింది.
స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్‌ విషయంలో
తెలంగాణ సాయుధ పోరాటంలోనూ, స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొన్న పాతతరం కమ్యూనిస్టు నేతలు మల్లు స్వరాజ్యం, కె.కష్ణమూర్తి, బి.ఎన్‌.రెడ్డి వంటి వారు స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్‌ డిమాండ్‌తో ప్రతినిధి బందంగా వచ్చారు. హోంమంత్రిగా ఉన్న చిదంబరం దష్టికి విషయాన్ని తీసుకెళ్లాం. అక్కడ నుండి సరైన సమాధానం రాకపోవడంతో జీరో అవర్‌ చర్చల ద్వారా ఈ విషయాన్ని పార్లమెంట్‌ దష్టికి తీసుకురావడం మంచిదని ప్రతిపాదించాను. దానికి కామ్రేడ్‌ అంగీకరించారు. జీరో అవర్‌లో ఈ విషయాన్ని లేవనెత్తుతూ ‘స్వాతంత్య్ర సమర యోధులు పెన్షన్‌ కోసం డిమాండ్‌ చేస్తున్నారంటే దాన్ని కేవలం ఆర్థిక డిమాండ్‌గానో, కేంద్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం మోపే డిమాండ్‌గానో చూడరాదనీ, స్వాతంత్య్రోద్యమంలో తాము చేసిన త్యాగాలకు గుర్తింపు కావాలన్న డిమాండ్‌గా చూడాలని’ ఏచూరి ప్రభుత్వాన్ని కోరారు. చివరకు ప్రధానమంత్రి దష్టికి తీసుకెళ్లటంతో కొందరికైనా పెన్షన్‌ విడుదల కావడానికి ఈ జీరో అవర్‌ చర్చ ఉపయోగపడిరది.
పార్లమెంట్‌కు గురజాడ
బహు భాషల్లో ప్రవేశం ఉన్నప్పటికీ తెలుగు సాహిత్యానికి కామ్రేడ్‌ సీతారాం జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. అప్పటి ప్రజాశక్తి పుస్తకాలయం ఎడిటర్‌ తెలకపల్లి రవి ఓ విజ్ఞప్తి పంపారు. ప్రముఖ కవి కేతు విశ్వనాధ రెడ్డి తెలుగు సాహిత్యం గురించి ఇంగ్లీషులో ఓ పుస్తకం ప్రచురించ సంకల్పించారనీ, దానికి ముందు మాట రాయాలన్నది ఆ విజ్ఞప్తి. ఈ విషయం గురించి చర్చించే క్రమంలోనే తల్లి కల్పకం ఏచూరి కూచిపూడి నత్యకారిణి అనీ, ఆ రకంగా త్యాగరాయ కతులు వంటి వాటితో పరిచయం ఏర్పడిరదనీ గుర్తు చేసుకున్నారు. విశ్వనాధ రెడ్డి పుస్తకానికి రాసిన ముందుమాటలో కర్నాటక్‌ సంగీత స్రవంతి ఆవిర్భావం, దాని చరిత్ర గురించి అద్భుతంగా వివరించారు. అదేవిధంగా ఉద్దీపన పథకాల గురించి జరిపే చర్చలోనే అనుకుంటా… ఈ పథకాలు పెట్టుబడిదారులకు వరాలు కాకూడదని చెప్పే ప్రయత్నంలో దేశమంటే మట్టి కాదోరు దేశమంటే మనుషులోరు అన్న గుజరాడ పద్యాన్ని ఇంగ్లీషు-తెలుగు భాషల్లో పార్లమెంట్‌కు పరిచయం చేశారు. పార్లమెంట్‌లో పాలకపక్షం, ప్రతిషక్షం మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లతో సభ వేడెక్కుతున్న తరుణంలో హిందీ సాహిత్యంలో సందర్భోచిత కవితలు, కథనాలు, షాయిరీలతో సభలో వాతావరణాన్ని ఉల్లాసంగా మార్చిన సందర్భాలెన్నో ఉన్నాయి.
ఎయిమ్స్‌ పట్ల అపారమైన గౌరవం
కామ్రేడ్‌ సీతారాం అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్ర సంస్థ (ఎయిమ్స్‌) పట్ల ప్రత్యేక అభిమానం ఉండేది. అనేక సందర్భాల్లో ఎయిమ్స్‌ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించటంలో ఆయన ప్రత్యేకంగా జోక్యం చేసుకున్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో 27 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ అప్పటి యుపిఎ ప్రభుత్వం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా బిజెపి ప్రోత్సాహంతో అనేక ఉన్నత విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బంది సమ్మెకు దిగారు. ఎయిమ్స్‌ వైద్యులు కూడా. చివరకు కామ్రేడ్‌ సీతారాం జోక్యం చేసుకుని మీ సమ్మె దేశవ్యాప్తంగా తరలి వస్తున్న రోగులకు ప్రాణాంతకమవుతుందనీ, ప్రత్యామ్నాయ నిరసన మార్గాలు చూసుకోవాలని సలహా ఇచ్చారు. ఆ సంస్థ పట్ల తనకున్న గౌరవాన్ని వీడ్కోలు ఉపన్యాసంలో కూడా రాజ్యసభ దష్టికి తెచ్చారు. ఆయనకున్న నమ్మకంతోనే చివరిదశలో చికిత్స అవసరం అయినప్పుడు ఎయిమ్స్‌లో చేర్చారు.
అంతర్జాతీయ కమ్యూనిస్టు నేతగా సీతారాం
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సైద్ధాంతిక సామర్ధ్యం పట్ల ఇటలీ, గ్రీస్‌, పోర్చుగల్‌ కమ్యూనిస్టు పార్టీలకు అపారమైన విశ్వాసం. కామ్రేడ్‌ మోటూరు హనుమంతరావు చనిపోయిన మరునాడు నేడు కష్ణవేణి విగ్రహం ఉన్న ప్రాంతానికి దిగువన అంత్య క్రియలు జరిగాయి. ఆ సందర్భంగా అప్పటి పార్టీ ప్రధాన కార్యదర్శి సూర్జిత్‌ మాట్లాడుతూ 1952 ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో తాను ఇటలీ కమ్యూనిస్టు పార్టీ మహాసభలకు హాజరవుతున్నాననీ, దాదాపు 33 శాతం ఓట్లతో ఆంధ్రప్రాంతంలో కమ్యూనిస్టులు విజయం సాధించటం ప్రపంచాన్ని అబ్బురపర్చిందనీ గుర్తు చేసుకున్నారు. నాటి నుండీ సిపిఎం కార్యాచరణ, సైద్ధాంతిక నిబద్ధత, అంతర్జాతీయ పరిణామాల పట్ల అవగాహన, దేశీయ కార్యాచరణ విషయంలో వివిధ దేశాల కమ్యూనిస్టు పార్టీలకు విలక్షణమైన విశ్వాసం ఉండేది. ఈ విశ్వాసానికి మరింత భరోసా ఇచ్చిన సందర్భం 1992లో జరిగిన 14వ మహాసభల సందర్భంగా ఆమోదించిన ‘కొన్ని సైద్ధాంతిక సమస్యలపై తీర్మానం’ ఈ తీర్మానాన్ని కామ్రేడ్‌ బసవపున్నయ్య మార్గదర్శకత్వంలో కామ్రేడ్‌ సీతారాం రూపొందించారు. ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టే సందర్భం వచ్చినప్పుడు ఈ తీర్మానాన్ని ఏచూరి ప్రవేశపెట్టాలన్నది కామ్రేడ్‌ ఎంబీ ప్రతిపాదన. మీరుండగా నేనెలా ప్రవేశపెడతాను అన్న కామ్రేడ్‌ ఏచూరి ప్రశ్నకు సమాధానంగా ఎంబీ ‘మేం ఉన్నప్పుడు ప్రవేశపెడితేనే కదా పొరపాటు జరిగితే సరిదిద్దుతాం. మేం లేకపోతే ఆ పొరపాట్లు ఎవరు సరిదిద్దుతారు?’ అని ప్రశ్నించారు. కోజికోడ్‌ మహాసభల సందర్బంగా సైద్ధాంతిక సమస్యలపై ప్రత్యేక తీర్మానం రూపొందించాలని పార్టీ నిర్ణయించింది. ఈ తీర్మానం రూపొందించే క్రమంలో మా ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో కామ్రేడ్‌ ఏచూరి వెల్లడిరచిన విషయాలు ఇవి. ఈ సామర్ధ్యంతోనే భారత వామపక్ష ఉద్యమం ప్రపంచీకరణ నేపథ్యంలో తలెత్తుతున్న సమస్యలను, కార్యాచరణకు ఎదురవుతున్న అవరోధాలకు పరిష్కారాలు చూపే ప్రయత్నంలో ఢిల్లీలో 2005లో జరిగిన సిపిఎం జాతీయ మహాసభల్లో సైద్ధాంతిక సమస్యలపై రూపొందించిన తీర్మానం.
మార్క్సిస్టు కార్యాచరణ ప్రమాణాలను అనుసరించి నేపాల్‌ లో వామపక్ష సంఘటన ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగా అధికారానికి తీసుకురావటంలో కామ్రేడ్‌ సీతారాం పాత్ర అద్వితీయం. కామ్రేడ్‌ ప్రచండ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వానికి అంతర్జాతీయ ఆమోద స్థాయి కల్పించటంలో కూడా కామ్రేడ్‌ సీతారాం క్రియాశీలక సజనాత్మకతను ప్రదర్శించారు. నేపాల్‌లో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఎలా ఏర్పడిరది అన్నది ఓ పెద్ద అధ్యాయం. భిన్న కోణాలకు, భిన్న ధవాలకు ప్రాతినిధ్యం వహించే శక్తులు, నాయకులతో సంప్రదింపులు జరిపి ఒప్పించి తత్కాలీన సమస్యలకు ఓ పరిష్కారం చూపటంలో కామ్రేడ్‌ ఏచూరి శక్తి సామర్ధ్యాలు అనన్య సామాన్యం.
కామ్రేడ్‌ సీతారాంతో చివరి మూడు రోజులు
కంటి ఆపరేషన్‌ అయ్యాక ఆఫీసుకు వచ్చి పార్టీ మహాసభ పనుల్లో నిమగమయ్యారు కామ్రేడ్‌ సీతారాం. ఢిల్లీలోనే ఆగస్టు 19న ఓ ముఖ్యమైన సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశంలో ఉన్నట్లుండి ఇబ్బంది తలెత్తడటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియగానే సీమాచిస్తికి కాల్‌ చేశాను. ఐసియు నుండి రూంకి వచ్చారు, డిశ్చార్జ్‌ అయ్యాక వచ్చి వెళ్లమన్నారు. రోజువారీ ప్రాతిపదికన కామ్రేడ్‌ ఆరోగ్య విషయాలు తెలుసుకుంటూ ఉన్నాను. చివరకు వెంటిలేషన్‌ మీదకు వెళ్లారు అని విన్న తర్వాత మనసాగలేదు. సీమా వారిస్తున్నా కోర్టు నుండే ఎయిర్‌ పోర్టుకు వెళ్లాను. వెంటనే సీమాను కలిశాను. దేశంలో ఇంతకన్నా మెరుగైన వైద్యం అందించటానికి అవకాశం ఉందా లేదా అని అడిగాను. ఊపిరితిత్తుల సమస్య అయినందున ఆర్మీ ఆసుపత్రిలో పని చేసే వైద్యులు కాశ్మీర్‌ సరిహద్దుల్లో పని చేసే సైన్యానికి వచ్చే ఇటువంటి ఇబ్బందులు పరిష్కరించటలో దిట్టలు కాబట్టి ఆర్మీ రిఫరల్‌ ఆసుపత్రి నుండి ఎవరినైనా పిలుద్దామా అని ప్రతిపాదించాను. చివరకు ఎయిర్‌ లిఫ్ట్‌ చేసి మరెక్కడన్నా వైద్యం చేయిస్తే కామ్రేడ్‌ బతికే అవకాశం ఉందా అని కూడా చర్చించాను. అన్నీ విన్న తర్వాత ఎయిమ్స్‌ మీద కామ్రేడ్‌కు నమ్మకం ఉంది. దేశంలో గుర్తింపు పొందిన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు ఆయన నమ్మకాన్ని కాదని నేను నిర్ణయం తీసుకోలేను అని చెప్పారు సీమా. చేసేదేమీ లేక విషన్న వదనుడనై వెనుదిరిగాను. ఆందోళన చెందినట్లే పరిస్థితి విషమించింది. మానప్రయత్నం ముగిసిందని వైద్యులు చెప్పారు …..
కామ్రేడ్‌ సీతారాంతో గడిపిన రోజులు, జరిపిన చర్చలు, చేసిన వాదనలే జ్ఞాపకాలుగా కర్తవ్యోన్ముఖులం అవుదాం.
కామ్రేడ్‌ సీతారాంకు విప్లవాభినందనల వీడ్కోలు.
– కొండూరి వీరయ్య
98717 94037