పొక్సో కేసులలో పరిపూర్ణమైన నేర విచారణ జరగాలి

నవతెలంగాణ -కంటేశ్వర్

నేరం చేసిన వ్యక్తులు చట్టం నుండి తప్పించుకునే వీలులేకుండా నేర విచారణ జరగాలని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల అన్నారు.మరి ముఖ్యంగా బాలలపై జరిగిన క్రిమినల్ కేసుల విచారణలో సంబంధిత విచారణ అధికారులు సూక్మస్థాయిలో నేర విచారణ జరగాలని ఆమె సూచించారు.ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సమావేశపు హాల్ లో న్యాయసేవ సంస్థ నిర్వహించిన పొక్సో చట్టంపై అనే అంశంపై ఆమె ప్రసంగించారు. చాలా సున్నితంగా సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. బాలలపై లైంగిక దాడులు జరిగిన సందర్భంలో వారి మెడికల్ సాక్ష్యం కీలకమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు.కన్విక్షన్ రేటు పెరిగితే నేరాలు తగ్గుముఖం పడతాయని అన్నారు. పొక్సో చట్టంపై విస్తృత అవగాహన కోసం నిజామాబాద్ జిల్లాలో లఘుచిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంన్నదని జిల్లాజడ్జి వివరించారు. నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపున పొక్సోకేసుల నేర విచారణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విచారణ పూర్తి చేస్తామని అన్నారు.కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సలహాదారు సాయి ప్రసాద్ పోలీసు అధికాలు, వివిద ప్రభుత్వ శాఖల స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు.