– వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి
– బాధ్యులెవరో తేల్చి తగిన చర్యలు తీసుకోవాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘కేసీఆర్ మానసపుత్రికైన కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజి 20వ పిల్లర్ కుంగుబాటుపై సమగ్ర విచారణ జరిపించాలి. నాణ్యతా లోపాల వల్ల నష్టం, తదితర వాస్తవాలను ప్రజలకు బహిర్గతం చేయాలి. డ్యాం సేఫ్టీ అధికారుల నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును దేశంలోనే ప్రతిష్టాత్మకంగా చేపట్టారనీ, మూడేండ్లలోనే రికార్డు స్ధాయిలో నిర్మాణం పూర్తిచేశామనీ, ఆ ప్రాజెక్టు ద్వారా 18.5లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వడమే కాకుండా, మరో 17లక్షల పాత ఆయకట్టును స్ధిరీకరించడానికి ప్రణాళిక రూపొందించామని ప్రభుత్వం చెబుతోందనీ, అయితే ఆ మురిపెం మూణ్ణాళ్ల ముచ్చటగా మారిందని పేర్కొన్నారు. అది పూర్తయిన రెండేండ్లకు గోదావరికి వరదలు రావడంతో ఇదేబ్యారేజి లోని 7పంపులు నీట మునిగాయని తెలిపారు. వాటి రిపేర్లు, నష్టం ఎవరు భరించాలన్న మీమాంస ముందుకొచ్చిందని గుర్తుచేశారు. ఆ సంఘటన మర్చిపోక ముందే ఇప్పుడు 18 నుంచి 21 వరకు గల బ్యారేజి పిల్లర్లు అడుగున్నర లోతుకు కుంగిపోయాయనీ, వీటితో పాటు వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో తలెత్తిన లోపాలు కూడా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. పగుళ్లు, లీకేజీలు, పెచ్చులూడటం వంటివి కన్పిస్తున్నాయని తెలిపారు. నాలుగేండ్ల నుంచి 8 ఏండ్ల లోపు నిర్మాణం చేసిన ప్రాజెక్టుల్లో నాణ్యతా లోపాలు వెలుగుజూస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. బ్యారేజి పూర్తికాగానే తెలంగాణ, మహారాష్ట్రకు మధ్య భారీ వాహనాలు రాకపోకలకు అనుమతిచ్చారని తెలిపారు. ప్రతీ బ్యారేజిపై రవాణాను నిషేధించినా, కాళేశ్వరం నుంచి రవాణాను అనుమతించారని పేర్కొన్నారు. పిల్లర్ ఒకవైపు కుంగిన తర్వాత 10.6 టీఎంసీల నిల్వ వున్న నీటిని మొత్తం బయటకు పంపించారని తెలిపారు. దీంతో యాసంగిలో ప్రాజెక్టులోని నీటిని వినియోగించుకోలేని పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. మొత్తం నీరు వినియోగంలోకి రాకుండానే నిర్మాణ లోపాలు బహిర్గతమయ్యాయని వివరించారు. భారీ స్ధాయిలో బ్యారేజికి నష్టం జరిగినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి గానీ, ఇంజనీర్ల వైపు నుంచి గానీ వాస్తవాలు ఎందుకు బైట పెట్టడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టు పూర్తి కాకముందే జరిగిన భారీ నష్టంపై సమగ్రమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వాస్తవాలను తెలియజేయడంతో పాటు నష్టానికి బాధ్యులు ఎవరో ప్రకటించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.