ఫోన్‌ ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ జరపాలి

ఫోన్‌ ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ జరపాలి– దోషులు ఎంతటి వారైనా శిక్షించాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపైన సమగ్ర విచారణ జరిపి, దోషులు ఎంతటి వారైనా బయటకు తీసి శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాజకీయ ప్రత్యర్థులను బలహీనపరిచేందుకు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో వెలుగు చూస్తున్న విషయాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి సమీపంలో ఇళ్లు అద్దెకు తీసుకుని ఆధునిక పరికరాలతో వారి ఇంట్లో ఏం మాట్లాడుకునేవారో రికార్డు చేశారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్టు కావడం, ఇంటెలిజెన్స్‌ మాజీ ఛీఫ్‌ పేరు రావడం దారుణమని పేర్కొన్నారు. నిఘా వ్యవహారం ఇంత లోతుగా ఉండడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ఆందోళనకరవని తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇజ్రాయెల్‌ సాఫ్ట్‌వేర్‌ పెగాసెస్‌తో రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టుల ఫోన్‌లు ట్యాపింగ్‌ చేయించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం కూడా అదే బాటలో నడిచిందని తెలిపారు. రాష్ట్రంలో ట్యాపింగ్‌ వ్యవహారం కేవలం పోలీసులు సొంతంగా చేసింది కాదనీ, దీని వెనుక ఉన్న వ్యక్తులు, కారణాలపై రాష్ట్ర ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. గతంలో రాజకీయ అవసరాల కోసం ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిన కేసులో కర్నాటక మాజీ సీఎం రామకృష్ణ హెగ్డే రాజీనామా చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో రాజకీయ నాయకులు, ప్రత్యర్థులు, ప్రజాసంఘాలపై ఫోన్‌ ట్యాపింగ్‌ చేయకుండా వ్యవస్థలు సక్రమంగా నడిచే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.