చిరుప్రాయాన్ని చిదిమేస్తున్న చింతన

చిరుప్రాయాన్ని చిదిమేస్తున్న చింతనబూజుపట్టిన విద్యా విధానం… బట్టీవిధానం, ఆసక్తి లేని కోర్సులను బలవంతంగా ఎంపిక చేసుకోవాల్సి రావడం, మార్కులు, భవిష్యత్తుపై భయం, ర్యాంకుల పరుగు పందెంలో చదువు అంటేనే ఒత్తిడికి పర్యాయపదంగా మారింది. దాన్ని తట్టుకోలేక ఎంతో మంది విద్యార్థులు ఒత్తిడికి లోనై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు… తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చే క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు నేటి విద్యార్థులు.

తల్లిదండ్రులు తమ పిల్లల శక్తిసామర్థ్యాలు, అభిరుచులను గుర్తించకపోవడం, పిల్లలకు జీవన నైపుణ్యాలు, భావోద్వేగాల నియంత్రణలతో పాటు సవాళ్లను, వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవడం… నిజానికి, సమస్య వ్యవస్థలో కాదు. మన దక్పథంలోనే ఉందని గ్రహించాలి. పిల్లల ప్రయత్నాలను ప్రశంసించి, వారికి సరైన మార్గదర్శనం చేస్తే జీవితంలో మేటిగా రాణించడానికి అవకాశం ఉంటుంది.
వాస్తవానికి పిల్లలపై కొంత ఒత్తిడి సర్వసాధారణమే. ఒత్తిడితో కూడిన సమయాల్లో పిల్లలకు ఎలా మద్దతు ఇవ్వాలో తెలుసుకోవాలి.
పిల్లలతో మీరు బాగా కలిసిపోతున్నా, వారిని ప్రేమిస్తున్నారని, మద్దతుగా వుంటున్నారని వారికి తెలియజేయాలి. ఎంతగా ప్రేమిస్తున్నారో గుర్తు చేయడం చాలా ముఖ్యం.
పిల్లల భావాలను పంచుకోవాలి. వారి రోజు ఎలా ఉందో, వారు ఏమి చేస్తున్నారో అడగాలి. ఇంటి పనుల్లో, వంట పనుల్లో వారిని భాగస్వాములను చేస్తూ సంభాషణ సాగించాలి. పిల్లల కోసమే తాము వున్నామని, వారి ఆలోచనలు తెలుసుకోవాని వుందని చెప్పాలి. అసౌకర్యంగా వున్నా కూడా అది కూడా వారికి సహాయపడ్డానికే అని గుర్తుచేయాలి.
పిల్లలకు నచ్చే పనులేమిటో, నచ్చనివేమిటో గ్రహించాలి. అందుకోసం వారికి తప్పనిసరిగా కొంత సమయం కేటాయించాలి.
పిల్లలు ఏడు గంటలు పాఠశాలలో ఇంటికి వస్తారు. రాగానే హోంవర్క్‌ పూర్తి చేసి, మరుసటి రోజు మళ్ళీ బడికి వెళ్ళాలనే ఆలోచనలతో పడుకుంటారు. ఇక పాఠ్యేతర కార్యకలాపాల గురించి ఆలోచించడానికే వారికి సమయం వుండదు.
పిల్లల్లో చైతన్యం నింపడానికి కొంత ఖాళీ సమయం అవసరం. వారి మెదడు, శరీరం విశ్రాంతి తీసుకోవాలి. పిల్లలంటేనే స్వాతంత్య్రం! వారు మాత్రమే వుండేలా తగిన సమయం, స్థలాన్ని వారికి కేటాయించాలి. ఆ సమయంలో వారు స్నేహితులతో గడుపుతారా, ఒక్కరే వుంటారా అనేది పెద్ద పట్టింపు కాదు. అయితే వారిని పెద్దవాళ్లు ఓ కంట గమనిస్తూనే వుండాలి.

మీరు కోపంగా ఉన్నప్పుడు వారితో ఏ సమస్యనూ చర్చించవద్దు. ఆ కోపం తగ్గాక వారితో మీ సమస్యను చర్చించండి. వీలైతే ఆ సమస్య ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో వారికి వివరించాలి. అది వారికి భవిష్యత్తులో తప్పకుండా ఉపయోగపడొచ్చు. సమస్యలు ఎలా వుండొచ్చో వారికి కొంతమేరకు తెలుస్తుంది.
ఆటలకు సమయం కేటాయించాలి. చిన్న పిల్లలకు ఇది చాలా సహజం. ఆ ఆటలు శారీకక శ్రమతో కూడుకున్నవైతే ఇంకా మంచిది. సైకిల్‌ తొక్కడం, బేస్‌ బాల్‌, కుస్తీ, హైకింగ్‌, తాడు ఆట. ఆటలు వల్ల గెలుపు ఓటములను తెలుసుకుంటారు.
నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. ఒత్తిడిని తగ్గించడం, మానసిక స్థితిని మెరుగపడడానికి నిద్ర చాలా ముఖ్యం. మీ బిడ్డకు తగినంత నిద్ర లేకపోతే చాలా ప్రమాదం. ఈజీగా నిద్రొచ్చే వాతావరణాన్ని కల్పించాలి. అంటే పిల్లల పడకగదిలో నుండి టీవీ, ఇతర ఎలక్ట్రానిక్‌లను తీసేయాలి.
ఒత్తిడి నిజంగా అంటుకొంటుంది. తల్లిదండ్రులు ఒత్తిడికి గురైనప్పుడు, పిల్లలు ఒత్తిడికి గురవుతారు. ఒత్తిడిని ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలో మీ పిల్లలకు చెప్పండి.
ఇల్లు ప్రశాంతంగా వుంటే ఇంట్లో మనుషులూ ప్రశాంతంగా వుంటారు. అస్తవ్యస్తమైన ఇల్లు పిల్లలకు మరొక ఒత్తిడితో కూడిన ట్రిగ్గర్‌. అరుపులూ, హడావుడితో రోజు మొదలైతే ఆ రోజంతా అలాగే వుంటుంది. అందుకే ప్రశాంతమైన ఉదయం వుండేలా చూసుకోవాలి.
డా|| హిప్నో పద్మా కమలాకర్‌, 9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌