అనుకరించడం సులువు. స్వేచ్ఛగా ఆలోచించడమే కష్టం. ఇలా ఆలోచించే స్వభావాన్ని చేకూర్చడమే సకల విద్యల లక్ష్యం. ప్రముఖ తత్వవేత్త అన్నట్టు ”స్వతంత్రంగా ఆలోచించే శక్తి, ఎదుటివారి పట్ల సహనం, కొత్తవాటిని సష్టించుకునేందుకు అవసరమైన తష్ణ” పాదుకొల్పే రీతిలో చదువులు ఉండాలి. ఈ లక్షణాలు కలవారే మంచి వ్యక్తులుగా రూపొంది సమాజ వికాసానికి దోహదపడతారు. అప్పుడే నిర్హేతుక ఆచరణను నిరసిస్తారు. నిలదీస్తారు. ఎందుకు? ఏమిటి? ఎలా? అనే ప్రశ్నల్ని సంధించడం నేర్పగలిగే చదువులే పిల్లల మానసిక వికాసానికి సరైన దిశానిర్దేశం చేస్తాయి.
మతప్రచారకులు, మతాల్ని నమ్మేవారు మతం పట్ల అభిరుచినీ, నమ్మికనీ, నేర్పుతారు. వారికి సత్యంతో నిమిత్తం లేదు. శాస్త్రీయ ఆధారాలతో పనిలేదు. ఈ నమ్మకాల్ని ఆశ్రయించినవారు స్వతంత్రంగా ఆలోచించలేరు. అందువల్లనే లౌకిక సూత్రాలపైనే విద్యావిధానం రూపొందాలి. శాస్త్రీయ దక్పథమే ప్రాతిపదిక కావాలి. కార్యాకారణ సంబంధం మీదనే ఆధారపడి దేవుడు, మతం గురించి సైతం చర్చించాలి. వాటి నిర్హేతుకతను చూపి, సొంతంగా ఆలోచించడం ఎలానో నేర్పాలి. ఏది సత్యం, ఏదసత్యం తెలుసుకోవాలన్న జిజ్ఞాసని పిల్లల్లో ప్రోది చేయాలి.
సత్యదూరాలైన నమ్మకాల పట్ల ఆరాధనాభావం చూపేవారు స్వతంత్ర ఆలోచనకు దారులు వేయలేరు. ప్రతి దాన్ని తర్కించి ప్రశ్నించే నైజాన్ని అలవరచలేరు. కేవలం అనుకరించడం నేర్పుతారు. అనుకరించడం వల్ల సజన వికసించదు. కుతూహలం అంతరిస్తుంది. శతాబ్దాల నమ్మకాల మీదుగానే నడిచివెళతారు. దీనికి విరుద్ధంగా స్వతంత్ర భావాల్ని అలవరిచే పనిని ఒక ఉద్యమంగా నిర్వహించడం శాస్త్రీయ దష్టి గల వారి బాధ్యత. పాలకుల అసంగత, అశాస్త్రీయ విధానాల్ని ప్రశ్నించడం అనివార్య కర్తవ్యం.
తద్వారా భావాల సంఘర్షణకు, ఏది తప్పు, ఏది ఒప్పు తెలుసుకోడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సిసలైన నిజాల్ని గ్రహించడం వీలవుతుంది. ఈ క్రమాన మరోవిధంగా ఆలోచించడం కుదురుతుంది. స్వతంత్రంగా ఆలోచించినప్పుడే అనేక ఆలోచనల్ని స్వీకరించి తర్కించడం తెలుస్తుంది. ఏ విషయంలోనైనా స్వేచ్ఛగా ఆలోచించడం అలవడితే జీవితంలోనూ, సమాజంలోనూ తమకు తాముగా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం. ఇతరులు తమ మీద రుద్దే నిర్ణయాల్ని తిరస్కరించి, స్వతంత్రంగా ఆలోచించి తమకు ఏది ఉచితమో అందుకు అనుగుణంగా వ్యవహరించగలరు. ఇది సమాజ వికాసానికి, వ్యక్తి వికాసానికి తోడ్పడుతుంది. ‘నూరు పూలు వికసించనీ- వెయ్యి ఆలోచనలు సంఘర్షించనీ’ అని మావో అన్నట్టు విద్యార్థులు తమ సొంత ఆలోచనలతో చదువుకో గలిగినప్పుడు మాత్రమే.. మార్కుల ఒత్తిడి నుంచి దూరం కాగలరు. తద్వారా దేశాన్ని కలవరపెడుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు కొంత మేరకైనా తగ్గవచ్చు.