భావ ప్రకటనా స్వేచ్ఛకు ముప్పు

A threat to freedom of expression– ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై నివేదిక
మిజోరంలో శాసనసభ ఎన్నికలు ముగిశాయి. ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతగా 20 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఆ రాష్ట్రంలో మిగిలిన 70 స్థానాలతో పాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెలలోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ రాష్ట్రాల్లో భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని ‘ఫ్రీ స్పీచ్‌ కలెక్టివ్‌’ అనే సంస్థ ఓ నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఐదు రాష్ట్రాల్లో పాత్రికేయులు, ఆర్‌టీఐ కార్యకర్తలు పలు సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపింది. పాలక పార్టీలు తమ విమర్శకుల నోళ్లు నొక్కేందుకు, అసమ్మతిని అణచివేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని వివరించింది.
న్యూఢిల్లీ : గత ఐదు సంవత్సరాలుగా ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణతోపాటు.. మిజోరం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో పాత్రికేయులు, ఆర్‌టీఐ కార్యకర్తలపై వేధింపులు, అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. అవినీతిని బయటపెట్టే వారిని, అధికారులను ప్రశ్నించే వారిని, వివాదాస్పద అంశాలపై వార్తలు అందించే వారిని కొన్ని సందర్భాల్లో హతమారుస్తున్నారు కూడా. ప్రభుత్వ విధానాలు లేదా చట్టపరమైన చర్యల ద్వారా పాత్రికేయులపై నిర్బంధాలు కొనసాగుతున్నాయి. రాజద్రోహం నుంచి పరువునష్టం వరకూ పాత్రికేయులపై లెక్కలేనన్ని కేసులు బనాయించి అక్రమంగా నిర్బంధిస్తున్నారు. దీంతో వారు భయంతో స్వీయ సెన్సార్‌షిప్‌ విధించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. మధ్యప్రదేశ్‌లోని గుణ, శివపురి జిల్లాల్లో జలాం సింగ్‌ అనే విలేకరిపై ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి గత రెండు నెలలుగా నిర్బంధంలో ఉంచారు. దీంతో తోటి పాత్రికేయులు భయాందోళనలకు లోనై పరిశోధనాత్మక జర్నలిజం నుంచి దూరమవుతున్నారు. వారంతట వారే స్వీయ నిర్బంధాన్ని విధించుకున్నారు. ప్రశ్నించడమే మరిచారు. సహచరుడి అరెస్టును నిరసించాల్సింది పోయి పాత్రికేయులు సానుకూల వార్తలనే ప్రచురిస్తున్నారని, లంచం తీసుకోవడం ఇష్టంలేని జర్నలిస్టు మాత్రం జైలులోనే కాలం గడుపుతున్నారని జలాం సింగ్‌ భార్య సుమన్‌ కిరణ్‌ వాపోయారు. మధ్యప్రదేశ్‌లో కోవిడ్‌ సమయంలో అనేక పత్రికలు ప్రచురణను నిలిపివేయడంతో పాత్రికేయులు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనపై వార్త రాసిన ఓ పాత్రికేయుడి ఇంటిని బుల్‌డోజర్‌తో దాడిచేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇసుక అక్రమ తవ్వకం, అవినీతిపై వార్తలు రాసినందుకు పాత్రికేయులపై అనేక అభియోగాలు మోపారు. పరిశోధనాత్మక వార్తలు అందించిన పాత్రికేయులపై లెక్కలేనన్ని కేసులు పెట్టి విచారణ జరుపుతున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ ఇంటర్నెట్‌ సదుపాయాన్ని నిలిపేయడం సర్వసాధారణమై పోయింది. రాజస్థాన్‌లో నిరసనలు జరుగుతుండగా 72 సార్లు ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని ఆపేశారు. మిజోరంలోని సరిహద్దు ప్రాంతాల్లో సమాచార సేకరణపై ఆంక్షలు విధించారు. ఆర్‌టీఐ కార్యకర్తల భావ ప్రకటనా స్వేచ్ఛపైనా దాడి జరిగింది. కొందరు కార్యకర్తలపై హింసకు తెగబడి దాడులు చేశారు. ఓ భూ వివాదంలో జరిగిన అవకతవకలను బయటపెట్టిన 70 సంవత్సరాల ఆర్‌టీఐ కార్యకర్త నల్లా రామకృష్ణయ్యను తెలంగాణలో హత్య చేశారు. ఓ వైపు విద్వేషపూరిత ప్రసంగాలు, మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతుంటే మరోవైపు భావ ప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు మితిమీరాయి. ఇది మీడియాకే పరిమితం కాలేదు. సామాజిక మాధ్యమాలు, బహిరంగ వేదికలపై తమ అభిప్రాయాలను విన్పించే కళాకారులు, విద్యావేత్తలు, కమెడియన్లు, రచయితలపై కూడా నిర్బంధాలు సాగుతున్నాయి.