– శంకర్పల్లి మాజీ ఎంపీపీ బీర్ల నరసింహా
నవతెలంగాణ-శంకర్‌పల్లి
చేవెళ్ల గడ్డపై బీఆర్‌ఎస్ జెండా ఎగరాలంటే మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నంకు టికెట్ ఇవ్వాలని శంకర్‌పల్లి మాజీ ఎంపీపీ బీర్ల నరసింహ, పిల్లిగుండ్ల ఉపసర్పంచ్ ఐలయ్య, సొసైటీ వైస్ చైర్మన్ కాట్న నరసింహ, వార్డు సభ్యులు బిర్ల శివ, కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు. మంగళవారం శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని బద్దం సురేందర్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కాలే యాదయ్యకు టికెట్ కేటాయించే విషయంలో అధిష్టానం మరొకసారి పునరాలోచించాలని కోరారు. మొదటి నుంచి కేఎస్.రత్నం బీఆర్‌ఎస్ పార్టీనే నమ్ముకుని ఉద్యమాల్లో పాల్గొన్నారని వెల్లడించారు. అలాంటి వ్యక్తికి చేవెళ్ల ఎమ్మెల్యే టికెట్ కేటాయించకుండా, ఎమ్మెల్యే కాలె యాదయ్యకు టికెట్ విషయంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మరొక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యే కాలె యాదయ్యకు కాకుండా కేఎస్. రత్నంకే టికెట్ ఇవ్వాలని శంకర్‌పల్లి మండలం నుంచి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ముక్త కంఠంతో తెలుపుతున్నామని అన్నారు. అధిష్టానం ఎమ్మెల్యే కాలె యాదయ్యకు టికెట్ కేటాయించినట్లయితే చేవెళ్ల గడ్డపై బీఆర్‌ఎస్ పార్టీ భూస్థాపితం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. 2018 ఎన్నికల్లో శంకర్‌పల్లి నుంచి 14 వేల మెజార్టీతో గెలిపించిన మమ్మల్ని ఎమ్మెలే కాలె యాదయ్య మర్చిపోయారని విమర్శించారు. శంకర్పల్లి మండలంలో ఎంపీటీసీల విషయంలో ఎంపీటీసీల పదవులను డబ్బులకు అమ్ముకున్న ఘనత ఎమ్మెల్యేకే దక్కుతుందన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎమ్మెల్యే యాదయ్యపై తిరగబడే సమయం ఆసన్నమైందన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే నాయకుడు కేఎస్. రత్నం అని తెలిపారు. అలాంటి వారికి తప్పనిసరిగా అధిష్టానం టికెట్ ఇచ్చి బీఫాం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శంకర్‌పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి, గోపులారం బయన్న, మోకిలా మాజీ ఎంపీటీసీ యాదయ్య, పొద్దుటూరు రఘుపతిరెడ్డి, గోపులారం సామయ్య, రవీందర్, మల్లేష్, దానం, మోకిలాతండా రవినాయక్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.