అతడి ఉలి ఘాతాల కోసం శిల ఎదురు చూస్తుంది…..
అతడి శిల్ప విన్యాసంలో మూర్తీమత్వం ఒదిగిపోతుంది….
శిల్పకళాబ్రహ్మ, చిత్రకారుడు కళారత్న, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా||వేలు ఆనందాచారి తెలుగువాడవడం గర్వించదగిన విషయం. దక్షిణ భారతదేశంలోని వందలాది ప్రాచీన దేవాలయాల పునర్నిర్మాణంలో స్థపతిగా పనిచేసిన ఘనత కలిగినవారు. తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట దేవాలయ నిర్మాణంలో ప్రధాన స్థపతిగా బాధ్యతలు నిర్వహించిన విశేష అనుభవజ్ఞులు డా||వేలు ఆనందాచారి.
ఆనందాచారి జూన్ 1, 1952లో చిత్తూరు జిల్లా వెన్నెంపల్లి గ్రామంలో విశ్వకర్మ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటినుండి తండ్రి చేస్తున్న వృత్తిని శ్రద్ధగా గమనిస్తూ పెరిగినందువల్లనేమో శిల్పకళపై, చిత్రలేఖనంపై అభిరుచి పెంచుకున్నాడు. తిరుపతి టి.టి.డి శిల్పకళాశాలలో నాలుగు సంవత్సరాల పాటు శిల్ప విద్యను అభ్యిసించారు. చిత్రకళను ఎన్.వి.కృష్ణన్ గురువు వద్ద నేర్చుకున్నారు. వారు విద్యార్థి దశలో ఉన్నప్పుడే అనుకోని కారణాల వల్ల తండ్రి, అన్న మరణించారు. దాంతో తల్లి పోషణ బాధ్యతను తనే తీసుకోవాల్సి వచ్చింది. ఒకవైపు చదువుకుంటూనే వారాంతాల్లో శుక్ర, శని, ఆది వారాల్లో తిరుమల కొండపై భక్తుల క్యూలైన్లను నడిపే స్కౌట్ డ్యూటీ చేసేవారు. ఆ తర్వాత చదువుకోవాలన్న ఆసక్తి బలంగా ఉన్నప్పటికీ డిగ్రీ విద్యను కొనసాగించలేకపోయారు. పేదరికం వేధించినా ఆనందాచారి తనలోని ప్రతిభకు పదును పెట్టడం మాత్రం ఆపలేదు. నిరుత్సాహం, అసహాయత, నిర్లక్ష్యం, వంటివి దరిచేరకుండా ఆశావాదంతో ముందుకు అడుగు వేశాడు.
ఆనాడు హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో దేవాదాయశాఖ తరపున తిరుమల తిరుపతి దేవస్థానం వారు విదేశాలకు పంపే వెంకటేశ్వర స్వామి రాతి విగ్రహాల నిర్మాణపు పనులను చేపట్టారు. వేలు ఆనందాచారి హైదరాబాద్ వచ్చి నెలకు 7 రూపాయలకు శిల్ప కూలీగా చేరారు. చేరిన కొద్దిరోజులకే దేవాదాయ శాఖ శిల్పకళాశాలలో అధ్యాపకుల ఉద్యోగ ప్రకటన చేశారు. ఆనందాచారి దరఖాస్తు చేసుకొని 1975 లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. కష్టపడిన వ్యక్తికి విజయం వెన్నంటి ఉంటుందన్న సామెతకు ఉదాహరణ వేలు ఆనందాచారి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంచెలంచెలుగా ఎదిగారు. 1980లో సహాయ స్థపతిగా పదోన్నది పొందారు. శ్రీశైలం, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, ఒంగోలు, విజయవాడ, అన్నవరం, కాణిపాకం, శ్రీకాళహస్తి, సింహాచలం, బాసర, వేములవాడ దేవాలయాల పునర్నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు.
1990లో ఉపస్థపతిగా పదోన్నతి పొంది ద్వారక తిరుమల, తిరుపతి బుగ్గమఠం, హథారంజీ మఠం ఆలయ నిర్మాణాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ బుద్ధపూర్ణిమ ప్రాజెక్టులో పనిచేశారు. ఆ తర్వాత 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన స్థపతిగా నియమింపబడి 2010లో పదవీ విరమణ చేశారు. దాదాపు 45 ఏండ్లు అవిశ్రాంతంగా రాత్రింబవళ్లు పనిచేస్తూ పోయారు. ఏనాడూ విశ్రాంతి కోరుకోలేదు. అభిరుచి, ఉద్యోగం రెండు కలగలిసిన ప్రయాణం వారిది.
పదవీ విరమణ తర్వాత కూడా తెలంగాణలోని యాదగిరి గుట్ట నిర్మాణంలో పూర్తిసమయాన్ని వెచ్చించారు. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే డిగ్రీ చదివి, పి.జి చేసి, పదవీ విరమణ తర్వాత తన చిరకాల కోరియైన పిహెచ్.డి డిగ్రీని సాధించారు. ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు
2002లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం 25 గంటల్లో 101 మెడిసిన్ వర్ణ చిత్రాలు చిత్రించాడు. లిమ్కా బుక్ అఫ్ రికార్డ్, గ్లోబల్ ఇండియా రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డు, ఎవరెస్ట్ బుక్ ఆఫ్ రికార్డు, మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డులతో పాటు మరో వంద రికార్డులు అందుకున్నారు.
మెడిసిన్ పెయింటింగ్ ….
కాలం చెల్లిన ఔషదాలను ఉపయోగించి రంగులు తయారు చేసి, వాటితో వర్ణ చిత్రాలు వేయడాన్ని మెడిసిన్ పెయింటింగ్ అంటారు. ఈ ప్రక్రియ ద్వారా చిత్రాలను వేయడం ఆనందచారికి వెన్నతో పెట్టిన విద్య. ఈ విధానంలో వందలాది బొమ్మను వేసి ఎన్నో అవార్డులు పొందారు.
చిత్రకళ గురించి వ్యాసాలు – రచనలు
చిత్రకళల్ని గురించి పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. దేవాదాయశాఖ నేతత్వంలో వెలువడిన ‘కాశ్యపు శిల్ప శాస్త్రం’, ”మయమత శిల్ప గ్రంధం’ గ్రంథాలను డాక్టర్ సుందర రాజన్ స్థపతితో కలిసి తెలుగులో అనువదించడానికి కషి చేశారు
మయమతం అనగా… విశ్వకర్మ కుమారుడు మయబ్రహ్మ పాండవులకు ఇంద్రప్రస్థాన్ని నిర్మించి ఇచ్చిన శిల్పశాస్త్రాచార్యుడు. వీరు రచించిన శిల్పకళాశాస్త్రం అతి ప్రాచీనమైనది. శిల్పకళలో ఉన్న వివిధ లక్షణాలను మయబ్రహ్మ వివరించి ఉన్నాడు.
ఆలయ ప్రాకారాలపైనా అగుపించే వివిధ దేవతాప్రతిమల నిర్మాణం, కొలతలు, స్థానప్రతిష్ట, బ్రహ్మ మొదలుకొని సంప్రదాయ దేవీ దేవతల లక్షణాలను మయబ్రహ్మ వివరించాడు. దీనినే స్థూలంగా మయమతం అంటారు
– ఎం.దేవేంద్ర, 9490682457