ధిక్కార స్వరం

A tone of contemptఒక కన్ను అన్యాయాన్ని చూసి సహించలేక నిప్పులు కురిపిస్తుంది, ఇంకొక కన్ను ప్రజల సంవేదనలను జీర్ణించుకోలేక కన్నీరు కారుస్తుంది. ఈ రెండు పార్శాలు ఒకే వ్యక్తి లో ఉండటం బహు అరుదు. అటువంటి అరుదైన వ్యక్తి కాళోజీ. బడి పలుకుల భాష కాదు. పలుకుబడుల భాష కావాలని తెలంగాణ యాసలో కవిత్వాన్ని, కథలను రాసిన కవి. ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అయితే నేను వలకబోసిన పీపాల సిరా ఏ ఒక్క మెదడును కదిలించినట్లు లేదని కాళోజీ వాపోతాడు. రాసింది దాచుకోవడం చేతకానికవి. కవిత్వం తన్నుకోస్తుంటే దొరికిన సిగరెట్‌ పెట్టే చించి దాని వెనుక ఉన్న తెల్ల అట్ట మీద కవిత్వం రాసేవాడు అలా రాసి పోగొట్టుకున్న కవితలు అనేకం. కాళోజీ అంటే ఓ నిర్భీతికి ప్రతీక, ఓ ధిక్కార స్వరం, ఓ చెమ్మగిల్లిన కన్ను, ఓ ప్రవక్త, ఓ ప్రజాకవి. ఒక్క మాటలో చెప్పాలంటే ఓ నిఖార్సయిన తెలంగాణ బిడ్డ. ఆర్ద మనసుతో, జాలువారే కన్నీటితో ఆర్తుల పక్షాన నిలిచిన దయామూర్తి కాళోజి. అన్యాయం ఏ రూపంలో ఉన్నా ప్రతిఘటించడం శత్రువు ఎంత బలవంతుడైనా ఎదుర్కోవటం ఆయన కవిత్వంలోని ప్రత్యేకతలు. సందర్భాను సారంగా వ్యంగ్యంగా, సున్నితంగా కవిత్వాన్ని చెప్పగలడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయన ఉపన్యాసాలు, మాటలు, అన్నీ కవితామయమే. నైజాం ప్రభుత్వాన్ని ఎదిరించిన అసలు సిసలు తెలంగాణ పోరాటవాది. ఆయన కవిత్వమే కాదు, కథల ద్వారా కూడా తన పోరాట పటిమను చూపిన సాహితీ వేత్త. ఆయనను స్మరించుకోవడం అంటే ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన వదిలిన వెళ్లిన విలువలని గౌరవించడం అంతకుమించి ఆచరించడం. అలా ఆచరించ గలిగినప్పుడే కాళోజీకి నిజమైన నివాళి.
(నేడు కాళోజి వర్థంతి)
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417