ఆ శక్తుల్ని అధికారానికి దూరం చేయడమే అంబేద్కర్‌కిచ్చే నివాళి

ఆ శక్తుల్ని అధికారానికి దూరం చేయడమే అంబేద్కర్‌కిచ్చే నివాళిప్రపంచం గర్వించే మేధస్సు ఆయనది.దేశంలో అనేకమందిని ప్రభావితం చేసిన మహనీయు డాయన. అంబేద్కర్‌ను కేవలం రాజ్యాంగం రాసిన, రిజర్వేషన్లు ప్రతిపాదించిన వ్యక్తిగా మాత్రమే చూస్తారు. అంబేద్కర్‌ ఆశయ విరోధులు సైతం ఆయనను కొనియాడుతున్నారు ఆయన లక్ష్యాలు, ఆశయాలు అర్థం చేసుకోకుండా వాటిలో పది పైసలవంతు ఆచరించని వాళ్లు కూడా అంబేద్కర్‌ విగ్రహానికి దండలు వేసి దండాలు పెడుతున్నారు. వేల సంవత్సరాల మనుస్మృతి శూద్రులు అస్పృశ్యులను చదువు సంపదకు దూరం చేసింది.ప్రకృతి సహజ సిద్ధ భూమి, నీరు, గాలి వెలుతురుకు దూరం చేసింది.
సకల సమస్యలకు కర్మ గ్రహచారం పేరుతో అస్పృశ్యులు అణిచివేతకు గురవుతున్నారని గ్రహించి1927 డిసెంబర్‌ 25న మహాద్‌ పట్టణంలో చౌదార్‌ చెరువు మంచి నీళ్లపోరాటాన్ని మనుస్మృతిని తగలబెట్టడడంతో అంబేద్కర్‌ ప్రారంభించాడు. స్త్రీ సమానత్వం కోసం అహర్నిశలు కృషి చేశాడు. నాడు పార్లమెంటులో స్త్రీలకు ఆస్తి హక్కు, వారసత్వపు హక్కు, దత్తత హక్కు విడాకుల హక్కు, ఇతర స్త్రీల రక్షణ కోసం హిందూ కోడ్‌ బిల్లు ప్రవేశపెట్టాడు. దాన్ని నాటి కాంగ్రెస్‌ అంగీకరించకపోతే పార్లమెంటులో ఆయన కేంద్ర క్యాబినెట్‌ మంత్రికి రాజీనామా చేసి బయటికి వచ్చారు. దేశంలో సగభాగం ఉన్న మహిళల తరఫున రాజీనామా చేసిన వ్యక్తి అంబేద్కర్‌. కార్మిక వర్గం కోసం అంబేద్కర్‌ 1948లో కనీస వేతన చట్టాన్ని రూపొందిం చాడు. ప్రసూతి సెలవులు కల్పించాడు. అంతకంటే ముందే కమ్యూనిస్టుల నాయకత్వం లో బొంబాయిలో జరిగిన నూలు మిల్లు కార్మికుల పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని సంపూర్ణ సంఘీభావం తెలిపాడు. మతం, దేవుడు రాజకీయాలలో, అధికారం లో ఉండకూడదని చెప్పాడు. మతం రాజ్యాన్ని ఆవహిస్తే దేశం ఉన్మాదంగా మారుతుందని ఆయన ఆనాడే హెచ్చరించారు
ఏ సమాజమైనా మార్పు చెందాలంటే ఆర్థిక విప్లవమే ప్రాముఖ్యమైనదిగా భావిస్తూ అది సాధించే దానికంటే ముందే సాంఘిక సాంస్కృతిక విప్లవాల్ని దాటుకొని రావాలన్నాడు.ఆర్థిక సామాజిక అంతరాలు పరస్పర పోషకాలుగా ఉంటాయని, ఒక దానిని విస్మరించి మరోదాన్ని సాధించడం సాధ్యం కాదంటాడు. రాజ్యాంగంకంటే ముందు రాష్ట్రాలు మైనార్టీలు అనే పుస్తకంలో భూమి మొత్తం జాతీయకరణ జరగాలని, పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్య వాటా ఉండాలన్నాడు. మహారాష్ట్రలో కొంకణా ప్రాంతంలో రైతులపై వేస్తున్న కోటి అనే పన్నుకు వ్యతిరేకంగా ఆయన ప్రత్యక్ష పోరాటంలో పాల్గొన్నాడు.అంబేద్కర్‌ ఇంత సుదీర్ఘ లక్ష్యం ఆశయాలు కలిగి ఉన్నాడు.
పదేండ్ల కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ పాలకులు అంబేద్కర్‌కు మొక్కడం, ఆయన ఆశయాలను తొక్కడం చేస్తున్నారు. ప్రధానంగా అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం పనికిరాదని నాడే ఆర్‌ఎస్‌ఎస్‌ బహిరంగంగా ప్రకటించింది. తమ ప్రాచీన భారత రాజ్యాంగం మనస్మృతి మాత్రమే అని నిస్సిగ్గుగా ప్రకటించింది 2023 ఫిబ్రవరి 25వ తేదీన తెలుగు యూనివర్సిటీలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త కృష్ణారెడ్డి రచించిన ప్రాచీన భారత రాజ్యాంగం మనుస్మృతి గ్రంథ ఆవిష్కరణ సభ పెట్టగా విద్యార్థులు ప్రతిఘటించటంతో కేశవ్‌ మెమోరియల్‌ స్కూల్‌కు మార్చారు అక్కడ కూడా అడ్డుకోవడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. అంతేకాదు ఇటీవల కాలంలో కర్నాటక బీజేపీ ఎంపీ అనంతకృష్ణ హెగ్డే 400 సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బాహాటంగా ప్రకటించాడు. గతంలో నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ బాజాప్తా భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పాడు. కేవలం ఆ ఇద్దరు ఎంపీల మాటలుగా భావించలేము ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీ నాలుకతో మాట్లాడినట్లుగా భావించాలి. రాజ్యాంగంలోని నాలుగు మూలస్తంభాలైన ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, ఫెడరలిజం, సామాజిక న్యాయాల ను సర్వనాశనం చేస్తున్నారు. ఇద్దరు సీఎంలని తమ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జైల్లో నిర్బంధించారు. అనేకమంది ప్రతిపక్ష నాయకు లను లొంగిపోతే తమ పార్టీలో చేర్చుకొని పవిత్రులుగా భావించడం, ఎదిరించి పోరాడితే దోషులుగా నిలబెట్టడానికి ఈడి, సిబిఐని తమ జేబు సంస్థలుగా వాడుకుని వేధించడం చేస్తున్నారు.
సామాజిక న్యాయాన్ని సమాధి చేసే దిశగా బీజేపీ పాలన సాగుతున్నది. దేశంలోని నవరత్నాల వంటి ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నది. ప్రయివేటురంగంలో రిజర్వేషన్లు ఉండవు. రిజర్వేషన్లు కోల్పోతే సామాజిక న్యాయముండదు. కేంద్ర బీజేపీ సర్కార్‌ నూతన విద్యా విధానం పేరుతో ఉన్నత విద్యకు అట్టడుగు పేదలను దళితులను దూరం చేసే కుట్రకు ఒడిగట్టింది. నూతన విద్యా విధానంలో రిజర్వేషన్లు ఉండవు. మేనేజ్‌మెంట్‌ కోటాలోనే ప్రతిఒక్కరూ చేరాల్సిందే. కోట్ల రూపాయలు ఉన్నవారే ఉన్నత చదువు కొనుక్కుంటారు. దళితులకు ఉన్నత విద్య దక్కకుండా చేస్తున్నది. బీజేపీ ఈ పదేండ్ల కాలంలో దళితులపైన 300 రెట్లు దాడులు,దౌర్జన్యాలు పెరిగాయి. ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా అభద్రతలో జీవిస్తున్నారు. యూపీ యోగి ఆదిత్యనాథ్‌ పరిపాలనలో హత్రాస్‌లో జరిగిన దళిత యువతి గ్యాంగ్‌ రేప్‌ సంఘటనకు దేశం అవాక్కయింది. యూపీలో ఓ నదిలో స్నానం చేసిన దళిత మహిళను బట్టలూడదీసి నగంగా కర్రలతో చితకబాది హింసించారు. నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌ లోని ఉనా పట్టణంలో దళిత యువకుడు ప్రదీప్‌ రాథోడ్‌ గుర్రం ఎక్కినందుకు దాని పైనుంచి కింద పడేసి కొట్టి చంపేశారు.
నేషనల్‌ క్రైమ్‌ రికార్డు బ్యూరో ఇచ్చిన లెక్కల ప్రకారం 2018 నుంచి దళితులపై అత్యాచారాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలు ముందు పీఠినే ఉన్నాయి. 2014 -15 నుండి 2019-20 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో దళితులకు 7.51 లక్షల కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా, కేవలం 20.8శాతం మాత్రమే కేటాయించింది 2017-18 సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని రద్దు చేసింది. 2019-20 నుంచి 2023-24 సంక్షేమ పథకాలలో కేవలం 10.6శాతం మాత్రమే దళితులకు కేటాయించింది. ఇందులో 3.3శాతం మాత్రమే ఖర్చు చేసింది. దళితులు అక్షరాస్యతలో సైతం నేటికీ వెనుకబడి ఉన్నారు. దేశం సగటు 73శాతం ఉండగా దళితుల్లో 66శాతం ఉన్నట్లుగా పేర్కొన్నారు. నూటికి 60 శాతం మంది దళితులకు గుంట భూమి లేదు. దళితుల్లో 2022 నాటికి నిరుద్యోగ రేటు 8.4 నమోదయింది. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు రోజురోజుకీ బలహీన పడుతూ కేంద్ర ఆధిపత్యం చెలాయిస్తూ రాష్ట్రాల హక్కుల్ని హరిస్తున్న తీరు బాహాటంగా వ్యక్తమవుతున్నది. దేశంలో మైనార్టీలను ద్వితీయ శ్రేణి పౌరులంటూ సీఏఏ పేరిట హింసిస్తున్నది మతం ప్రాతిపాదికగా పౌరసత్వాన్ని నిర్దేశించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. మైనారిటీ మతాలపై మూక దాడులకు పాల్పడుతున్నది. 2017 నుండి 2022 మధ్యకాలంలో 2009 మతోన్మాద దాడులు, 2022-23 కాలంలో 720 చర్చిలపైన దాడులు జరిగాయి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా స్వయంగా ప్రధానమంత్రి మత క్రతువుల్లో పాల్గొన్న స్థితి జనవరి 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టలో చూసాము. పదేండ్ల బీజేపీ పాలనలో 2014 కంటే ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏమీ అమలుకు నోచుకోలేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మాట నీటి మూటగా మారింది.
బీజేపీ మతం ప్రాతిపాదికగా దేశాన్ని ఏలాలనుకుంటోంది. రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని అమలు చేయజూస్తోంది. మరోసారి ఎన్నికైతే మతం తప్ప ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, ఫెడరలిజం, సామాజిక న్యాయం ఇవేమీ ఉండవు. ఫలితంగా దేశం అధోగతి పాలవడం ఖాయం. ఈ పాలన ఇలాగే కొనసాగితే విద్వేషాలు, ఉద్రిక్తతలు, అల్లర్లు, మానవ మారణహోమం తప్ప ఏమి మిగలదు. అందుకే మతోన్మాద శక్తుల్ని అధికారానికి దూరం చేయడం, రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే అంబేద్కర్‌కి మనమిచ్చే నిజమైన నివాళి.
(ఏప్రిల్‌ 5-14 వరకు ఫూలే,
అంబేద్కర్‌ జన జాతర సందర్భంగా)
స్కైలాబ్‌బాబు
9177549646