ఎవరైనా తప్పుచేస్తే విచారణ నిమిత్తం ఆయనకు తోడుగా స్నేహితులనో, బంధువులనో వెంట బెట్టుకునిపోతారు. కొంత ఆత్మస్థైర్యం కల్పించేందుకు రక్త సంబంధీకులు వెంబడి వస్తారు. అదేందో కానీ బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు మహిళా కమిషన్‌పై దండయాత్రకు వచ్చినట్టుగా వచ్చారు. ఈ విషయాన్ని బయటి వారేవరో కాదు, ఆయన వెంటవచ్చిన మహిళా నాయకులే మాట్లాడుకున్నారు. ‘బస్సుల్లో మహిళలు రికార్డు డ్యాన్స్‌లు, బ్రేక్ డ్యాన్స్‌లు చేయవచ్చంటూ’ కేటీఆర్ తననోటి దురుసుతనాన్ని బయటపెట్టుకున్నారు. ఆయన వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారణకు హాజర వ్వాలని ఆదేశించింది. అయితే విచారణకు ఒక్కరే వస్తారని అందరూ భావించారు. కానీ ఆయన మహిళానాయకులు, కార్యకర్తలను వెంటేసు కుని తెలంగాణభవన్ నుంచి బుద్ధభవన్‌కు పదుల సంఖ్యలో వాహనాల్లో చేరుకున్నారు. అందులో మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరంతా కేటీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తూ వచ్చారు. లేకపోతే మహిళా కమిషన్ ఆయన్ను అరెస్టు చేయిస్తే అక్కడే ధర్నా చేద్దామని వచ్చారా? అనేది తెలియదు. కానీ పెద్ద ప్రదర్శన మాత్రం చేశారు. తానేదో మహిళల భద్రతపై వినతిపత్రం సమర్పించడానికి వచ్చినట్టు కేటీఆర్ రోడ్లమీద కలరింగ్ ఇచ్చారు. అయితే విచారణకు ముందు విచారం వ్యక్తం చేసిన ఆయన విచారణయాత్ర చేస్తారనుకుంటే దండయాత్రలా వచ్చారని అక్కడున్న జనం గుసగుసలాడుకున్నారు.
– గుడిగ రఘు