నది ప్రవాహం లోకి దిగినప్పుడు
నదిని ఆసాంతం స్పర్శించకుండా బయట పడే విద్య తెలియదు
నది ఒడ్డుకు చేరిన తర్వాత
అనుభవాన్నే కాని నదిని వెంట తెచ్చుకోవడం తెలియదు
నదిని ఒడిసి పట్టడం మనిషి తరమా?
నిండా మునిగినంక
దాని ప్రభావం నుంచి వెలుపల నిలబడే వాడెవడు?
కలల్ని మర్చిపోవడం జరుగుతూ వుంటుంది
కల్లోల జీవితాన్ని మరవడం సాధ్యమా?
తీపిని కాని చేదును కాని సమ పాళ్ళలో జిహ్వకు అందించడం
చర్యకు ప్రతి చర్య వెన్నతో పెట్టిన విద్య
కలల్ని కనని వాడు పీడ కలల్ని తలవని వాడు
ఎలా సుఖంగా జీవిస్తాడు
నదిని దాటి పడవను మర్చినట్టు!
నదిలోకి దిగినంత తేలికగా కలల్లోకి ప్రవేశించవచ్చు
కలల్ని తనతో వెంట తెచ్చుకోవడమే జీవిత సాధన
వడిసి పట్టాలనే కదా ప్రాకులాట
సకల జనారణ్యం కలల్ని కంటూనే వుంటుంది
నత్తగుల్లకూ ఓ కల వుంటుంది
నది నుంచి బయటపడ్డట్టు కలల్లోంచి బయట పడలేం
నదిలో స్నానించి నీళ్ళు అంటనట్టు
తడిని తుడుచుకోవడం ఇక్కడ చెల్లదు
నిప్పులో కాలిన గాయం బర్రలాంటిది
శరీరానికి అంటే వుంటుంది
కలల్ని మోయడం తల్లి బిడ్డను ప్రసవించినట్టే
దానికి కుడా రక్తమాంసాలు అంటి వుంటాయి
సాధనలో జీవితం, జీవి సమస్తం అంతరిస్తాయి
కలలు నీళ్ళ జలతారు, జీవితం ముఖమల్ దుప్పటిని పోలి
రెండు మెరుస్తుంటాయి జీవిత కలలు
ప్రభావ ప్రయాణం తీరని దాహం.
-హనీఫ్, 9247580946