పందెం కోడి వేలంలో ట్విస్ట్‌

పందెం కోడి వేలంలో ట్విస్ట్‌– కోడి నాదేనంటూ ఓ వ్యక్తి వీడియో రిలీజ్‌
– వేలాన్ని రద్దు చేసి జంతుసంరక్షణ శాఖకు అప్పగించిన ఆర్టీసీ
నవతెలంగాణ – కరీంనగర్‌
నాలుగు రోజుల కిందటం టీఎస్‌ఆర్టీసీ కరీంనగర్‌ బస్సులో పందెం కోడిని ప్రయాణికుడు మరిచిపోగా.. దాన్ని శుక్రవారం సాయంత్రం వేలం వేద్దామకున్న అధికారులకు ఓ వ్యక్తి ట్విస్ట్‌ ఇచ్చాడు. ‘ఆ కోడి పుంజు నాదే.. ఇచ్చేయండి సారూ..’ అంటూ అధికారులకు మొర పెట్టుకోవడంతో పందెకోడి వేలం ఎపిసోడ్‌ ముగిసినట్టయింది. అయితే సదరు కోడిని మాత్రం జంతు/పక్షి సంరక్షణ శాఖకు అప్పగిస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
నాలుగు రోజులుగా కరీంనగర్‌ బస్టాండ్‌ రెండో డిపోలో ఓ కోడిపుంజు బందీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎవరూ రాకపోవడం, దానికి తోడు రెండ్రోజుల్లో సంక్రాంతి పండుగ ఉండటంతో ఆర్టీసీ అధికారులు దానిని వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం మధ్నాహ్నం 3 గంటలకు కోడిని వేలం వేస్తున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. ఈ విషయం సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ సమయంలో ప్రకాశం జిల్లా రుద్రంగికి చెందిన మహేష్‌ ఓ వీడియోను రిలీజ్‌ చేశాడు. కరీంనగర్‌ బస్సులో మరిచిపోయిన పందెం కోడి తనదేనని, దాన్ని తనకు అప్పగించాలని కోరాడు. రుద్రంగిలో మేస్త్రీ పని చేసుకునే మహేష్‌.. ఆ కోడి తన పెరట్లో తిరిగిన వీడియోనూ జత చేశాడు. అయితే ఆర్టీసీ అధికారులు మాత్రం ఆ కోడిని తిరిగి ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. ‘ఇన్ని రోజుల నుంచి లేనిది.. వేలం వేస్తున్నామనగానే గుర్తుకొచ్చిందా?’ అంటూ ప్రశ్నించారు. కోడిని ఇచ్చేదే లేదని స్పస్టం చేసి జంతు/పక్షి సంరక్షణ శాఖకు అప్పగించారు.