– గాజా సంక్షోభంపై అలీనోద్యమ సమావేశాల్లో భారత విదేశాంగ మంత్రి జై శంకర్
కంపాలా : గాజాలో ప్రస్తుతం కొనసాగుతున్న హింసాకాండను చూస్తుంటే అక్కడి సంక్షోభానికి సుస్థిరమైన, శాశ్వతమైన పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం వుందని స్పష్టమవుతోందని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ పేర్కొన్నారు. ఉగాండా రాజధాని కంపాలాలో జరుగుతున్న నామ్ సదస్సులో ఆయన మాట్లాడారు. గాజాలోని హింస, ఘర్షణలు పశ్చిమాసియాలోని ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గాజాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధంపై నామ్ సదస్సులో తీవ్ర విమర్శలు, ఖండనలు వెల్లువెత్తిన తరుణంలో జై శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం గాజాలో నెలకొన్న పరిస్థితులు ఎలా వున్నాయో మనందరికీ తెలుసు, ఆ మానవతా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అరకొర చర్యలు సరిపోవు, అక్కడి బాధితులకు తక్షణమే ఉపశమనం కలిగించగల శాశ్వత పరిష్కారం అవసరమని’ జై శంకర్ స్పష్టం చేశారు. తీవ్రవాదం, బందీలుగా నిర్బంధించడం కూడా ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని మనం స్పష్టం చేయాల్సి వుందన్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లోని సంక్షోభాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఆధునిక కాలంలో ఎక్కడ, ఏ సమయంలో ఘర్షణలు చెలరేగినా వాటి పర్యవసానాలు అన్ని చోట్లా వుంటాయని చెప్పారు. స్వేచ్ఛాయుత పాలస్తీనా దేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. సురక్షితమైన సరిహద్దుల మధ్య పాలస్తీనియన్లు ప్రశాంతంగా జీవించేలా రెండు దేశాల ఏర్పాటు ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు. ఈ దిశగా మనందరం ఉమ్మడిగా కృషి చేయాలని కోరారు. ఏ పక్షం తీరును కూడా జై శంకర్ ఖండించలేదు. పాలస్తీనాకు భారత్ అందించిన మానవతా సాయం గురించి మాత్రమే పునరుద్ఘాటించారు. ఇప్పటివరకు భారత్ 70టన్నుల సాయాన్ని అందించిందన్నారు. వాటిలో 16.5 టన్నుల ఔషధాలు, వైద్య సామాగ్రినే వున్నాయన్నారు. ఇటీవల టెహరాన్‌లో పర్యటించిన జై శంకర్ ప్రాంతీయ పరిస్థితులపై, ఎర్ర సముద్రంలో భద్రతకు ఎదురవుతున్న ముప్పులపై ఇరాన్ నేతలతో చర్చించారు. గాజా యుద్ధం ఆరంభమైనప్పటి నుండి జై శంకర్, ప్రధాని నరేంద్ర మోడీలు పశ్చిమాసియా ప్రాంత నేతలతో మాట్లాడుతునే వున్నారు. శుక్రవారం బహ్రైన్, ఈజిప్ట్ విదేశాంగ మంత్రులతో జై శంకర్ భేటీ అయ్యారు. పశ్చిమసియాలో నెలకొన్న పరిస్థితులపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం క్యూబా ఉపాధ్యక్షుడు సాల్వడార్ వాల్డెస్ మీసా నామ్ సదస్సులో మాట్లాడుతూ, గాజాపై ప్రస్తుతం ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధం ఇప్పటివరకు చరిత్రలో నమోదైన అత్యంత దారుణమైన మారణహోమాల్లో ఒకటని అన్నారు.