– ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, బీసీ, ఎస్సీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏక రూప దుస్తులు ఒక జత ఈ నెల 14వ తేది లోగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో మహిళా శక్తి కుట్టు కేంద్రాల ద్వారా ఆయా పాఠశాలలకు సంబంధించిన ఏకరూప దుస్తుల స్టిచింగ్‌పై సమావేశం నిర్వహించారు. ఆయా శాఖలకు చేరుకున్న క్లాత్‌ను విద్యార్థుల వారీగా కొలతలు తీసుకుని, మహిళా శక్తి కుట్టు కేంద్రాలకు దుస్తులు కుట్టుటకు అప్పగించాలని డీఆర్డీఓ, మేప్మాను ఆదేశించారు. బేల, జైనధ్, నర్సాపూర్, బట్టిసవర్గాం, పాఠశాలలకు సంబంధించి ఒక జత అక్టోబర్ 14 లోపు ఏకరూప దుస్తులు అందించాలని మిగితా 2, 3 జతల ఏకరూప దుస్తులు అక్టోబర్ 25 లోగా అందించాలని సూచించారు. గడువులోగా పూర్తి కావాలని నిర్లక్ష్యం వహించకుండా సకాలంలో పూర్తి చేసి విద్యార్ధులకు అందించాలని తెలిపారు. సమావేశంలో సంబంధిత అధికారులు ఉన్నారు.