హీరో కార్తి నటించిన తన 25వ చిత్రం ‘జపాన్’. ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్‌ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. దీపావళి కానుకగా నేడు (శుక్రవారం) గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలౌతుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజు మురుగన్ మీడియాతో ముచ్చటించారు. నేను సినిమాల్లోకి రావడానికి చార్లీ చాప్లిన్ గొప్ప స్ఫూర్తి. నేను జర్నలిస్ట్‌గా, రచయితగా, సోషల్ వర్కర్‌గా పని చేశాను. చార్లీ చాప్లిన్ సినిమాలు చూసిన తర్వాత ఒక మూకీ చిత్రం ఇన్ని ఆలోచనలు, భావోద్వేగాలను రేకెత్తించి నపుడు.. ఇప్పుడున్న సాంకేతికతను వాడుకుని సినిమా ద్వారా ప్రజలకు ఇంకా అద్భుతంగా కనెక్ట్ కావచ్చనిపించింది. ఆ స్ఫూర్తితోనే సినీ పరిశ్రమలోకి వచ్చాను. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రేక్షకుల ప్రేమ, అభిమానంతో ‘జోకర్’ చిత్రానికి అవార్డ్ తీసుకోవడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. నేను ఇంతకు ముందు చేసిన సినిమాల్లో పెద్ద హీరోలు లేరు. కార్తి మంచి స్నేహితుడు. సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి. ఆయన్ను కలిసినప్పుడు హ్యుమర్‌తో కూడిన మంచి కథ రాస్తే ప్రాజెక్ట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కథ చేయడానికి కార్తినే నన్ను మోటివేట్ చేశారు. కార్తి లాంటి పెద్ద హీరోలతో సినిమా చేసినప్పుడు సందేశం భారీస్థాయిలో ప్రేక్షకులకు చేరుతుంది. జపాన్ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్. కార్తి, నిర్మాతలు ప్రభు, ప్రకాష్ సహకారంతోనే ఇంత గ్రాండ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజారు చేస్తారు. వారికి కొత్త అనుభూతిని పంచుతూ అలరిస్తుంది. దర్శకుడు కుమారరాజ త్యాగరాజు ”మోడరన్ లవ్ చెన్నై’ సిరీస్‌కి నిర్మాత. ఒక ఎపిసోడ్‌కి దర్శకత్వం వహించమని నన్ను అడిగారు. ఇది లవ్ బేస్డ్ థీమ్ కావడంతో డైరెక్ట్ చేయడానికి అంగీకరించాను.