– ప్లేట్ భోజనం 7% భారం
– పప్పులు, టమాట ధరల ఎఫెక్ట్
– క్రిసిల్ రిపోర్ట్
న్యూఢిల్లీ : శాఖహారం వ్యయం పెరిగిపోయింది. ప్రస్తుత ఏడాది ఫిబ్రవరిలో కుటుంబాల శాఖహారం ప్లేట్ వ్యయం 7 శాతం పెరిగిందని క్రిసిల్ ఓ రిపోర్ట్‌లో తెలిపింది. మరోవైపు చికెన్ ధరలు తగ్గడంతో చికెన్ ప్లేట్ వ్యయంలో 9 శాతం తగ్గుదల చోటు చేసుకుందని వెల్లడించింది. ముఖ్యంగా గడిచిన నెలలో పప్పులు, టమాటా, ఉల్లి ధరలు భారీగా పెరగడంతో శాఖహారం భోజనం ప్రియమయ్యిందని రేటింగ్ ఎజెన్సీ క్రిసిల్ విశ్లేషిచింది. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లోని అహారోత్పత్తుల ధరలను విశ్లేషించి భోజనం ప్లేట్ వ్యయాన్ని లెక్కగడుతుంది. ఇది సగటు ప్రజల ఖర్చుల్లో మార్పులను సూచిస్తుంది. ఇందులో ప్రధానంగా తృణ ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, మసాలలు, వంట నూనె, గ్యాస్ ధరలను పరిగణలోకి తీసుకుంటుంది. మాంసహారంలో పప్పులకు బదులు బాయిలర్ చికెన్ ధరలను తీసుకుంటుంది.ఏడాదికేడాదితో పోల్చితే గడిచిన నెలలో ఉల్లి, టమాట ధరల్లో వరుసగా 29 శాతం, 38 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. శాఖహార ప్లేట్ భోజనంలో 12 శాతం వాటా వీటిదే. ఏడాదికేడాదితో పోల్చితే పప్పుల ధరలు 14 శాతం ఎగిశాయి. శాఖహార భోజనంలో పప్పుల వాటా ఇది వరకు 9 శాతంగా ఉంటే.. ఇప్పుడు 20 శాతానికి చేరింది. పప్పులు, ఉల్లి, టమాటా ధరల పెరుగుదల అనేక కుటుంబాల ఆదాయాలను దెబ్బతీస్తున్నాయి. హెచ్చు ధరలు ప్రజల జేబులకు చిల్లులు పెట్టడంతో పొదుపు శక్తి తగ్గుతోంది.
5.09 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం..
ప్రస్తుత ఏడాది ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) 5.09 శాతంగా చోటు చేసుకుందని మంగళవారం కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది. ఇంతక్రితం నెలలో ఇది 5.09 శాతంగా ఉంది. ఫిబ్రవరిలోనూ ఆహార ద్రవ్యోల్బణం 8.30 శాతం నుంచి 8.66 శాతానికి పెరిగింది. గ్రామీణ ద్రవ్యోల్బణం యధాతథంగా 5.34 శాతంగా చోటు చేసుకుంది. పట్టణ ద్రవ్యోల్బణం 4.92 నుంచి 4.78 శాతానికి తగ్గింది. కూరగాయల ధరలు 27.03 శాతం నుంచి 30.25 శాతానికి ఎగిశాయి.