పగ తీర్చుకున్న దెయ్యం

A vengeful ghostహర్రర్‌, సస్పెన్స్‌, కామెడీ కథా చిత్రాలకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఆ కోవలో విభిన్నంగా తెరక్కెక్కించిన చిత్రం ‘బ్లడ్‌’. గతంలో ‘డేంజర్‌ లవ్‌ స్టోరీ’తో పాటు పలు చిత్రాలను నిర్మించిన అవధూత గోపాల్‌ దర్శక,నిర్మాతగా తీసిన చిత్రమిది. శ్రీ లక్ష్మీ కనకవర్షిణి క్రియేషన్స్‌ పతాకంపై గౌరవ్‌ హీరోగా, గోపాలరావు, నందినీ కపూర్‌, జబర్దస్త్‌ వినోదిని, రాకింగ్‌ రాకేష్‌, ప్రధాన పాత్రలలో నటించారు.
మంగళవారం ఫిలింఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో అతిథులుగా విచ్చేసిన దర్శకులు రేలంగి నరసింహారావు, ‘జబర్దస్త్‌’ అప్పారావులతో పాటు నటుడు విజయభాస్కర్‌ చిత్ర ప్రోమోలను ఒక్కొక్కరు ఒకటి ఆవిష్కరించగా, ‘జబర్దస్త్‌’ వినోదిని, ‘జబర్దస్త్‌’ చిట్టిబాబు, నటులు కొల్హాపూర్‌ రామచంద్ర గౌడ్‌, ఆనందభారతి, కొల్హాపూర్‌ రామకష్ణ ఐటమ్‌ సాంగ్‌ను ఆవిష్కరించారు.
దర్శక, నిర్మాత అవధూత గోపాల్‌ మాట్లాడుతూ,’ట్రెండ్‌కు అనుగుణంగా తీసిన చిత్రమిది. ఈ నెల 27న చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో విడుదల చేయబోతున్నాం. ఓ యువతి హత్యకు గురైన నేపథ్యంలో దెయ్యంగా మారి, తనకు అన్యాయం చేసిన వారిపై ఏ విధంగా పగ తీర్చుకుందన్న అంశాన్ని ఇందులో చాలా ఆసక్తికరంగా చూపించాం. ఊహించలేని ట్విస్టులు, సస్పెన్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇందులో నేను ద్విపాత్రాభినయం చేశాను’ అని చెప్పారు.