తెలుగు సాహిత్యంలో ఇప్పుడు ప్రధానంగా మైనారిటీ సాహిత్యం పేరుతో ముస్లింవాద మైనారిటీ సాహిత్యం మాత్రమే ప్రస్ఫుటంగా వస్తున్నది. భారతీయ సమాజంలో ఇతర మైనారిటీ సమూహాలున్న ఉదాహరణకు క్రిష్టియన్లు, సింధీలు, పారసీలు, జైనులు, బుద్ధిస్టులు వీరికి సంబంధించిన సాహిత్యం తెలుగులో మాత్రం అరుదుగా కనబడుతుంది. ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం సాహిత్య సందర్భంలో ‘మైనారిటీ సాహిత్యం’ అనే పదప్రయోగం ఎవరు, ఏ సందర్భంలో చేశారు? దాని ఉదేశ్యం, లక్ష్యం ఏమిటి? స్థూలంగా అవలోకనం చేయడమే. అంతర్జాతీయ తెరపై వాటి విశిష్టత, లక్షణాలు, లక్ష్యాలు ఏమిటి? అని పరిశీలించడమే.
నిజానికి ఈ ‘మైనారిటీ’ అనే పదాన్ని సుప్రసిద్ధ ఫ్రెంచ్ ఫిలాసఫర్, సాహితీవేత్త గిల్లెస్ డెల్యూజ్ (Gilles Deleuze; b.1925 – d.1995), సుప్రసిద్ధ ఫ్రెంచ్ మనో విజ్ఞాన శాస్త్రవేత్త, రచయిత ఫెలిక్స్ గట్టారి (Felix Guattari ; b. 1930 – d. 1992) అనే ఇద్దరు సాహితీ విమర్శకులు సూచిస్తూ ‘మైనారిటీ సాహిత్యం’ అనేది మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మెజారిటీ వర్గానికి చెందిన వారి భాషలోనే అభివ్యక్తీకరించడం (అనగా రచన మైనారిటీ వర్గానికి చెందిన భాషలో ఉండకపోవడం) జరగాలి అని అభిప్రాయపడినారు.
కాఫ్కా, జెక్ (Czech) ప్రాంతానికి చెందిన యూదు (Jew) సామాజిక వర్గానికి చెందిన వారు. కానీ, రచనలు మాత్రం జర్మనీ భాషలో చేశారు. వీరు ప్రతిపాదించిన ‘మైనారిటీ సాహిత్యం’ అనే నిర్వచనం వారి దక్పథంలో పరిశీలిస్తే కొంత వరకు మాత్రమే మైనారిటీలకు న్యాయం చేస్తున్నదని, పూర్తి మైనారిటీ వర్గాలను తన పరిధిలోకి తీసుకోవడం లేదనే భావనకు వచ్చారు సాహితీ విమర్శకులు. అందుకే మైనారిటీ సాహిత్యాన్ని పునర్నిర్వచనం చేయాలన్న ఆలోచనతో ఇటలీలో నివసించే స్లొవేనియన్ల సాహిత్యాన్ని, అలాగే స్లోవేనియా, క్రొయేషియాలో నివసించే ఇటాలియన్ల సాహిత్యాన్ని ఆధారంగా చేసుకుంటూ విశ్లేషిస్తూ వచ్చారు.
పరిచయం, నేపథ్యం: ప్రపంచీకరణ నేపథ్యంలో పెరుగుతున్న భిన్న సంస్కతుల వెల్లువ కారణంగా, ఫలితంగా భిన్న సంస్కతుల మధ్య పొడసూపుతున్న వైరుధ్యాలు ఉత్పన్నం కావడంతో ‘తిరోగమన చర్య’ (Reverse progress) లను రేకెత్తించడంతో ప్రాంతీయ ప్రాధాన్యమైన (region -specificity) లక్షణాలు – ఆస్తిత్వ చిహ్నాలు, స్థానిక, ప్రాంతీయ చరిత్ర వాటి మూలాలు, వ్యక్తులలో, జాతులలో కొత్త ప్రాధాన్యతను, స్థాయిని సంతరించుకున్నాయి. ఈ చిహ్నాలు ప్రతి జాతికి తమ సామాజిక, సాంస్కతిక ఆవరణలలో తమ చరిత్రను స్థిరీకరించుకోవడానికి స్వీయ కార్యాచరణగా వుండే అవకాశముంటుంది. సాహిత్య సజన ద్వారా కూడా వీటి ప్రాముఖ్యత ఉంటుంది. ‘మైనర్ కమ్యూనిటీ’, ‘మైనారిటీ కమ్యూనిటీస్’ – ఈ పదాలు చారిత్రాత్మక ప్రాధాన్యత గల ఒక జాతి సమూహాన్ని సూచిస్తాయి. ఈ జాతి సమూహం ప్రపంచంలోని ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెద్ద ఎత్తున వలస వచ్చి, శతాబ్దాల తరబడి పెద్ద పెద్ద నగరాలలో స్థిరపడిపోయిన వారిని తెలుపుతుంది. అంతర్జాతీయంగా చూస్తే, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఇటలీ, పూర్వ యుగోస్లావియా మధ్య సరిహద్దు ప్రాంతాలు విడిపోయి ఈ రోజు ఇటలీ, స్లోవేనియాగా గుర్తించబడుతున్నాయి. ఈ విభజన ఫలితంగా రెండు మైనారిటీ జాతి సమూహాలు పుట్టుకొచ్చాయి. ఒకటి – ఇటలీలో స్లోవేనియన్ మైనారిటీ, రెండవది – స్లోవేనియా, క్రొయేషియాలో ఇటలీ మైనారిటీ. ఈ నేపథ్యంలో ప్రాంతీయ స్పహతో వస్తున్నటువంటి మైనారిటీ సాహిత్యాన్ని అంచనా వేస్తే స్థానికత లేదా ప్రాంతీయత ప్రధానమైన మూలకంగా మారుతుంది. ఎందుకనగా భిన్నత్వంగా వుంటూ తమ అస్తిత్వాన్ని, ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నంగా సాగుతుంది. ఆ ప్రయత్నం దిశగా సాగుతూ దేశ సరిహద్దులను దాటి కూడా దేశాంతర (Transnational) సాంస్కతిక, సాహిత్య మూలాలను మైనారిటీ లేదా ప్రాంతీయ సాహిత్యం తనలో ఇముడ్చుకొని వుంటుంది. ఈ నేపథ్యంలో మైనారిటీ సాహిత్యాన్ని పునర్- నిర్వచించాల్సిన అవసరాన్ని సాహిత్య విమర్శనా రంగం గుర్తించింది. వ్యక్తి ప్రవర్తన, మాట, సాంప్రదాయాలు, మానవీయత, భౌతిక, మానసిక స్థితులకు సంబంధించిన ఆంశాలమీద దష్ఠి కేంద్రీకరించి పరిశోధనలు జరగాల్సిన అవసరముందని రచయిత్రి సెర్గళ్ (Jadranka Cergol) వ్యాఖ్యానించడమేగాక ఆ దిశగా ప్రత్యేక కషి చేసింది.
మైనారిటీ సాహిత్యం: పరిశోధకులు గిల్లెస్ డెల్యూజ్, ఫెలిక్స్ గట్టారి, కాఫ్కా రచనల మీద చేసిన మోనోగ్రాఫ్‌లో సిద్ధాంతపరంగా, విధానపరంగా మైనారిటీ సాహిత్యానికి సంబంధించిన విషయం మొదటగా వివరించబడినది. వీరు మైనారిటీ సాహిత్యాన్ని మైనారిటీ వర్గం వారు, వారి మైనారిటీ భాషలో సష్టించలేదని, మెజారిటీ వారి భాషలోనే వారి రచనలు సాగాయని గుర్తించారు. వీరి ఉద్దేశంలో మైనారిటీ సాహిత్యంలో మొదటి ప్రధాన లక్షణం ఏమిటంటే ‘ప్రాదేశికత’ (Deterritorialisation) అనగా వారి మాతభాష నుండి రచనాపరంగా దూరంగా ఉండటం. రెండవ లక్షణం మైనారిటీ సాహిత్యంలో ‘రాజకీయ సమగ్రత /నిబద్దత’ (Political integration). మూడవ లక్షణం – ‘సామూహిక/ సంఘటిత విలువలు’ (collective values) కలిగివుండటం. మైనారిటీ సాహిత్యం సాధారణంగా రాశిలో తక్కువగా వున్నా మైనారిటీ వర్గానికి చెందిన వారి లక్ష్యం ఒకటిగానే ఉండాలి (collective destiny). ఫలితంగా ‘సామూహిక అభివ్యక్తీకరణగా’ (collective expression) వుండి సమస్యలను సరియైన పద్ధతిలో సమాజం ముందు ప్రస్తావించవచ్చు. ”మైనారిటీ సాహిత్యం అనే పదాన్ని ఒక స్వతంత్రమైన సాహిత్య వ్యవస్థగా చూడలేం” అని ఇటలీ లోని స్లోవేనియన్ సాహిత్య సజనను ఉద్దేశించి ప్రముఖ విమర్శకుడు బందెల్జ్ వ్యాఖ్యానిస్తాడు. ‘మైనారిటీ లిటరేచర్’ అనే పదాన్ని ఇటలీలో సాహిత్య సజనలో విరివిగా వాడిన వ్యక్తి డేవిడ్ బందెల్జ్ (David Bandelj). బందెల్జ్ కూడా మైనారిటీ సాహిత్యాన్ని ఒక దేశాంతర సాహిత్యంగా వివేచిస్తాడు. తాను నిర్వచిస్తూ మూడు నిబంధనలను సూచిస్తాడు, అవి : 1. అంతర్జాతీయ పరిధిలోకి రావడం, 2. ఒకే స్థాయికి చెందిన చారిత్రిక, సామాజిక స్థితిగతులు, 3. స్వతంత్ర మూలాలు (Independence of the genesis). బందెల్జ్ ఈ మూడు నిబంధనల పరిధులను అంగీకరిస్తాడు. మైనారిటీ సాహిత్యంలో వర్తమాన సమాజం సష్టించిన పరిస్థితుల కారణంగా వ్యవస్థలో నిబిడీకతమైవున్న, మానవ సంబంధాల మధ్యవున్న విలువలను, వాటి సౌందర్యాన్ని, ప్రామాణికతను వ్యక్తి తన విధి (fate) గా తానే అంగీకరించే స్తితిలో ఉంటాడు. అలా కాకున్న ఫలితంగా ఈ ఆధునిక ప్రపంచం కేవలం విషాదాలను, భయాన్ని మాత్రమే సష్టిస్తున్నదని భావిస్తాడు. చివరికి వ్యక్తి తన కర్మను తానే నమ్మలేని స్థితికి వస్తాడు. భవిష్యత్తును ఒక భయానక దశ్యంగా చిత్రించే విషాదకర పరిస్థితుల్లోనూ మానవీయతపై నమ్మకం కోల్పోకుండా ప్రపంచాన్ని, సమాజాన్ని ఒక సరియైన పద్దతిలో, సక్రమ మార్గంలో నడిపించగలమనే ఆత్మ విశ్వాసాన్ని ఇటాలియన్ రచయిత సురాన్ (Fulvio Suran) తన కవిత్వం ద్వారా వినిపిస్తాడు.
జాతి భావన (Ethinicity): మైనారిటీ సాహిత్యానికి ప్రధాన ప్రేరణగా జాతి, వర్గ భావన వుంటుంది. మైనారిటీ సాహిత్యం కూడా సంస్కతి, భాష సాంప్రదాయాలతో సంబంధం కలిగివుంటుంది. కనుక దీనిని జాతీయ సాహిత్యం (National literature) నుండి విడిగా చూడలేం. భాష, జాతి మూలం ఈ రెండిటికీ గల అవినాభావ సంబంధం మైనారిటీ సాహిత్యానికి ఒక విలక్షణతని ఆపాదిస్తుందని సెర్గిల్ (Cergil) అంటారు. ఇటాలియన్ యువ రచయితలు, కళాకారుల తరం కూడా (Marco Apollonia, M.Tremul, Roberto Dobran, Franco Juri) తమ పూర్వీకుల మాదిరి గాక ప్రపంచాన్ని మరో కొత్త కోణంలోంచి చూసే అనుభవంలోకి వచ్చింది. ఆ అనుభవం ఎలాంటిది అంటే చారిత్రాత్మక సంఘటనలు సష్టించిన విషాదాలు, వేదనల కన్నా వారి సముదాయాల (community) అస్తిత్వాన్ని, నిజాయితీ, నిబద్ధతను నిరూపించుకోవడం అవసరమనిపించి వారి స్థానాన్ని పునర్ నిర్వచించుకోవాలి. ప్రశ్నించబడుతున్న తమ అస్తిత్వం కేవలం స్థానికం గావడం బాధించే విషయం. అందుకే ఈ రచయితల రచనలు చాలావరకు గుర్తింపు (Identity crisis) పొందకపోవడం, తరాల మధ్య సంఘర్షణ (generational conflict) ఉండటం జరుగుతుంది. తమ మూలాల పట్ల నిబద్దత, సంప్రదాయం లేదా వీటికి విరుద్ధంగా/ ప్రతిగా ధిక్కార స్వరం వినిపించడం కూడా జరుగుతుంది. 1980 లో టిటో (Tito) మరణం, 1989లో ఆల్బనియన్ల తిరుగుబాటు, 1991 లో స్లొవేనియా స్వాతంత్రం సాధించడం, తరువాత క్రోషియా (Crotia), బోస్నియా(Bosnia) లో యుద్ధాలు ఒక విచిత్రమైన స్థితిని సష్టించాయి. ఈ గడ్డు పరిస్థితులు శరణార్థులను, వలసవాదులను, దేశ బహిష్కరణకు గురైన వారిని సష్టించాయి.
స్లోవేనియా, క్రోషియాలో ఇటాలియన్ రచయితలు తమ విశేషణమైన అభివ్యక్తిగా చిన్నకథలు ఎన్నుకోవడంతో కథా ప్రక్రియ ప్రధానమైన స్థానాన్ని పొందింది. ఈ కథల రూపంలో వారి గతానికి, వర్తమానానికి మధ్య సంభాషణగా ఇటాలియన్ మైనారిటీ రచయితలు తీర్చిదిద్దారు. గతంలో జరిగిన విషాద సంఘటనల ఫలితంగా ఏర్పడిన గాయాలను దాటాలన్న స్పష్టమైన కోరిక వారిలో గాఢంగా ఏర్పడింది. వారి పూర్వీకుల మాదిరి ప్రత్యక్ష అనుభవం ఆధునిక యువ రచయితలకు లేకున్నా ఒక విధమైన సామాజిక న్యాయం జరగాలన్న తపన ఆ రచయితల్లో ఉండేది. అలాగే వీటిని పోలిన లక్షణాలు ఇటలీలోని యువ స్లోవేనియాన్ రచయితల్లో కనబడుతుంది. ఏది ఏమైనా సాహిత్యం ప్రధాన ఉద్దేశం, మౌలిక లక్ష్యం (Fundamental task) జాతి భావన, ‘జాతీయ భావన’ గుర్తింపును స్థిరీకరించడం గా వుండాలని బోరిస్ పహోర్ (Boris Pahor) భావించాడు.
ముగింపు: ఇంతకు ముందు గిల్లెస్ ఇంకా ఫెలిక్స్ మైనారిటీ సాహిత్యంపై చేసిన నిర్వచనం సంపూర్ణంగా లేదన్న భావం, కేవలం ప్రేగ్ (Prague – Czech Republic) లో వుండి జర్మనీ మాట్లాడే యూదు (Jew) ఫ్రాంజ్ కాఫ్కా రచనల మీద ఆధారపడి చేసిన నిర్వచనం, రెండవ ప్రపంచ యుద్ధం ఫలితంగా తలెత్తిన పరిణామాల ద్వారా పుట్టుకొచ్చిన మైనారిటి జాతుల సముదాయాల సాహిత్యాన్ని పునర్నిర్వచించాల్సిన అవసరం వుందనే భావనకు వచ్చారు విమర్శకులు. అందుకు ఈ చారిత్రాత్మక మైనారిటీ జాతుల సామాజిక – రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం వుంది. ఇందులో వలసల ద్వారా వచ్చి చేరిన కొత్తగా ఏర్పడిన మైనారిటీ సముదాయాలను లెక్కలోకి తీసుకోకూడదు.
– డా. రూప్ కుమార్, డబ్బీకార్, 91778 57389