కార్మిక వ్యతిరేక విధానాలపై సమరశీల పోరు సాగించాలి

– సీఐటీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ కే.హేమలత పిలుపు
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు సాగించాలని సీఐటీయూ జాతీయ అధ్యక్షులు కే హేమలత పిలుపునిచ్చారు. సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (సీఐటీయూ) జాతీయ వర్కింగ్‌ కమిటీ సమావేశాలు శుక్రవారం హన్మకొండ ఫాతిమా నగర్‌లోని బాలవికాసలో ఉత్సాహంగా ప్రారంభ మయ్యాయి. ముందుగా సీఐటీయూ పతాకాన్ని జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ కే.హేమలత ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు నివాళులు అర్పిస్తూ కళాకారులు పాటలు పాడారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిందాబాద్‌.. కార్మిక వర్గ ఐక్యత వర్ధిల్లాలి, మతతత్వ విధానాలు నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వర్కింగ్‌ కమిటీ సమావేశాలను జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జాతీయ అధ్యక్షులు కే.హేమలత మాట్లాడుతూ.. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం పెరుగుతోందని, దీని ప్రభావం మన దేశంపైన తీవ్రంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల పేద, ధనిక తారతమ్యాలు తీవ్రమవుతున్నాయని వాటి దుష్ఫలితాల వల్ల నిరుద్యోగం, దారిద్యం పెరుగుతుందని విమర్శించారు. కనీస వేతనాలు ధరలకు అనుగుణంగా పెరగకపోవడం వల్ల కొనుగోలు శక్తి క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ కంపెనీలకు గణనీయ లాభాలు, కార్మికుల వేతనాలు క్షీణించడం ఒక ధోరణిగా ప్రభవించిందన్నారు. వ్యవసాయరంగం గత ఐదేండ్లుగా సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఈ నెల 16న గ్రామీణ భారత్‌ బంద్‌, కార్మిక సమ్మెకు సన్నద్ధమవుతున్నట్టు తెలిపారు. ఈ కార్మిక సమ్మెలో కోట్లాదిమంది కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతాంగ సమస్యలు పరిష్కరించలేక రామాలయ నిర్మాణం పేరుతో భావోద్వేగాల ఆధారంగా 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నదన్నారు. బహుళ జాతి సంస్థల ప్రయోజనాల కోసం దేశంలోని 139 కోట్ల మంది ప్రజల హక్కులను పణంగా పెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. ముందుగా ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్‌ స్వాగత ఉపాన్యాసం చేశారు. పోరాటాల గడ్డ, చారిత్రక నగరం హన్మకొండలో జాతీయ సమావేశాలు నిర్వహించడం సంతోషం అన్నారు. ఈ సమావేశాలను ఉపయోగించుకొని రాబోయే కాలంలో ప్రజా, కార్మిక సమస్యల మీద పోరాటాలు చేస్తూ సీఐటీయూని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ రాష్ట్ర కార్యదర్శి జే.వెంకటేష్‌, భూపాల్‌, ఎస్‌. రమ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు టీ.ఉప్పలయ్య, జిల్లా నాయకులు గాదె ప్రభాకర్‌ రెడ్డి, మెట్టు రవి, బొట్ల చక్రపాణి, సారంగపాణి, బి.సంపత్‌, రజితలతోపాటు జాతీయ వర్కింగ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.