తలెత్తిన ధిక్కార స్వరం

కవయిత్రి సామాజిక కార్యకర్తగా ఎన్నో ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మహిళా సమస్యలు, సారా వ్యతిరేక పోరాటం, వరకట్న వ్యతిరేక ఉద్యమాల్లో పనిచేశారు. ఉపాధ్యాయినిగా వృత్తిని ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తూ కవిత్వంతో సమాజంలోని ఎన్నో రుగ్మతలపై బలమైన అభివ్యక్తితో చైతన్యపూరితమైన కవిత్వం రాశారు. రెండు దశాబ్దాల క్రిందటే ‘సూర్యునితో పోటీ పడి’ అనే కథా సంపుటి తీసుకొచ్చారు. ‘తలెత్తి…’ అనే ఈ కవితా సంపుటిని కూడా ద్వితీయ ముద్రణయే. ఇది కూడా 2002 లో ప్రచురణైంది.
‘ఆశ’లో ఆమె ఇలా అభివర్ణించారు. ‘చిన్నప్పుడు మా నాన్నంటే నాకు భయం. అయినా ఆశ. ఎప్పుడైనా ఇష్టంతో దగ్గరకు తీసుకోడా’ అని. ‘పెళ్లయ్యాక మా ఆయనంటే నాకు భయం. అయినా ఇష్టం. ఎప్పుడైనా మనస్ఫూర్తిగా కౌగిలించుకోడా’ అని. ‘ముసలయ్యాక నా కొడుకంటే భయం. అయినా ప్రేమ. ఎప్పుడైనా ఆప్యాయంగా అన్నం పెట్టడా’ అని. మన పురాణాలు చెప్పిన అంశాల్ని వ్యంగ్యంతో పై కవితలో అక్షరీకరణ అద్భుతం. ‘చిన్నప్పుడు తండ్రి పెద్దయ్యాక అన్నలు, పెళ్లి అయ్యాక భర్త, వార్థక్యంలో కొడుకు’ సంరక్షణలో స్త్రీ వుండాలన్నది ఓ నాటి మాట. అమృత లత ముందుమాటలో ఈ కవిత్వ సంపుటిలోని సారాన్ని ఒడిసిపట్టి చెప్పారు. దీనిలో 37 కవితలున్నాయి. ఓ మగతనమా! గొంతు విప్పాను. పరువం, పంజరం వీడి మహిళా కోర్టు, బానిస, సహజీవనం, గొడ్రాలు, అందాలరాణులు, స్పర్శ, నేనిప్పుడు, ఉద్యమ కారుడు… లాంటి కవితల్లో భావ సాంద్రత… కవయిత్రి దృష్టి కోణం, దృక్పథం స్పష్టంగా చూపుతాయి.
‘సంప్రదాయ చట్టంలో పడి వుండమంటున్నావు/ ఆడదే కదా అని అలక్ష్యం చేస్తున్నావు/ ఇది ఇంకెంత మాత్రం సహించను’ (పేజీ 14) అంటారు ‘తలెత్తి…’ కవితలో.
స్త్రీలకు పెళ్లి కన్నా సొంతంగా తన కాళ్లపై తను నిలబడాలని చెప్పే మంచి కవిత ‘గాయం’ (పేజీ 17). గర్భంలోనే ఆడపిల్లల్ని చిదిమేస్తున్న రాక్షస కాలం కన్నా కొంచెం ముందు రాసిన ‘నిట్టూర్పు’ కవితలో చివరి వాక్యాలు మనసున్న మనుషుల్ని గుండె తట్టి స్పృశిస్తాయి (పేజీ 29).
‘నర్సే నీరసంగా ఆడపిల్ల అంది, అమ్మ ముడుచుకుపోయింది. నాన్న నవ్వు ఆపేసి భారంగా నిట్టూర్చాడు’ అంటారు. చలం భావాలు కొన్ని కవితల్లో బలంగా కనిపిస్తాయి. ‘పంజరం’ వీడి అనే కవితలో చివరి వాక్యాలు ఆలోచింపజేస్తాయి.
‘నీ తాళి ని నీ అహంకారానికే/ కట్టుకో మరి నీకిచ్చేసి, కష్టమే అయినా నా కిష్టమైన విధంగా నా బతుకు నేనే బతుకుదామని’ పంజరం వీడి బయటికొచ్చేశాను’ (పేజీ 41). చాలా కవితల్లో పోరాట దృక్పథాన్ని స్పష్టంగా చెప్పడం కవయిత్రి నిబద్దతకు దర్పణంగా చెప్పొచ్చు. కవయిత్రికి అభినందనలు.

తలెత్తి…
కవయిత్రి : తుర్లపాటి లక్ష్మి
పేజీలు : 70, వెల : 50/-
ప్రచురణలు : స్నేహ ప్రచురణలు
204, శారదా సుందర్‌ రెసిడెన్సీ, భాగ్యనగర్‌చ చౌడీ దగ్గర
సరూర్‌నగర్‌, హైదరాబాద్‌ – 500035. సెల్‌ : 9866630739.

– తంగిరాల చక్రవర్తి, 9393804472