బడి మానేసిన బాలున్ని బడిలో చేర్పించిన వాలంటీర్

నవతెలంగాణ – భువనగిరి
కుటుంబ సమస్యల కారణంగా నాలుగు నెలల నుండి బడి మానేసిన బాలున్ని గుర్తించి, బడిలో చేర్పించిన సంఘటన శనివారం బస్వాపురం లో చోటుచేసుకుంది. పారా లీగల్ వాలంటీర్ కొడారి వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం భువనగిరి మండలం తుక్కాపురం గ్రామానికి చెందిన రాసాల రాజమల్లు అక్టోబర్ 5, 2023 న ఓ కేసులో అరెస్టు అయి జైలులో ఉంటున్నాడు. ఆరోజు నుండి రాజమల్లుభార్య  మాధవి, కుమార్తె హన్విక, మరియు కుమారుడు రాసాల ప్రణీత్ (7) లు బస్వాపురం లో అమ్మమ్మగారైన చుక్కల అండమ్మ ఇంటిలో ఉంటున్నారు.  గ్రామంలోని ప్రాథమిక పాఠశాల లో ప్రణీత్ ను చేర్పించుటకు ఆదార్ కార్డులు, రేషన్ కార్డులు తుక్కాపురం ఇంట్లోనే ఉండిపోవడంతో రాసాల ప్రణీత్ బడి మానేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇట్టి విషయాన్ని పారా లీగల్ వాలంటీర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా గౌరవ జడ్జి ఆదేశానుసారం రాసాల ప్రణీత్ ను శనివారం బస్వాపురం లోని ప్రాథమిక పాఠశాల లో చేర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లింగయ్య, వికలాంగుల పరిరక్షణ సమితి జిల్లా సభ్యులు మచ్చ ఉపేందర్, ఉపాద్యాయులు సైదులు, ప్రణీత్ అమ్మమ్మ చుక్కల అండమ్మ పాల్గొన్నారు.