ఓటు వజ్రాయుధం లాంటిది

– ఓటర్ల దినోత్సవ వేడుకలో గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఓటు హక్కు ప్రజల చేతిలో ఆయుధం లాంటిదని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లి జెఎన్‌టీయూ ఆడిటోరియంలో గురువారం జరిగిన 14వ జాతీయ ఓటర్ల దినోత్సవంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 3.26 కోట్ల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంతో ఆనందకరమన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా హౌం ఓటింగ్‌ దేశానికి రోల్‌ మోడల్‌గా నిలిచిందని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద లైన్‌ ఉందని కొందరు ఓటు వినియోగించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాలకు వెళ్లే సందర్భంలో మాత్రం విమానాశ్రయంలో గంటల తరబడి లైన్‌లో ఉంటారన్నారు. ఎలక్షన్‌ కమిషన్‌ వారు పోలింగ్‌ బూత్‌లో మరిన్ని వసతులు కల్పించా లని కోరారు. నోటాకు తాను వ్యతిరేకమన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు ఎన్నికల అధికారులను ప్రశంసించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు శాతం గ్రామీణ ప్రాంతాల్లో పెరగగా.. హైదరాబాద్‌ వంటి పట్టణాల్లో తగ్గిందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో గ్రామాలు, పట్టణాల్లో ఓటింగ్‌ శాతం పెరిగేందుకు మరింత కృషి చేయాలన్నారు.
రాష్ట్ర సీఈవో వికాస్‌రాజ్‌ మాట్లాడుతూ.. 2023లో కొత్తగా 9.99,667 ఓటర్లు నమోదైనట్టు వివరించారు. అలాగే 2024లో ఇప్పటి వరకు 7.50 లక్షల మంది ఓటర్లుగా నమోదు అయ్యారన్నారు. అంతకు ముందు గవర్నర్‌కు పోలీసులు గౌరవ వందనం చేయగా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి, సీఈవో వికాస్‌ రాజ్‌, అడిషనల్‌ సీఈవో లోకేష్‌ కుమార్‌, కలెక్టర్‌ గౌతమ్‌ తదితరులు పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన జిల్లా కలెక్టర్లు, అధికారులు, ఆయా పోటీల్లో రాష్ట్రస్థాయిలో విజేతలైన పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, సిబ్బందికి ప్రశంసాపత్రాల ను గవర్నర్‌ అందజేశారు. అలాగే నూతనంగా ఓటర్లుగా నమోదైన వారికి ఎపిక్‌ కార్డులను అందిం చారు. ఈ కార్యక్రమంలో ముందుగా జాతీయ గీతాలాపన చేసి.. ఓటరు ప్రతిజ్ఞ చేశారు. అడిషనల్‌ సీఈవో లోకేష్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంక్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, జోనల్‌ కమిషనర్లు స్నేహ శబరీష్‌, అభిలాష అభినవ్‌, వెంకటేష్‌ దొత్రే రవి కిరణ్‌, పంకజ తదితరులు పాల్గొన్నారు.