ఓటును నేను నోటును కాను

మందు విందు కానేకాను..
సగటు మనిషి ఆశల బాటను నేను
పేద ప్రజల మాయ చేసి నీతి నియమం గాలికొదిలి
కోట్ల ఆస్తులు గాలికొదిలి
వారసులకే పదవులిచ్చే
స్వార్థ పాలనపై వేసే వేటును నేను
అవినీతిని బహిష్కరించి అక్రమార్కుల మెడలు వంచి
కులం మతం కుళ్లుతో కంపుకొట్టే
మతోన్మాద పాలనపై
ప్రశ్నించే గొంతు చేసే తిరుగుబాటును నేను..
ఎన్నాళ్ళని ఎన్నేళ్లని
పేదోడి కంట కన్నీరని
నినదించి నిలదీయగా
నీతి లేని తుచ్చ నాయకులపై
ఎక్కు పెట్టే శ్రమ జీవుల
చేతిలోని తూటను నేను
అదరవద్దు బెదరవద్దు
కదలిరండి ఓటేద్దాం…
మనం మనం కలిసి
ప్రభంజనవుదాం..
సమ సమాజ స్థాపనకై
ఓటు విలువ చాటుదాం..
ప్రగతి బాటను పయనించేందుకు
ఓటంటే నోటు కాదనే
జన స్వరాన్ని వినిపిద్దాం…
– సాయి